Year Ender 2023 Housing Sales: 2023 క్యాలెండర్‌ ఇయర్‌ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. డిసెంబర్‌లో ఇప్పటికే సగం నెలను దాటేశాం. ఈ సంవత్సరం ఆయుష్షు ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది, ఆ తర్వాత కొత్త సంవత్సరం 2024 (Happy New year 2024) ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో గృహ నిర్మాణ రంగం (Housing sector) ఎలా గడిచింది, కొత్త సంవత్సరంలో పరిస్థితి ఎలా ఉంటుంది?. 


గతేడాది కంటే ఇది చాలా ఎక్కువ అమ్మకాలు
ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ (Real estate), ముఖ్యంగా హౌసింగ్ సెక్టార్‌ బ్రహ్మాండంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం గృహ రుణ వడ్డీ రేట్లు ‍‌(Home loan interest rates) అధిక స్థాయిలోనే ఉన్నప్పటికీ, కొత్త ఇళ్ల కొనుగోళ్ల డిమాండ్ కూడా బలంగానే ఉంది. 2023లో గృహ విక్రయాల తుది సంఖ్య గత సంవత్సరం (2022) కంటే దాదాపు 40 శాతం ఎక్కువగా ఉండొచ్చని అనరాక్ ‍‌(Anarak) రిలీజ్‌ చేసిన తాజా రిపోర్ట్‌ సూచిస్తోంది.


అనరాక్‌ రిపోర్ట్‌ ప్రకారం, 2023 మొదటి 9 నెలల్లో ‍‌(జనవరి-సెప్టెంబర్‌) దేశంలోని టాప్-7 నగరాల్లో రూ.3.49 లక్షల కోట్ల విలువైన ఇళ్లు చేతులు మారాయి. 2023 మొదటి 9 నెలల లెక్క, మొత్తం 2022 అమ్మకాలను (రూ.3.27 లక్షల కోట్లు) దాటేసింది. ఇదే స్పీడ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఏడాది చివరి మూడు నెలల్లో (అక్టోబర్‌-డిసెంబర్‌) కనీసం రూ.లక్ష కోట్ల విలువైన ఇళ్లు ‍‌(housing sales) అమ్ముడుపోతాయి. ఈ విధంగా మొత్తం సంవత్సరానికి ఈ సంఖ్య రూ.4.5 లక్షల కోట్లకు చేరుతుంది. గతేడాదితో పోలిస్తే 2023లో గృహ విక్రయాల్లో 37.61 శాతం వృద్ధి ఉంటుందని అంచనా.


రిజర్వ్ బ్యాంక్ (RBI), గత ఏడాది మే నుంచి రెపో రేట్‌ను ‍‌(Repo rate) పెంచడం ప్రారంభించింది, ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు ఈ పెంపు కొనసాగింది. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకు, రిజర్వ్ బ్యాంక్ తన రెపో రేటును మొత్తం 2.50 శాతం పెంచింది. దీంతో, రెపో రేటు 6.50 శాతానికి చేరుకుంది. ఈ నెలలో మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం జరిగింది, ఈసారి కూడా రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగానే కొనసాగించింది. ప్రస్తుతం రెపో రేటు అధిక స్థాయిలో ఉంది, గృహ రుణాలు ఖరీదైనవిగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆ ప్రభావం ఇళ్ల విక్రయాలపై పడలేదు.


ఈ ఏడాది ఖరీదైన ఇళ్ల అమ్మకాలు ఎక్కువ
ఈ ఏడాది ఇళ్ల రేట్లు పెరిగాయి కాబట్టి, విలువ పరంగా, గతేడాది కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. అయితే, సంఖ్య పరంగా చూస్తే మాత్రం ఇంటి అమ్మకాల్లో పెరుగుదల కొంత తక్కువగానే కనిపిస్తుంది. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో, టాప్-7 సిటీస్‌లో 3.49 లక్షలకు పైగా హౌసింగ్ యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది 3.65 లక్షల ఇళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 9 నెలల్లో విక్రయాల సంఖ్య తక్కువగా ఉన్నా విలువ ఎక్కువగా ఉండడానికి కారణం టాప్‌ ఎండ్‌ మోడల్స్‌. అంటే, 2023లో విలాసవంతమైన ఇళ్లు ‍‌(Luxury homes) ఎక్కువగా అమ్ముడుపోయాయి. 


కొత్త ఏడాదిలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనా
ఇళ్ల అమ్మకాల్లో వచ్చే ఏడాది (2024) కూడా ఇదే స్పీడ్‌ కొనసాగుతుందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెపో రేటు తగ్గడం ప్రారంభమవుతుందని మార్కెట్‌ గట్టిగా నమ్ముతోంది. రెపో రేటు తగ్గితే గృహ రుణాలు చౌకగా మారతాయి. సొంత ఇళ్లకు డిమాండ్‌ ఇంకా పెరుగుతుంది. 


CBRE నివేదిక ప్రకారం, హై-టికెట్ వాల్యూ ఇళ్ల అమ్మకాలు 2024లో బలంగా ఉంటాయి. రూ.45 లక్షల నుంచి రూ.కోటి వరకు ధర పలికే ఇళ్లకు డిమాండ్‌ ఎక్కువగా పెరుగుతుంది.


మరో ఆసక్తికర కథనం: మీ ఆదాయం రూ.7.27 లక్షలు దాటకుంటే ఒక్క రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు