Raksha Bandhan 2023 - Tax Rules: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రత్యేక అనుబంధానికి గుర్తుగా మన దేశంలో రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ జరుపుకుంటున్నాం. రక్షా బంధన్ రోజున, ఇంటి ఆడపడుచు తన సోదరుడి చేతికి రాఖీ కడుతుంది. దీనికి బదులుగా, అతను ఏదైనా బహుమతి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఎవరి స్థోమతకు తగ్గట్లుగా వారు గిఫ్ట్స్ ఇస్తుంటారు. మంచి సెల్‌ఫోన్, మేకప్ కిట్, దుస్తులు, సినిమా టిక్కెట్లను కొందరు ఇస్తారు. సోదరికి వివాహమైతే, ఆమె ఇంట్లోకి అవసరమైన వస్తువులను కూడా బహుమతిగా అందిస్తుంటారు. ఎక్కువ మంది మాత్రం డబ్బు ఇస్తుంటారు. ఆ డబ్బును ఆమెకు ఇష్టమైన విధంగా ఉపయోగించుకుంటుందన్నది వాళ్ల ఉద్దేశం.
మీరు కూడా రాఖీ కట్టించుకుని, మీ సోదరికి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని ఆలోచిస్తున్నారా?. ముందుగా ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ (income tax rules) గురించి కూడా తెలుసుకోండి. మీ సిస్టర్‌కు మీరు ఇచ్చిన డబ్బును ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌లో (ITR) చూపించాలో, లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఐటీ రూల్స్ గురించి ముందస్తుగా అవగాహన పెంచుకుంటే, రాఖీ పండుగను ప్రశాంతంగా, ఉల్లాసంగా జరుపుకోవచ్చు.
ఎంత డబ్బుకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది?
ఆదాయ పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తి, తనతో రక్త సంబంధం ఉన్న బంధువుకు నగదును బహుమతిగా ఇస్తే, అలా ఇచ్చిన మొత్తానికి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే, రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కట్టిన మీ సోదరికి మీరు ఎంత డబ్బు ఇచ్చినా దానిపై ఒక్క రూపాయి కూడా ఇన్‌కమ్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఒకవేళ మీకు ఎప్పుడైనా అవసరమై, మీ రక్త సంబంధీకుల నుంచి డబ్బు తీసుకున్నా కూడా ఇదే రూల్ వర్తిస్తుంది, దానిపైనా టాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు.
కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏటంటే, ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం, ఎవరైనా తన ఇష్టపూర్వకంగా ఇతర వ్యక్తులకు ఎంత డబ్బయినా బహుమతిగా అయినా ఇవ్వొచ్చు. గిఫ్ట్ విలువ మీద ఎలాంటి పరిమితిని ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ విధించలేదు. అయితే, గిఫ్ట్ విలువ 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటే, మీరు దాని తాలూకు బ్యాంకింగ్ వివరాలను భద్రంగా ఉంచుకోవాలని ఐటీ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల, మీరు భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. అయితే... రక్త సంబంధీకుల నుంచి కాకుండా, మీరు ఇతర వనరుల నుంచి బహుమతులు స్వీకరించినప్పుడు ఆదాయ పన్ను సెక్షన్ 56(2)(x) కింద ఇన్‌కమ్ టాక్స్ చెల్లించాల్సి రావచ్చు.
సోదరికి షేర్లను బహుమతి ఇవ్వొచ్చా?
మీరు రక్షాబంధన్ వేడుకను ప్రత్యేకంగా మార్చాలని, మీ సోదరికి షేర్లను బహుమతిగా ఇవ్వాలనుకుంటే, నిశ్చింతగా ఆ పని చేయవచ్చు. ఆదాయ పన్ను గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. మీ డీమ్యాట్ అకౌంట్ నుంచి మీ సోదరి డీమ్యాట్ అకౌంట్‌కు షేర్లను బదిలీ చేయవచ్చు. దీనిపై మీరు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
మరో ఆసక్తికర కథనం: