RuPay Card: రూపే కార్డ్‌హోల్డర్లకు మరో గుడ్‌న్యూస్. మీ దగ్గరున్న రూపే క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డుల కోసం మరో కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. రూపే కార్డ్‌లను ఉపయోగించే వ్యక్తులు ఇకపై CVV లేకుండా చెల్లింపు (CVV Less Payment) చేయవచ్చు. 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI), రూపే కార్డ్‌హోల్డర్‌లు చేసే చెల్లింపులను మరింత ఈజీగా మార్చడానికి ఈ సదుపాయం తీసుకొచ్చింది. అయితే, ఈ ఆప్షన్ రూపే కార్డ్‌హోల్డర్లందరికీ అందుబాటులో ఉండదు.
కొత్త ఆప్షన్ ఎవరికి అందుబాటులో ఉంటుంది?
PTI రిపోర్ట్ ప్రకారం, మర్చంట్ యాప్ లేదా వెబ్ పేజీలో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ప్రీపెయిడ్ కార్డ్‌ను టోకనైజ్ చేసిన కార్డ్‌హోల్డర్‌లకు మాత్రమే 'CVV లెస్ పేమెంట్' సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దీనివల్ల, షాపింగ్ సమయంలో కార్డు వివరాలన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. వాలెట్‌లోకి వెళ్లాల్సిన అవసరం కూడా రాదు.
టోకనైజేషన్ అంటే?
క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవాళ్లలో చాలా మంది, వాళ్ల కార్డ్ వివరాలను ఆయా ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌లో (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్ లేదా వెబ్‌సైట్లు) సేవ్ చేస్తారు. దీనివల్ల, ఆన్‌లైన్ షాపింగ్ చేసిన ప్రతిసారీ ఆయా కార్డ్ వివరాలను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం CVV, OTP నింపితే సరిపోతుంది. ఖాతాదార్లు సేవ్ చేసిన కార్డ్‌ల వివరాలన్నీ ఆయా కంపెనీల సర్వర్లలో స్టోర్ అయ్యేవి, దీనివల్ల ఆ వివరాల దుర్వినియోగ ప్రమాదం ఉంటుంది. కాబట్టి, కార్డ్ వివరాలు దుర్వినియోగం కాకుండా టోకనైజేషన్ పద్ధతిని రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చింది. దీనివల్ల మన కార్డ్ వివరాలు ఆయా కంపెనీల సర్వర్లలో స్టోర్ కావు. ఆ వివరాలకు బదులు ఒక టోకెన్ క్రియేట్ అవుతుంది. దీనినే టోకనైజేషన్ అంటారు. టోకనైజేషన్ తర్వాత ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టే సమయంలో CVV, OTP ఎంటర్ చేస్తే చెల్లింపు పూర్తవుతుంది. మీ కార్డ్ టోకనైజేషన్ కోసం సదరు ఫ్లాట్‌ఫామ్‌కు మీరు అనుమతి ఇవ్వకుంటే, ఆ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లో లావాదేవీ చేసిన ప్రతిసారి కార్డు వివరాలన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
NPCI తీసుకొచ్చిన కొత్త పద్ధతి ప్రకారం, టోకనైజ్ చేసిన రూపే కార్డ్‌లతో ఆన్‌లైన్ షాపింగ్ చేయాలంటే, ఆ కార్డుల CVV కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. కేవలం, మీ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ఎంటర్ చేస్తే చెల్లింపు పూర్తవుతుంది, తద్వారా లావాదేవీ సులభతరం అవుతుంది.
రూపే అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన దేశీయ కార్డ్ నెట్‌వర్క్. దీని వినియోగం పెంచేందుకు NPCI చాలా చర్యలు చేపడుతోంది. రూపే క్రెడిట్ కార్డుల ద్వారా UPI చెల్లింపులు చేసే సదుపాయం కూడా ఇటీవలే ప్రవేశపెట్టిందీ సంస్థ. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు తెరిచిన వ్యక్తులకు రూపే కార్డులను అందించారు. అయితే, మాస్టర్ కార్డ్ లేదా వీసాతో పోలిస్తే రూపే కార్డ్ వాడకం చాలా తక్కువగా ఉంది. రూపే కార్డుల సంఖ్యను, వాటి వినియోగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. CVV లేకుండా చెల్లింపు సౌకర్యం ఈ ప్రయత్నాల్లో ఒక భాగం. దీంతోపాటు, విదేశాల్లోనూ రూపే కార్డ్‌లను యాక్సెప్ట్ చేసేలా ఒప్పందాలు చేసుకుంటోంది. ప్రస్తుతం, డిస్కవర్ ఆఫ్ ది US, డైనర్స్ క్లబ్, జపాన్‌కు చెందిన JCB, పల్స్, యూనియన్ పే ఆఫ్ చైనాతో టై-అప్‌లు కుదుర్చుకుంది.
ఇది కూడా చదవండి: 'మేడ్ ఇన్ తెలంగాణ' ఆపిల్ ప్రొడక్ట్స్ - కొంగర్ కలాన్ ఫ్లాంట్ కోసం భారీ పెట్టుబడి