PhonePe:


డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే (PhonePe) మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. బుధవారం స్టాక్ బ్రోకింగ్‌లోకి ప్రవేశించింది. సబ్సిడరీ కంపెనీ ఫోన్‌పే వెల్త్‌ బ్రోకింగ్‌ కింద share.market పేరుతో డిస్కౌంట్‌ బ్రోకింగ్‌ సేవలను ఆరంభించింది. వినియోగదారులకు మెరుగైన ఆర్థిక సేవలను అందిస్తామని కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు సమీర్‌ నిగమ్‌ బుధవారం తెలిపారు.


'ఈ ఏడాది మొదట్లో మేం పిన్‌కోడ్‌ సేవలను పరిచయం చేశాం. ఇక ఈ ఏడాది ఆరంభంలో మేం ఆరంభిస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు షేర్‌.మార్కెట్‌' అని సమీర్‌ నిగమ్‌ అన్నారు. ఇంటెలిజెన్స్‌,  క్వాంటిటేటివ్‌ రీసెర్చ్‌ ఆధారిత వెల్త్‌ బాస్కెట్లు, డిస్కౌంట్‌ బ్రోకింగ్‌ సేవలను అందిస్తామని తెలిపారు. మొబైల్‌ యాప్‌, వెబ్‌ రూపంలో సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు స్టాక్స్‌ , ఇంట్రాడే ట్రేడ్స్‌, ఎంపిక చేసిన వెల్త్‌ బాస్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు కొనుగోలు చేయొచ్చన్నారు.


'సెబీ ప్రవేశపెట్టిన ఆధార్, ఈకేవైసీ వల్ల డీమ్యాట్‌ ఖాతాలు తెరవడం సులభమైంది. సెటిల్‌మెంట్‌ సమయం తగ్గింది. కస్టమర్ల నిధులకు భద్రత పెరిగింది. దాంతో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. స్టాక్‌ మార్కెట్లలో తమ సంపద పెరుగుతుందని వారు నమ్ముతున్నారు. మ్యూచువ్‌ ఫండ్ల సిప్స్‌, డీమ్యాట్‌ ఖాతాల్లో వృద్ధిరేటే ఇందుకు నిదర్శనం. క్వాంటిటేటివ్‌ రీసెర్చ్‌ దవ్ఆరా షేర్‌.మార్కెట్‌ స్టాక్‌ బ్రోకింగ్‌లో సరికొత్త కోణం ఆవిష్కరించనుంది' అని ఫోన్‌పే తెలిపింది.


ఇంట్రాడే, డెలివరీ పద్ధతిలో స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్లు, ఈటీఎఫ్‌లు, వెల్త్‌ బాస్కెట్ల వంటి ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రొడక్టులను షేర్‌.మార్కెట్‌ అందించనుంది. సెబీ వద్ద నమోదు చేసుకున్న నిపుణులు, మధ్యవర్తులు ప్రత్యేకమైన థీమ్స్‌తో కొన్ని షేర్లను ఎంపిక చేస్తారు. వీటిని ఒక బకెట్‌గా వెల్త్‌ బాస్కెట్ రూపంలో అందిస్తారు. దాంతో తక్కువ ఖర్చుతోనే మంచి రాబడి పొందొచ్చు. వాచ్‌ లిస్ట్‌ ట్రాకర్‌తో స్టాక్‌ మార్కెట్‌, సూచీలు, స్టాక్స్‌, సెక్టార్లను పరిశీలించొచ్చు. ఫోన్‌పే యూజర్లు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. లేదా ఫోన్‌పేకు లింకు చేసుకున్న నంబర్లతో వెబ్‌లో లాగిన్ అవ్వొచ్చు. లాగిన్‌ అయ్యాక కేవైసీ ప్రాసెస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.


ఈక్విటీ డెలివరీ బ్రోకరేజీ ఛార్జీ 0.05 శాతం లేదా ఒక ఆర్డర్‌కు రూ.20గా నిర్ణయించింది. ఈక్విటీ ఇంట్రాడేకూ ఇవే రుసుములు వర్తిస్తాయి. షేర్‌.మార్కెట్‌ వేదికను ఉపయోగించుకోవాలంటే ఆన్‌బోర్డింగ్‌ ఛార్జెస్‌ రూ.199 చెల్లించాలి. 


Also Read: ఈ రాఖీ పండుగ రోజున మీ సోదరికి ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి, ఈ 5 ఆప్షన్స్‌ బాగుంటాయి


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.