Recurring Deposit:


మన ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మన పెట్టుబడులు ఉండాలి. మార్కెట్లో నష్టభయం లేకుండా స్థిరమైన రాబడి అందించే ఆర్థిక సాధనాలు ఎన్నో ఉన్నాయి. ఒకేసారి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారికి రికరింగ్‌ డిపాజిట్లు (Recurring Deposit- RD) ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. స్వల్ప కాల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడతాయి. నష్టభయం లేకుండా మెరుగైన వడ్డీ అందిస్తాయి. వీటిని ఎంచుకొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి!


సరైన బ్యాంక్‌ ఎంపిక


మీరు రికరింగ్‌ డిపాజిట్‌ను ఎంచుకున్నాక ప్రతి నెలా నిర్దేశిత తేదీన మీ సేవింగ్స్‌ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు అందులో జమ అవుతుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా నగదు బదిలీ కల్పించే బ్యాంకును ఎంచుకోవడం ముఖ్యం. ఆర్డీని ఎంచుకోవడానికి ముందే ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసుకోవాలి. ఎక్కువ రాబడి అందించే సంస్థను ఎంచుకోండి. ప్రస్తుతం ఆర్డీ వడ్డీ రేట్లు 5.5-75 శాతం వరకు ఉన్నాయి.


సరైన కాల వ్యవధి


రికరింగ్‌ డిపాజిట్‌ కాల వ్యవధి కనీసం 6 నెలల నుంచి 10 ఏళ్ల వరకు ఉంటుంది. మీ ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా కాల పరిమితిని ఎంచుకోవడం ముఖ్యం. ఉదాహరణకు మరో 12 నెలల్లో మీ చిన్నారులకు పాఠశాల ఫీజు చెల్లించాల్సి ఉంది. అలాంటప్పుడు ఏడాది కాలపరిమితి బెస్ట్‌.


జమ చేసే మొత్తం నిర్ణయించుకోండి


ఆర్డీ ఖాతా తెరిచే ముందే ప్రతి నెలా ఎంత డబ్బు జమ చేస్తారో నిర్ణయించుకోవాలి. ఖాతా మెచ్యూరిటీ తీరేంత వరకు ఇలా డబ్బు జమ అవుతూనే ఉంటుంది. సరైన మొత్తం ఎంచుకుంటేనే మీ లక్ష్యానికి అనుగుణంగా నిధి సమకూరుతుంది. చిన్న చిన్న ఖర్చులు, ఇంటి సుందరీకరణ, పిల్లల ఫీజులు, పెళ్లిళ్లు, ప్రయాణాలకు 1-3 ఏళ్ల కాలపరిమితి ఆర్డీలు నప్పుతాయి. రూ.500 నుంచి ఎంతైనా ఇందులో జమ చేసుకోవచ్చు.


గడువు తీరక ముందే వద్దు!


రికరింగ్ డిపాజిట్‌ను గడువు తీరకముందే రద్దు చేయడం వల్ల అనుకున్నత రాబడి రాదు. మరీ అవసరమైతే తప్ప ప్రీ మెచ్యూర్‌ విత్‌డ్రావల్స్‌కు పాల్పడొద్దు. కొన్ని బ్యాంకులు ఫ్లెక్సీ రికరింగ్‌ డిపాజిట్లకు అవకాశం ఇస్తాయి. ప్రతి నెలా ఎక్కువ డబ్బు జమ చేసుకొనేందుకు ఇందులో ఆస్కారం ఉంటుంది. మీ ఆర్థిక లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. అయితే ఇందుకోసం మిగతా పెట్టుబడులకు ఇబ్బంది కలిగించొద్దు. ఎక్కువ డబ్బు ఉంటేనే ఫ్లెక్సీ ఆప్షన్‌ ఎంచుకోండి.


అప్పుకు ఛాన్స్‌!


రికరింగ్‌ డిపాజిట్లపై రుణం తీసుకొనేందుకు అవకాశం ఉంది. ఖాతా మొత్తంలోని 80-90 శాతం విలువకు సమానంగా రుణం పొందొచ్చు. మీకు మరీ అవసరమైతే తప్ప అప్పు తీసుకోకపోవడమే మంచిది. ప్రతి ఆర్డీ ఖాతాపై నామినీని ఎంచుకోవాలి. అనుకోకుండా ఖాతా దారుకు ఏమైనా జరిగితే నామినీకి ఆ మొత్తం డబ్బు దక్కుతుంది. మీ పెట్టుబడికి రక్షణగా నామినీని నియమించండి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.