September Alert 2022: మీరు ఆదాయపన్ను చెల్లింపుదారా? రోజువారీ అవసరాల కోసం డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా? నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? అయితే సెప్టెంబర్లో ఆర్థిక పరంగా జరిగే ఐదు మార్పులు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మీ డబ్బుపై వీటి ప్రభావం బాగానే ఉంటుంది మరి!


30 రోజుల గడువు


ఐటీఆర్ ఫైల్‌ చేశాకా మీరు సమర్పించిన వివరాలన్నీ సరైనవేనని కచ్చితంగా ధ్రువీకరించాలి. గతంలో డిక్లరేషన్‌ ఇచ్చేందుకు 120 రోజుల వరకు సమయం ఉండేది. ఇప్పుడు ఆ గడువును 30 రోజులకు తగ్గించారు. ఈ ఏడాది ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు మే 31 చివరి తేదీ. ఆలస్య రుసుముతో ఆ తర్వాత నుంచి ఐటీఆర్ ఫైల్‌ చేసిన వారి డిక్లరేషన్‌ గడువును ప్రభుత్వం కుదించింది. అంటే ఆగస్టు 5న మీరు ఐటీఆర్‌ సమర్పిస్తే ధ్రువీకరణకు సెప్టెంబర్‌ 4 చివరి తేదీ అవుతుంది. తుది గడువు ముందే ఫైల్‌ చేసిన వారి డిక్లరేషన్‌ గడువులో మార్పేం లేదు.


టోకనైజేషన్‌కు నెల రోజులే


రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (RBI) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టోకెనైజేషన్‌ (Debit, Credit Card Tokenisation) అమలుకు మరో నెల రోజుల గడువే ఉంది. 2022, అక్టోబర్‌ 1 నుంచి సరికొత్త ప్రక్రియ అమలవుతుంది. ఆన్‌లైన్‌, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (POS), ఇన్‌ యాప్‌ పర్చేజెస్‌ లావాదేవీలు చేపడితే ప్రత్యేక టోకెన్లు వస్తాయి. సాధారణంగా మనం డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లావాదేవీలు చేపడితే కార్డుల సమాచారం, సీవీసీ, పిన్‌, ఎక్స్‌పైరీ డేట్‌ వంటి ఆర్థిక సమాచారం ఇకపై థర్డ్‌పార్టీల వద్ద భద్రపరచరు. బదులుగా టోకెన్‌ ఇస్తారు.


ఎన్‌పీఎస్‌ ఛార్జీల పెంపు


సెప్టెంబర్‌ నుంచి నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS) రుసుములు పెరుగుతున్నాయి. డైరెక్ట్‌ రెమిట్‌ మోడ్‌లో ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెడితే గతంలో కంట్రిబ్యూషన్‌ విలువో 0.10 శాతం ఫీజు వసూలు చేసేవారు. ఇకపై 0.20 శాతం తీసుకుంటారు. అంటే రూ.15-రూ.10,000 వరకు ట్రైల్‌ కమిషన్‌ డిడక్ట్‌ చేస్తారు. ఉదాహరణకు డైరెక్ట్‌ మోడ్‌లో రూ.50,000 పెట్టుబడి పెడితే గతంలో రూ.50 ఫీజు ఉండేది. ఇప్పుడది రూ.100కు పెరిగింది.


డెబిట్‌ / ఏటీఎం కార్డుల ఫీజు పెంపు


ఈ నెల నుంచి డెబిట్‌ కార్డు వార్షిక, జారీ ఫీజులు పెంచుతున్నట్టు కొన్ని బ్యాంకులు సమాచారం ఇచ్చాయి. కార్డులో ఉపయోగించే సెమీ కండక్టర్ల ధరలు పెరగడమే ఇందుకు కారణంగా వెల్లడించాయి. సెప్టెంబర్‌ 6 నుంచి ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు వేర్వేరు డెబిట్‌ కార్డులపై ఛార్జీలు పెంచుతోంది. ఇకపై రూపే బేసిక్‌ డెబిట్‌ కార్డు ఇచ్చేందుకు రూ.50, వార్షిక రుసుము రూ.150 తీసుకుంటారు. రెండో ఏడాది నుంచి ఇవి వరుసగా రూ.150, రూ.250గా ఉండనుంది. యెస్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా, సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు రుసుములు పెంచుతున్నాయి.


ఏపీవైలో నో ఎంట్రీ!


ఒకవేళ మీరు ఆదాయపన్ను చెల్లిస్తూ 18-40 ఏళ్లలోపు వారైతే అటల్ పెన్షన్‌ యోజన (APY)లో చేరేందుకు సెప్టెంబర్‌ 30 ఆఖరి తేదీ. ఈ నెల తర్వాత ఆదాయ పన్ను చెల్లింపు దారులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు కారు. పేదలు, సరైన పింఛను అందుకోలేని వారికి మరింత ప్రయోజనం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. 2015లో ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌లో ప్రతి నెల పెట్టుబడి పెట్టడం ద్వారా అసంఘటిత రంగానికి చెందిన వారు నెలకు రూ.1000-రూ.5000 వరకు పింఛను పొందొచ్చు.