House Sales: 2023లో స్థిరాస్తి వ్యాపారం మూడు ఇళ్లు, ఆరు ఫ్లాట్లుగా సాగింది. ముఖ్యంగా, విలాసవంతమైన ఇళ్లను (Luxury House Sales) కొనడానికి డబ్బున్న జనం క్యూ కట్టారు. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో... 2022లో 3,12,666 ఇళ్లు/ఫ్లాట్లు అమ్ముడైతే, 2023లో అవి 5% పెరిగి 3,29,907కు చేరాయి. రూ.కోటి కంటే ఎక్కువ విలువైన గృహాల విక్రయాలు 27% నుంచి 34%కు పెరిగాయి.
స్థిరాస్తి కన్సల్టెన్సీ కంపెనీ నైట్ ఫ్రాంక్ ఇండియా, దేశంలోని 8 ప్రధాన నగరాలు దిల్లీ-NCR, ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (MMR), బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్‌లో గత ఏడాది జరిగిన ఇళ్ల క్రయవిక్రయాలపై ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది.
మొత్తంగా చూస్తే, 2023లో ఇళ్లకు గిరాకీ పెరిగినా, బాగా డబ్బున్న వాళ్లు కొనే లగ్జరీ హౌస్‌లకే ఆ డిమాండ్ పరిమితమైంది. మధ్య తరగతి ప్రజలు కొనగలిగే రూ.50 లక్షల లోపు ధర కలిగిన ఇళ్ల (Affordable Housing Segment) విక్రయాలు భారీగా తగ్గాయి.
సామాన్యుడికి సొంతింటి కల దూరం
నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం, రూ.50 లక్షల లోపు ధర ఉన్న ఇళ్లు/ఫ్లాట్లు 2022లో 1,17,131 యూనిట్ల అమ్ముడయితే, 2023లో 16% క్షీణించి 97,983 యూనిట్లకు పడిపోయాయి.
2023లో గృహ రుణ వడ్డీ రేట్లు (Home Loan Interest Rates) పెరగడం, ప్రాపర్టీ ధరలు (Property Prices) పెరగడం, కొనుగోలుదార్ల మీద కరోనా ప్రభావం కారణంగా రూ.50 లక్షల కంటే తక్కువ విలువైన ఇళ్ల విభాగంలో డిమాండ్ బాగా తగ్గిందని నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. ఈ సెగ్మెంట్‌లో ఇళ్ల సరఫరా 20% తగ్గడం కూడా ప్రభావం చూపింది. దీంతో, అఫర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ వాటా, మొత్తం ఇళ్ల విక్రయాల్లో 30%కు పరిమితమైంది, 2022లో ఇది 37%గా ఉంది. 2018లో మొత్తం ఇళ్ల అమ్మకాల్లో అఫర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ వాటా 54%గా ఉంది.
బెంగళూరులో, రూ.50 లక్షల లోపు సెగ్మెంట్ ఇళ్లకు డిమాండ్ 46% తగ్గింది. ఈ విభాగంలో, 2022లో, 15,205 హౌసింగ్ యూనిట్లు విక్రయించగా, 2023లో 8,141 యూనిట్లకు తగ్గాయి. దిల్లీ-NCRలో డిమాండ్ 44% తగ్గింది. ఇక్కడ, 2022లో 13,290 యూనిట్లు విక్రయించగా, 2023లో 7,487 యూనిట్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. ముంబైలో, 2022లో 41,595 అఫర్డబుల్ హౌసింగ్ యూనిట్లు విక్రయిస్తే, 2023లో ఇది 39,093 యూనిట్లకు పడిపోయింది.
10 సంవత్సరాల రికార్డు బద్దలు
నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం, 2023లో, అన్ని విభాగాల్లో మొత్తం అమ్మకాలు 10 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టాయి. దశాబ్ద గరిష్టానికి చేరాయి. ముంబైలో అత్యధిక రెసిడెన్షియల్ సేల్స్ కనిపించాయి. అక్కడ ఇళ్ల అమ్మకాలు 2% పెరిగి 86,871 యూనిట్లకు చేరుకున్నాయి, 2022లో 85,169 యూనిట్లుగా ఉంది. బెంగళరులో సేల్స్ 2022లోని 53,363 నుంచి 2023లో 54,046కు చేరాయి, 1% వృద్ధిని నమోదు చేశాయి. దిల్లీ-ఎన్‌సీఆర్‌లో అమ్మకాలు 3% పెరిగి 60,002 యూనిట్లకు చేరాయి, గత ఏడాది 58,460 యూనిట్లుగా ఉన్నాయి. వీటికి భిన్నంగా.. కోల్‌కతాలో 16%, అహ్మదాబాద్‌లో 15%, పుణెలో 13% శాతం సేల్స్ పెరిగాయి. చెన్నైలో 5% గ్రోత్ నమోదైంది.
హైదరాబాద్‌లో గతేడాది ఇళ్ల విక్రయాలు (House Sales in Hyderabad) 6% పెరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. 2022లో మొత్తం 31,406 ఇళ్లు/ఫ్లాట్లు విక్రయమవగా, 2023లో ఈ సంఖ్య 32,880కు చేరింది.
గత ఏడాది, ప్రాపర్టీ డెవలపర్లు, మొత్తం 8 ప్రధాన నగరాల్లో 3,50,746 కొత్త హౌసింగ్ యూనిట్లను ప్రారంభించారు, ఇది 2022 కంటే 7% ఎక్కువ.
మరో ఆసక్తికర కథనం: ప్రజల ఆశలపై పెట్రోల్ చల్లిన ప్రభుత్వం, పైసా కూడా తగ్గించదట