RBI Digital Currency: భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) త్వరలోనే 'డిజిటల్‌ రూపాయి'ని (Digital Rupee) ప్రవేశపెట్టనుంది. కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయం చెప్పగానే అందరిలో ఆసక్తి నెలకొంది. డిజిటల్‌ కరెన్సీని (Digital Currency) ఎలా రూపొందిస్తారు? ఎలా పనిచేస్తుంది? ఎలా చలామణీలోకి తీసుకొస్తారు? యూపీఐ లావాదేవీలు (UPI payments ) ఎలా జరుగుతాయి? అసలు డిజిటల్‌ రూపాయి, యూపీఐ చెల్లింపులకు తేడా ఏంటని సందేహాలు వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం!


కరెన్సీ లేదా నగదు తరహాలోనే


కరెన్సీ, నగదుకు బదులుగా డిజిటల్‌ రూపాయిని ఉపయోగిస్తారు. ఎందుకంటే డిజిటల్‌ రూపాయికి అండర్‌లైయింగ్‌ అసెట్‌గా కరెన్సీ, నగదు ఉంటుంది. 'యూపీఐ, ఐఎంపీఎస్‌ వంటి చెల్లింపుల టెక్నాలజీలు డబ్బును బదిలే చేసేటప్పుడు అండర్‌లైయింగ్‌ అసెట్‌గా నగదు లేదా కరెన్సీనే ఉపయోగించుకుంటాయి. ఇక్కడా అంతే. లావాదేవీలు సునాయాసంగా జరిగేందుకు డిజిటల్‌ రూపాయితో పేమెంట్‌ టెక్నాలజీ వేదికలు సమన్వయం చేసుకుంటాయి' అని పీడబ్ల్యూసీ ఇండియా ప్రతినిధి మిహిర్‌ గాంధీ అంటున్నారు,


ఇప్పుడెలా జరుగుతున్నాయంటే


ప్రస్తుతం యూపీఐ చెల్లింపులన్నీ ఇప్పుడున్న కరెన్సీ లేదా నగదుకు సమానమైన డిజిటల్‌ రూపంలో జరుగుతున్నాయి. అంటే యూపీఐలో ఇప్పుడు బదిలీ అవుతున్న ప్రతి రూపాయి భౌతికంగా ఉన్న కరెన్సీతో సమానమే. 'డిజిట్‌ రూపాయి చట్టబద్ధమైంది. అందుకే దానికి భౌతిక కరెన్సీ మద్దతు అవసరం లేదు' అని నియో బ్యాంక్‌ ఫై సహ వ్యవస్థాపకుడు సుమిత్‌ గ్వలాని అన్నారు.


సులువుగానే నెఫ్ట్‌, యూపీఐ


ఇప్పుడున్న భౌతికమైన రూపాయి త్వరలో రాబోయే డిజిటల్‌ రూపాయికి తేడా లేదు. కాబట్టి సులువుగానే నెఫ్ట్‌, యూపీఐ లావాదేవీలు చేపట్టొచ్చు. ప్రస్తుతం ప్రతి బ్యాంకుకు సొంతంగా యూపీఐ హ్యాండ్లర్‌ ఉంటుంది. డిజిటల్‌ రూపాయిని పూర్తిగా ఆర్‌బీఐ మాత్రమే ఆపరేట్‌ చేస్తుంది. మధ్యలో బ్యాంకులతో సంబంధం ఉండదని ప్రొఅసెట్జ్‌ ఎక్స్‌ఛేంజ్‌ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌ మనోజ్‌ దాల్మియా వెల్లడించారు.


నేరుగా ఆర్‌బీఐతోనే


యూపీఐ పేమెంట్లు ఇప్పుడు లావాదేవీలు చేపట్టే బ్యాంకులు, ఆర్‌బీఐ మీద ఆధారపడుతున్నాయి. డిజిటల్‌ రూపాయిని నేరుగా ఆర్‌బీఐ ద్వారా లావాదేవీలు చేపట్టొచ్చు. కాబట్టి సెటిల్‌మెంట్‌కు సమయమే అవసరం లేదు. వెంటనే అయిపోతుందని నాన్సీబ్లాక్స్‌ బ్లాక్‌చైన్‌ స్టూడియో ఫౌండర్‌, డైరెక్టర్‌ విష్ణుగుప్త అన్నారు.


Also Read: ఈ క్రెడిట్‌ కార్డులపై 5% క్యాష్‌బ్యాక్‌, డైనింగ్‌పై 20% రాయితీ, గ్రాసరీస్‌పై రివార్డులు


Also Read: క్రెడిట్‌ కార్డు అప్పు తీర్చాలా - సింపుల్‌గా ఈ 10 చిట్కాలు పాటించండి!