Year Ender 2023: ఈ ఏడాది (2023), పన్ను చెల్లింపుదార్లకు పెద్ద ఉపశమనం కలిగించే వార్త విన్నాం. 2023 ఫిబ్రవరి 1న, మోదీ ప్రభుత్వం 10వ పూర్తి స్థాయి బడ్జెట్‌ సమర్పించింది. ఆ సందర్భంగా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. 2020లో తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ‍‌(new income tax regime) మరింత ఆకర్షణీయంగా మార్చారు. కొత్త ఆదాయపు పన్ను విధానం ప్రకారం, పన్ను చెల్లించాల్సిన అవసరం లేని వార్షిక ఆదాయాన్ని గతంలో రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచారు. 


కొత్త పన్ను విధానం ప్రకారం ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే  (ITR Filing) వ్యక్తుల ఆదాయం ఏడాదికి రూ. 7 లక్షల లోపు ఉంటే, వాళ్లు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు. దీంతో పాటు, పన్ను చెల్లింపుదార్లకు (tax payers) స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని (advantage of the standard deduction) కూడా జత చేశారు. జీతం తీసుకునే వ్యక్తులు, పెన్షనర్లు రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం పొందుతారని 2023 బడ్జెట్‌ సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే ఒక వ్యక్తి (Individual tax payer) వార్షిక ఆదాయం రూ. 7.50 లక్షలు దాటకపోతే, అతను ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. జీతం లేని, పెన్షన్‌ తీసుకోని పన్ను చెల్లింపుదార్లకు ఈ ప్రయోజనం ఉండదు.


రూ.7.27 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు
మోదీ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన వల్ల జీతభత్యాలు, పింఛను తీసుకునే వ్యక్తులకు అతి పెద్ద ప్రయోజనం లభించింది. అయితే, ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఆ తర్వాత తన ప్రకటన సరిదిద్దుకున్నారు. ఏటా రూ.7.27 లక్షలకు మించకుండా ఆదాయం సంపాదించే వ్యక్తులు, కొత్త పన్ను విధానం ప్రకారం, పన్ను పరిధిలోకి రారు, పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. వార్షిక ఆదాయం రూ.7.27 లక్షలు దాటి ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా, కొత్త పన్ను విధానం ప్రకారం టాక్స్‌ కట్టాలి. తన మొత్తం ఏడాది ఆదాయంలో, రూ. 3 లక్షలకు పైబడిన మొత్తం నుంచి స్లాబ్‌ సిస్టమ్‌లోకి వస్తాడు. అతను, వర్తించే ఆదాయ పన్ను స్లాబ్‌ రేట్‌ ‍‌(Income tax slab rate) ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


కొత్త ఆదాయపు పన్ను విధానంలో, రూ. 3 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు (Tax exemption) లభిస్తుంది. ఆ తర్వాత.... రూ. 3-6 లక్షల వరకు ఆదాయంపై 5%, రూ. 6-9 లక్షల ఆదాయంపై 10%, రూ. 9-12 లక్షల ఆదాయంపై 15%, రూ. 12-15 లక్షల ఆదాయంపై 20%, రూ. 15 లక్షలు దాటిన ఆదాయంపై ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించేలా నిబంధన పెట్టారు.


రూ. 25,000 పన్నుపై 100% రాయితీ
ఒకవేళ మీ వార్షిక ఆదాయం రూ. 7.27 లక్షల లోపు ఉంటే, మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి భయం లేకుండా ITR ఫైల్‌ చేయండి. ఒక్క రూపాయి పన్ను బాధ్యత (Tax liability) కూడా మీకు వర్తించదు. వాస్తవానికి, ఆ సందర్భంలో మీరు రూ.25,000 పన్ను చెల్లించాలి. కానీ, ఆ రూ. 25,000 పన్నుపై ప్రభుత్వం మీకు 100% రాయితీ ఇస్తోంది. అందువల్లే మీరు పన్ను కట్టాల్సిన అవసరం లేదు.


డీఫాల్ట్‌గా కొత్త పన్ను విధానం
మీరు ITR ఫైల్‌ చేయాలనుకుంటే, కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గా కనిపిస్తుంది. పాత పన్ను విధానంలో ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేయాలనుకున్న వాళ్లు పాత విధానాన్ని తప్పనిసరిగా ఎంచుకోవాలి. ఆప్షన్‌ మార్చుకోకపోతే, 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరం కింద రిటర్న్‌లను ఫైల్ చేసినప్పుడు, కొత్త ఆదాయపు పన్ను విధానం కింద ITR ఫైల్‌ అవుతుంది. 


మరో ఆసక్తికర కథనం: వచ్చే ఏడాది మార్కెట్లకు 2 వారాలు సెలవులు, హాలిడేస్‌ లిస్ట్‌ ఇదిగో