SBI Hikes Interest Rate On Loans: దేశంలో ఎక్కువ మంది ప్రజలు, ముఖ్యంగా కామన్‌ పీపుల్‌ ఎక్కువగా వినియోగించుకునే బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ, తన ఖాతాదార్లకు పెద్ద షాక్ ఇచ్చింది. తాను మంజూరు చేసిన వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. పెరిగిన వడ్డీ రేట్లు ఈ రోజు (సోమవారం, 15 జులై 2024) నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు, ఎస్‌బీఐ లోన్‌ కస్టమర్లు మరింత ఎక్కువ వడ్డీ చెల్లించాలి.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం... బ్యాంక్ తన MCLRలో (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్‌ బేస్డ్ లెండింగ్ రేట్) మార్పులు చేసింది. ఆ సవరణల ప్రకారం, MCLR 05 బేసిస్‌ పాయింట్ల నుంచి 10 బేసిస్ పాయింట్ల (bps) వరకు పాయింట్లు పెరిగింది. అంటే వడ్డీ రేట్లు 0.05 శాతం నుంచి 0.10 శాతం వరకు పెరిగాయి. 


పెరగనున్న EMI భారం
SBI దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌. కస్టమర్ల సంఖ్య పరంగా, ఇతర అన్ని బ్యాంకుల కంటే చాలా ముందుంది. SBI MCLR పెరగడం వల్ల వివిధ రకాల లోన్ల కోసం రుణగ్రహీతలు మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. లక్షలాది మంది కస్టమర్లపై వడ్డీ భారం పెరుగుతుంది. ఫలితంగా, కొత్త మరింత ఎక్కువ EMI మొత్తం చెల్లించాల్సి రావచ్చు.


ఈ రుణాలపై వడ్డీ రేట్లు పెంచిన స్టేట్‌ బ్యాంక్‌:


-- 1 నెల కాల వ్యవధితో తీసుకునే రుణాలపై MCLRను 05 bps పెంచి, కొత్త వడ్డీ రేటును 8.35 శాతానికి చేర్చింది. నిన్నటి (ఆదివారం, 14 జులై 2024) వరకు ఈ రేటు 8.30 శాతంగా ఉంది. 
-- 3 నెలల కాల వ్యవధి రుణాలపై MCLR 10 bps పెంచి, కొత్త వడ్డీ రేటును 8.30 శాతం నుంచి 8.40 శాతంగా మార్చింది.
-- 6 నెలల కాల వ్యవధి రుణాలపై MCLR 10 bps పెంచి, కొత్త వడ్డీ రేటును 8.65 శాతం నుంచి 8.75 శాతానికి పెంచింది.
-- 1 సంవత్సరం కాల వ్యవధి రుణాలపై MCLR 10 bps పెంచి, కొత్త వడ్డీ రేటును 8.75 శాతం నుంచి 8.85 శాతానికి చేర్చింది.
-- 2 సంవత్సరాల కాల వ్యవధి రుణాలపై MCLR 10 bps పెరిగింది, కొత్త వడ్డీ రేటును 8.85 శాతం నుంచి 8.95 శాతానికి పెరిగింది.
-- 3 సంవత్సరాల కాల వ్యవధి రుణాలపై MCLR 05 bps పెంచి, కొత్త వడ్డీ రేటును 8.95 శాతం నుంచి 9 శాతానికి చేర్చింది.


MCLR అంటే, ఒక రుణం ఇవ్వడానికి బ్యాంక్‌కు అయ్యే వ్యయాలు + రుణగ్రహీత నుంచి బ్యాంక్‌ వసూలు చేసుకునే కనీస లాభం. గృహ రుణం (Home Loan) సహా వివిధ రకాల లోన్లపై వడ్డీ రేట్లను లెక్కించేందుకు బ్యాంక్‌లు ఉపయోగించే కనీస రుణ రేటు ఇది. నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, లాభాల మార్జిన్ వంటి కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని బ్యాంక్‌లు తమ MCLRను నిర్ణయిస్తాయి. భవిష్యత్‌లో ఉండే రుణ గిరాకీని దృష్టిలో పెట్టుకుని, ఇప్పట్నుంచే నిధులు సేకరించడానికి బ్యాంక్‌లు చేసిన వ్యయాలను కూడా MCLRలో కలుపుతాయి. బ్యాంక్‌లు వసూలు చేసే కనీస వడ్డీ రేట్లు ఇవి, ఇంతకుమించి తక్కువ వడ్డీకి బ్యాంక్‌లు లోన్‌ మంజూరు చేయవు. అంటే, ప్రజలు తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు MCLR కంటే ఎక్కువగా ఉంటాయి. 


MCLR పెరిగితే... ఫోటింగ్‌ ఇంట్రెస్ట్‌ రేట్‌తో (floating interest rate) ఇప్పటికే తీసుకున్న వ్యక్తిగత రుణాలు వంటి లోన్లపైనా వడ్డీ రేట్లు పెరుగుతాయి. తద్వారా EMI భారం పెరుగుతుంది. ఫిక్స్‌డ్‌ ఇంట్రెస్ట్‌ రేట్‌తో (fixed interest rate) తీసుకునే రుణాలపై ఎలాంటి ప్రభావం ఉండదు.


గృహ రుణగ్రహీతలకు ఉపశమనం
MCLR పెంపు నుంచి హోమ్‌ లోన్‌ కస్టమర్లను (SBI Home Loan) స్టేట్‌ బ్యాంక్‌ మినహాయించింది. ఫలితంగా, హోమ్‌ లోన్‌ కస్టమర్లపై భారం పడడం లేదు. SBI హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎక్స్‌టెర్నల్‌ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్‌ (EBLR) ఆధారంగా ఉంటాయి. ప్రస్తుతం EBLRలో ఎస్‌బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు.


మరో ఆసక్తికర కథనం: చల్లబడిన పసిడి సెగ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి