PAN CARD: పాన్‌ కార్డ్ లేదా శాశ్వత ఖాతా సంఖ్య ‍‌(Permanent Account Number) అత్యంత ముఖ్యమైన వ్యాపార, ఆర్థిక గుర్తింపు పత్రం. ఆదాయపు పన్ను విభాగం జారీ చేసిన 'ఆంగ్ల అక్షరాలు + అంకెల కలబోతే' ఈ సంఖ్య. దేశంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయాలన్నా, ఆఖరుకు ఒక బ్యాంక్‌ ఖాతా ప్రారంభించాలన్నా పాన్ కార్డ్ అవసరం. కాబట్టి, ఈ ముఖ్యమైన పత్రాన్ని భద్రంగా చూసుకోవడం చాలా అవసరం. ఒకవేళ, మీ పాన్ కార్డ్‌ పాడైపోయినా, లేదా పోగొట్టుకున్నా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీరు ఇంట్లోనే కూర్చొని మళ్లీ దరఖాస్తు చేయవచ్చు, డూప్లికేట్‌ పాన్ కార్డును పొందవచ్చు. పోయిన పాన్ కార్డ్‌ని ఎలా తిరిగి పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.


మీ పాన్ కార్డ్ పోయినట్లయితే, ముందుగా మీరు చేయాల్సిన పని, దాని గురించి మీ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం. పాన్ ఒక ముఖ్యమైన ఆర్థిక పత్రం అని ముందే చెప్పుకున్నాం కాబట్టి, పోలీస్ట్ స్టేషన్‌లో  ఫిర్యాదు చేయడం అవసరం. దీనివల్ల, మరొకరు ఆ కార్డును దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవచ్చు. డూప్లికేట్ పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు కొన్ని సులభమైన దశలను అనుసరించాలి.


డూప్లికేట్‌ పాన్ కార్డ్ కోసం ఇలా దరఖాస్తు చేయండి:                      


ముందుగా NSDL అధికారిక వెబ్‌సైట్https://www.protean-tinpan.com/services/pan/pan-index.html ని సందర్శించండి.  
పాన్ సమాచారంలో మార్పులు/ కరెక్షన్‌ ‍‌(Change/Correction in PAN Data) విభాగంలోకి వెళ్లి, అప్లై ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి.
దీని తర్వాత మీ మరొక వెబ్‌ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Application Type, Category, Applicant information కనిపిస్తాయి. వాటిలో సంబంధిత వివారులను దరఖాస్తుదారు నమోదు చేయాలి.
ఆ వివరాలు నింపిన తర్వాత ఒక టోకెన్ నంబర్ జెనరేట్‌ అవుతుంది. అది దరఖాస్తుదారు ఈ-మెయిల్‌కు వస్తుంది. ఆ టోకెన్‌ నంబర్‌ గుర్తు పెట్టుకోండి.
టోకెన్ నంబర్ జెనరేట్‌ అయిన పేజీలోనే కింది భాగంలో కనిపించే "Continue with PAN Application Form" మీద క్లిక్‌ చేయాలి.
ఇప్పుడు, మీ వ్యక్తిగత వివరాలున్న పేజీ ఓపెన్‌ అవుతుంది. సంబంధిత వివరాలను ఇక్కడ నింపాలి. భౌతిక రూపంలో లేదా e-KYC లేదా e-Sign ద్వారా అన్ని వివరాలను సమర్పించవచ్చు.
మీ వివరాలను ధృవీకరించడానికి మీరు ఓటరు ID కార్డ్, పాస్‌పోర్ట్, 10వ సర్టిఫికేట్ మొదలైన వాటి కాపీని NSDL కార్యాలయానికి పంపాలి.
e-KYC కోసం, ఆధార్ నంబర్‌పై వచ్చిన OTPని వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి.  
దీని తర్వాత, e-PAN లేదా భౌతిక PAN ఆప్షన్లలో మీకు కావాల్సిన ఆప్షన్‌ ఎంచుకోండి.  
ఆ తర్వాత మీ చిరునామాను పూరించండి. ఇప్పుడు, దీనికి కొంత రుసుము చెల్లించాలి.
భారత్‌లో నివసిస్తున్న వారు రూ. 50, విదేశాల్లో నివసిస్తున్న వారు రూ. 959 చెల్లించాల్సి ఉంటుంది.
డబ్బులు చెల్లించిన తర్వాత 15 నుంచి 20 రోజులలో భౌతిక PAN కార్డ్ పొందుతారు.
అదే సమయంలో, e-PAN కార్డ్ కేవలం 10 నిమిషాల్లో అందుబాటులో ఉంటుంది. మీరు దాని డిజిటల్ కాపీని సేవ్ చేసుకోవచ్చు.