Freehold Vs Leasehold: రియల్ ఎస్టేట్‌లో ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ, లీజ్‌ హోల్డ్ ప్రాపర్టీ రూల్స్‌కు ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ఇవి ప్రాపర్టీ టైటిల్‌కు సంబంధించిన నిబంధనలు. ఓపెన్‌ ప్లాట్ అయినా, భవనం అయినా, అథారిటీ ఫ్లాట్ అయినా, హౌసింగ్ సొసైటీ ఫ్లాట్ అయినా, ఇండిపెండెంట్‌ ఫ్లోర్‌ అయినా అన్ని రకాల ప్రాపర్టీలకు ఈ రెండు రూల్స్‌ వర్తిస్తాయి. అన్ని ప్రధాన నగరాల్లో ఫ్రీ హోల్డ్‌తో పాటు లీజ్‌ హోల్డ్ ప్రాపర్టీలు భారీ సంఖ్యలో ఉన్నాయి. ఇంతకీ.. లీజ్‌ హోల్డ్‌, ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఏ ఆస్తి కొనొచ్చు?.


ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ అంటే...
ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ అనేది సొంత ఆస్తి యాజమాన్యాన్ని సూచిస్తుంది. ఈ టైప్‌ ప్రాపర్టీ మీద ఓనర్‌షిప్‌ రైట్స్‌ ఒక వ్యక్తి దగ్గరే ఉంటాయి. అతని తర్వాత చట్టపరమైన వారసులకు బదిలీ అవుతాయి. ఈ తరహా ఆస్తిని అతని కుటుంబం తరతరాలుగా అనుభవించే, నిర్మించే, విక్రయించే హక్కు కలిగి ఉంటుంది. భారతదేశంలోని చాలా ఆస్తులు ఫ్రీ హోల్డ్‌లో ఉంటాయి. ఉదాహరణకు, ఒక బిల్డర్ నేరుగా ఒక రైతు నుంచి భూమిని కొనుగోలు చేసి, దానిపై ఫ్లాట్ లేదా ఇల్లు నిర్మించి కొనుగోలుదారుకు విక్రయిస్తాడు. అప్పుడు, బిల్డర్‌ దగ్గరున్న యాజమాన్య హక్కులు పూర్తిగా కొనుగోలుదారుకు బదిలీ అవుతాయి. ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ కొనుగోలు/అమ్మకం సేల్ డీడ్, కన్వేయన్స్ డీడ్‌ లేదా రిజిస్ట్రీ ద్వారా జరుగుతాయి.


లీజ్‌ హోల్డ్ ప్రాపర్టీ అంటే...
లీజ్‌ హోల్డ్ ప్రాపర్టీ అనేది నిర్దిష్ట కాల వ్యవధి కోసం తీసుకున్న ఆస్తిపై యాజమాన్య హక్కును సూచిస్తుంది. ఉదాహరణకు... ఒక ప్రాంతంలో, స్థానిక ప్రభుత్వం రైతుల నుంచి భూమిని కొనుగోలు చేసి, బిల్డర్ లేదా ఇంటి కొనుగోలుదారుకు నిర్ణీత కాలానికి లీజ్‌కు ఇస్తుంది. 30, 99 లేదా 999 సంవత్సరాలకు ఈ లీజ్‌ ఉంటుంది.


రెసిడెన్షియల్‌ ప్రాపర్టీలో లీజ్‌ వ్యవధి సాధారణంగా 99 సంవత్సరాలు ఉంటుంది. ఈ లీజ్‌ గడువు తర్వాత, ఆస్తి ఓనర్‌షిప్‌ తిరిగి ప్రభుత్వానికి వెళుతుంది. లేదా, ఇరు వర్గాలు మాట్లాడుకుని లీజ్‌ కాలాన్ని ఎక్స్‌టెండ్‌ చేసుకుంటాయి. లీజ్‌ను 999 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. లీజ్‌ హోల్డ్ ప్రాపర్టీ డీల్ లీజ్‌ డీడ్ ద్వారా జరుగుతుంది.


క్రయవిక్రయాలు
ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీలో, మొత్తం యాజమాన్యం కొనుగోలుదారు చేతుల్లోకి వెళుతుంది. మీరు ఆ ఆస్తిలో నివసించొచ్చు, సులభంగా అమ్మొచ్చు, అద్దెకు ఇవ్వొచ్చు. సాధారణంగా, లీజ్‌ హోల్డ్ ప్రాపర్టీలో యజమాని ప్రభుత్వమే. లీజ్‌ వ్యవధి వరకు ఈ ఆస్తిని ఉపయోగించవచ్చు, అద్దెకు తీసుకోవచ్చు లేదా విక్రయించవచ్చు. లీజ్‌ ముగింపులో, ఆ ఆస్తి ప్రభుత్వానికి వెళ్తుంది. లీజ్‌ హోల్డ్ ప్రాపర్టీని బదిలీ చేయడానికి లేదా విక్రయించడానికి ప్రభుత్వం నుంచి NoC తీసుకోవాలి, అవసరమైన ఛార్జీలు చెల్లించాలి. నిర్మాణంలో మార్పులకు కూడా గవర్నమెంట్‌ పర్మిషన్‌ అవసరం.


రుణ లభ్యత
ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీని తనఖా పెట్టి సులభంగా లోన్ పుట్టించవచ్చు. లీజ్‌ హోల్డ్ ప్రాపర్టీ విషయంలో, లీజ్‌ 30 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే బ్యాంకులు సాధారణంగా రుణం ఇవ్వవు. లీజ్‌ గడువు ముగుస్తున్న కొద్దీ, లోన్‌ ఇవ్వడానికి బ్యాంకులు ఇష్టపడవు లేదా ఎక్కువ వడ్డీని వసూలు చేస్తాయి.


ఆస్తి పన్ను
ఫ్రీ హోల్డ్ ఆస్తిపై ప్రభుత్వానికి ఆస్తి పన్ను ‍‌(Property tax) చెల్లించాలి. లీజ్‌ హోల్డ్ ప్రాపర్టీలో భూమి అద్దె లేదా లీజ్‌ చెల్లించాలి. ఇది ఆస్తి పన్ను కంటే ఎక్కువగా ఉంటుంది. నగరాన్ని బట్టి లీజ్‌ రేటు మారుతుంది.


ప్రాపర్టీ రేట్లు
లీజ్‌ హోల్డ్‌ ప్రాపర్టీ కంటే ఫ్రీ హోల్డ్‌ ప్రాపర్టీ ఖరీదెక్కువ. ఏరియా డిమాండ్‌ను బట్టి ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ రేట్లు ఎప్పటికప్పుడు పెరుగుతుంటాయి. లీజ్‌ హోల్డ్ ప్రాపర్టీ అప్రిసియేషన్ ప్రారంభంలో బాగానే ఉన్నా, లీజ్‌ ముగింపు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆస్తి విలువ తగ్గడం ప్రారంభమవుతుంది. 


ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు, అది ఫ్రీ హోల్డ్‌ ప్రాపర్టీనా, లీజ్‌ హోల్డ్ ప్రాపర్టీనా అని తెలుసుకోండి. ఖరీదు ఎక్కువైనా ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీని మాత్రమే కొనడానికి ప్రయత్నించండి. తద్వారా, మీ భవిష్యత్‌ తరాలకు మీరు ఒక ఆస్తిని సృష్టిస్తారు.


మరో ఆసక్తికర కథనం: కొనేవాళ్లు తప్ప అమ్మేవాళ్లు లేని స్టాక్‌ ఇది, నెలలో 63% జంప్‌


Join Us on Telegram: https://t.me/abpdesamofficial