SBI Loan Rate Hike: దేశంలో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా', తన వడ్డీ రేట్లను పెంచింది. ఈ వడ్డీ రేట్లు నేటి నుంచి (బుధవారం, 15 మార్చి  2023) నుంచి అమల్లోకి వచ్చాయి. 


బేస్ రేట్, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్‌ను (BPLR) స్టేట్‌ బ్యాంక్‌ పెంచింది. త్రైమాసిక ప్రాతిపదికన బేస్ రేటును, BPLRని స్టేట్‌ బ్యాంక్‌ సవరిస్తుంది. ఆ సవరణలో భాగంగా రేట్ల పెంపు జరిగింది. 


స్టేట్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం... బుధవారం, 2023 మార్చి 15 నుంచి SBI BPLR 0.70 శాతం లేదా 70 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో బ్యాంక్ BPLR 14.15 శాతం నుంచి 14.85 శాతానికి చేరింది.


బేస్ రేటు కూడా పెంపు
ఇది కాకుండా, బుధవారం నుంచి SBI బేస్ రేటును కూడా 0.70 శాతం లేదా 70 బేసిస్ పాయింట్ల మేర స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పెంచింది. దీంతో ఇది  9.40 శాతం నుంచి 10.10 శాతానికి చేరింది. చివరిసారిగా, 2022 డిసెంబ్‌ నెలలో బేస్ రేట్‌ను స్టేట్‌ బ్యాంక్‌ పెంచింది. 


రుణగ్రహీతల EMI పెరుగుతుంది
రేటు పెంపు తర్వాత... BPLRతో అనుసంధానించిన SBI రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి, రుణగ్రహీతల EMI పెరుగుతుంది. ఇది కాకుండా బేస్ రేటు ఆధారంగా రుణాలు తీసుకున్న వారికి కూడా రుణ వ్యయం పెరగడంతో పాటు నెలవారీ వాయిదా (EMIs) కూడా పెరుగుతుంది.


వాస్తవానికి, రుణాలు ఇచ్చేందుకు ప్రాతిపదికగా తీసుకున్న పాత బెంచ్‌మార్క్‌లు ఇవి. కొన్నేళ్లుగా, కొత్తగా ఇచ్చే రుణాలకు ఈ బెంచ్‌ మార్క్‌లను స్టేట్‌ బ్యాంక్‌ ఉపయోగించడం లేదు. ఇప్పుడు, ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ (EBLR) లేదా రెపో రేట్ లింక్డ్ రేట్ (RLLR) ఆధారంగా స్టేట్‌ బ్యాంక్‌ రుణాలు ఇస్తోంది. 


MCLR పెంచని స్టేట్‌ బ్యాంక్‌
మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌ను (MCLR) మాత్రం స్టేట్‌ బ్యాంక్‌ పెంచలేదు. ఏడాది 8.50 శాతం, రెండు సంవత్సరాల కాలానికి 8.60 శాతం, మూడు సంవత్సరాల కాలానికి 8.70 శాతంగా MCLR ఉంది. 


నిధుల వ్యయం ఆధారంగా MCLRను బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే... నిధుల సమీకరణ కోసం బ్యాంకులు చేసే వ్యయాల ఆధారంగా మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌ను నిర్ణయిస్తాయి. ఈ శాతాని కన్నా తక్కువకు బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ఈ విధానం 2016 నుంచి అమల్లోకి వచ్చింది. ఒక రోజు (Over night), ఒక నెల, 3 నెలలు, 6 నెలలు, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు, ఇలా వివిధ కాలావధుల కోసం MCLR ను బ్యాంకులు నిర్ణయిస్తాయి. బ్యాంకులను బట్టి MCLR మారుతుంది. 


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్రెడిట్ పాలసీ మీటింగ్‌ ఏప్రిల్‌ 6వ తేదీన జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో (2022-23) మే నెల నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్లు లేదా 2.50 శాతం మేర RBI పెంచింది. కొత్త ఆర్థిక సంవత్సరం (2023-24) ఏప్రిల్‌ నెలలో జరిగే సమావేశంలో మరో 25 బేసిస్‌ పాయింట్లు లేదా 0.25 శాతం మేర రెపో రేటు పెరిగే అవకాశం కనిపిస్తోంది.