New Year 2025: కొత్త సంవత్సరం 2025 ప్రారంభం కావడానికి వారం రోజుల సమయం కూడా లేదు. కొత్త సంవత్సరంతో పాటే కొన్ని కొత్త మార్పులు కూడా వస్తున్నాయి, అవి నేరుగా మీ జేబులోని డబ్బుపై ప్రభావం చూపుతాయి. ఆ మార్పుల్లో.. కార్ ధరలు, వంట గ్యాస్‌ సిలిండర్ ధర, పెన్షన్ సంబంధిత రూల్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్, యూపీఐ 123పే రూల్స్‌, FD సంబంధిత రూల్స్‌ ఉన్నాయి.


1. కార్‌ ధరల్లో పెరుగుదల
కొత్త సంవత్సరంలో కారు కొనాలంటే మరింత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి. జనవరి 01, 2025 నుంచి... మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, హోండా, మెర్సిడెస్-బెంజ్, ఆడి, BMW వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలను 3% వరకు పెంచుతాయి. ఉత్పత్తి వ్యయం పెరగడమే ఇందుకు కారణమని కంపెనీలు ఇప్పటికే వెల్లడించాయి. అందువల్ల, హ్యాపీ న్యూయర్‌లో హ్యాపీగా కొత్త కార్‌ కొనాలని మీరు ప్లాన్ చేస్తే, ఇంకొంచం ఎక్కువ ఖర్చు చేయాలి.


2. LPG సిలిండర్ ధరలు
ప్రతి నెల మొదటి తేదీన, చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG ధరలను సమీక్షిస్తాయి. అయితే, దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ (14.2 కిలోలు) ధర గత కొన్ని నెలలుగా మారలేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర 844.50 రూపాయలు. కొన్ని నెలలుగా వాణిజ్య సిలిండర్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు $73.58గా ఉంది, కొత్త సంవత్సరంలో మన దేశంలో గ్యాస్‌ ధరలు మారవచ్చు.


3. పెన్షన్ విత్‌డ్రాలో మార్పులు
కొత్త సంవత్సరంలో పింఛన్‌దార్లకు కొంత ఊరట ఉంటుంది. జనవరి 01, 2025 నుంచి, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షన్ ఉపసంహరణ నిబంధనలను సడలిస్తోంది. దీనివల్ల, పింఛనుదార్లు దేశంలోని ఏ బ్యాంక్‌ నుంచి అయినా పెన్షన్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని కోసం వారికి అదనపు ధృవీకరణ అవసరం లేదు. ఈ సదుపాయం పెన్షనర్లకు పెద్ద ఉపశమనం.


4. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కొత్త రూల్స్‌
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ నియమాలు జనవరి 01, 2025 నుంచి మారతాయి. కొత్త నిబంధనల ప్రకారం, ప్రైమ్ వీడియోను ఒక ప్రైమ్ ఖాతా నుంచి రెండు టీవీలలో మాత్రమే చూడవచ్చు. ఎవరైనా ప్రైమ్ వీడియోను మూడో టీవీలో చూడాలనుకుంటే, అదనపు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవలసి ఉంటుంది. ఇప్పటి వరకు, ప్రైమ్ మెంబర్లు ఒకే ఖాతా ద్వారా ఐదు పరికరాల్లో వీడియోలు చూసే అవకాశం ఉంది.


5. ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) రూల్స్‌
NBFCలు, HFCల విషయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చింది. కొత్త నిబంధనలు జనవరి 01, 2025 నుంచి అమలులోకి వస్తాయి. డిపాజిట్ల భద్రతను పెంచేందుకు రూల్స్‌ మార్చారు. ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకోవడం, లిక్విడ్ అసెట్స్‌లో కొంత భాగాన్ని సురక్షితంగా ఉంచడం, డిపాజిట్లకు బీమా చేయడం వంటి మార్పులు ఇందులో ఉన్నాయి.


6. UPI 123pay కొత్త లావాదేవీ పరిమితి
ఫీచర్ ఫోన్ వినియోగదార్ల కోసం RBI ప్రారంభించిన UPI 123Pay సర్వీస్‌లో లావాదేవీ పరిమితి పెరుగుతుంది. ఇప్పటి వరకు, ఈ సేవ కింద గరిష్టంగా రూ. 5,000 వరకు లావాదేవీలు చేయవచ్చు, ఈ పరిమితిని రూ.10,000కి పెంచారు. ఈ సదుపాయం జనవరి 01, 2025 నుంచి అమలులోకి వస్తుంది.


మరో ఆసక్తికర కథనం: అంబానీ నుంచి బజాజ్‌ వరకు - ఈ ఏడాది దేశంలో అత్యంత ధనవంతులు వీళ్లే!