Budget 2023 - SSY: 


సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలకు కేంద్ర ప్రభుత్వం మరింత చేయూత అందించనుంది. ఈ ఏడాది బడ్జెట్లో వీటికి అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ ఒక నివేదికను విడుదల చేసింది. ఆర్థిక లోటు తగ్గించుకొనేందుకు కేంద్రం ఈ పథకాలపై ఎక్కువ ఆధారపడుతుందని అంచనా వేసింది. 2024 ఆర్థిక ఏడాదికి ఆర్థిక లోటు 6 శాతంగా ఉంటుందని పేర్కొంది.


సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో కేంద్రం భారీ నమోదు కార్యక్రమాలు చేపడుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా వేసింది. యుద్ధ ప్రాతిపదికన కొత్త రిజిస్ట్రేషన్లే చేపట్టనుందని వివరించింది. 'సుకన్య వంటి పథకాలకు ప్రభుత్వం సరికొత్త ప్రోత్సహం అందించనుంది. ఇప్పటి వరకు పథకం చేరని 12 ఏళ్లలోపు బాలికలకు మరో అవకాశం ఇవ్వనుంది' అని ఎస్‌బీఐ వెల్లడించింది.


పోస్టాఫీసులతో పోలిస్తే బ్యాంకుల్లో సుకన్య సమృద్ధి యోజన వాటా తక్కువగా ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ తెలిపింది. ఇందుకోసం బ్యాంకులు ప్రత్యేకంగా ప్రతినిధులను నియమించుకుంటాయని వెల్లడించింది. 'బ్యాంకులు బిజినెస్‌ కరస్పాండెంట్‌ ఛానెల్‌ భాగస్వాములను నియమించుకోవడం ఉపయోగపడుతుంది. ఎందుకంటే పోస్టాఫీసులతో పోలిస్తే బ్యాంకుల్లో సుకన్య వాటా తక్కువగా ఉంది. బ్యాంకుల్లో డిపాజిట్ల వాటా 30 శాతం ఉండగా సుకన్య వాటా 16 శాతమే ఉంది' అని తెలిపింది.


పథకం వివరాలు


చిన్న మొత్తాల పొదుపు పథకం తరహాలో సుకన్య సమృద్ధి యోజన పని చేస్తుంది. మీ కుమార్తె ఉన్నత చదువు, పెళ్లి కోసం భారీగా నిధులు (big corpus) కూడగట్టడంలో ఈ పథకం ద్వారా మీరు విజయం సాధించవచ్చు. 21 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి కారణంగా, ఇది దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణిస్తారు. అలాగే, ఇది మీ కుమార్తె గాక మీకు కూడా చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది.


2014లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంలో, అప్పటి నుంచి ఇప్పటి వరకు అందుతున్న వడ్డీ గరిష్ట స్థాయి నుంచి 1.6 శాతం తగ్గింది. అయినా, చిన్న మొత్తాల పొదుపులోని అత్యంత ఆకర్షణీయమైన పథకాల జాబితాలో ఇది ఇప్పటికీ ఉంది. సుకన్య సమృద్ధి యోజనలో పెట్టిన పెట్టుబడి మీద మీకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అలాగే, దాని నుంచి వచ్చే రాబడి కూడా పన్ను రహితం. అదే సమయంలో, పెట్టుబడి 15 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. మిగిలిన ఆరు సంవత్సరాల కాలానికి కూడా మీరు ప్రభుత్వం నుంచి మంచి వడ్డీని పొందుతారు.


సుకన్య సమృద్ధి యోజన 2014లో సామాన్య ప్రజల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏప్రిల్ 1, 2014న 9.1 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరుసటి ఏడాది ఏప్రిల్ 1, 2015 నాటికి 9.2 శాతానికి పెంచింది. 2018లో ప్రభుత్వం దానిని 8.5 శాతానికి కుదించింది. ఆ తరువాత, ఇది 31 మార్చి 2020న 8.4 శాతంగా ఉంది. 30 జూన్ 2020తో ముగిసే త్రైమాసికంలో ఇది 7.6 శాతానికి తగ్గింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే 2023లోనూ ఈ పథకం మీద 7.6 శాతం వడ్డీ అందుతోంది.


మూడు రెట్ల రాబడి


ప్రస్తుతం, సుకన్య సమృద్ధి యోజనలో వడ్డీ రేటు సంవత్సరానికి 7.6 శాతం. దీని మెచ్యూరిటీ 21 ఏళ్లయినా, పెట్టుబడి వ్యవధి మాత్రం 15 సంవత్సరాలు మాత్రమే. మిగిలిన కాలానికి కూడా వడ్డీ పొందుతారు. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తం కంటే మెచ్యూరిటీ రాబడి 3 రెట్లు వరకు ఉంటుంది. మీరు ఏడాదికి గరిష్టంగా రూ. 1.50 లక్షలు డిపాజిట్‌ చేస్తే, ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం, మెచ్యూరిటీ తేదీన రూ. 64 లక్షల వరకు చేతికి వస్తుంది.