EPFO Contribution: ఉద్యోగ భవిష్య నిధి (EPF) కంట్రిబ్యూషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ కీలక మార్పు చేయబోతోందని సమాచారం. చిన్న తరహా పరిశ్రమలు ప్రావిడెంట్ ఫండ్లు, పెన్షన్లు, బీమాల్లో సింగిల్ కంట్రిబ్యూషన్ చేసేందుకు అనుమతించనుందని తెలిసింది. సామాజిక భద్రతా చెల్లింపులను సరళతరం చేసి ఒక అకౌంట్‌లోనే డబ్బులు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO), ఉద్యోగుల బీమా కార్పొరేషన్ (ESIC)కు వేర్వేరుగా కంట్రిబ్యూట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
పది నుంచి ఇరవై మంది వరకు ఉండే చిన్న సంస్థల కంట్రిబ్యూషన్ విధానంలోనే ప్రభుత్వం మార్పు చేయనుంది. దీనిని నిపుణుల కమిటీ ముందుగా పరిశీలించి ఆమోదం తెలపనుంది. బీమా, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇతర ప్రయోజనాలకు ఒకేసారి వేతనంలో 10-12 శాతం వరకు జమ చేయాల్సి ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఉద్యోగులు, యజమానులు, ఈపీఎఫ్‌వో, ఈఎస్‌ఐసీ స్థాయిల్లో ఇప్పటికే చర్చలు జరగాయని సమాచారం.
'మొదట నిపుణుల కమిటీని నియమిస్తాం. ఏకీకృత కంట్రిబ్యూషన్ రేటును వారు నిర్ణయిస్తారు. ఆ తర్వాత కార్మిక శాఖ నోటిఫై చేస్తుంది' అని ఓ అధికారి మీడియాకు తెలిపారు. సామాజిక భద్రతా పథకాల్లో మార్పులు చేసేందుకు, కొత్తగా సూత్రీకరించేందుకు సామాజిక భద్రతా చట్టం-2020 ప్రకారం ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. ప్రస్తుతం 10 లేదా అంతకన్నా ఎక్కువ మంది పనిచేస్తున్న చిన్న సంస్థలు ఆరోగ్య బీమా కోసం ఈఎస్‌ఐసీ పథకంలో డబ్బులు జమ చేస్తున్నాయి. 20 మంది కన్నా ఎక్కువగా ఉంటే పీఎఫ్, పెన్షన్, బీమా ప్రయోజనాల కోసం ఈపీఎఫ్‌వోలో జమ చేస్తున్నాయి.
ఇప్పుడున్న 20 మంది పరిమితిని తగ్గించి 10 మంది ఉన్న సంస్థలనూ ఈపీఎఫ్‌వో పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే జరిగితే చాలామంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఉద్యోగి వేతనంలో 3.25 శాతం వరకు యజమాని, 0.75 శాతం వరకు ఉద్యోగి తమ డబ్బును ఈఎస్‌ఐసీ ఫండ్‌లో జమ చేస్తున్నారు. ఇక ఈపీఎఫ్‌వో ఉద్యోగి సాధారణ వేతనం నుంచి 12 శాతం కంట్రిబ్యూషన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోండి
ఎస్‌ఎంఎస్: మీ ఈపీఎఫ్‌వో ఖాతాలో ఎంత డబ్బుందో తెలుసుకొనేందుకు సులభ మార్గం సందేశం పంపించడం. మీ ఫోన్లో EPFOHO UAN ENG అని 7738299899 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాలి.
మిస్డ్ కాల్: నమోదిత సభ్యులు 011-22901406 నంబర్‌కు మిస్‌డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఖాతాలోని మొత్తం తెలుసుకోవచ్చు. ఒకసారి మిస్‌డ్ కాల్ ఇవ్వగానే మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంతుందో ఒక సందేశం వస్తుంది.
వెబ్‌సైట్: నేరుగా ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లి ఖాతాలో బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
ఉమాంగ్ యాప్: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉమాంగ్ యాప్ ద్వారా మీ పీఎఫ్ పాస్‌బుక్ చూడొచ్చు. ఓటీపీ ద్వారా ఈ యాప్‌లో లాగిన్ అవ్వొచ్చు. యాప్‌లోకి వెళ్లాక ఈపీఎఫ్‌వోపై క్లిక్ చేస్తే చాలు. ఉద్యోగి సేవలకు తీసుకెళ్తుంది. అక్కడ వ్యూ పాస్‌బుక్‌పై క్లిక్ చేస్తే ఓటీపీ అడుగుతుంది. దానిని ఎంటర్ చేస్తే ఖాతాలోని మొత్తం వివరాలు కనిపిస్తాయి.