Happy Rakshabandhan 2023: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమను గుర్తు చేసుకుంటూ జరుపుకునే వేడుక.. రక్షాబంధన్‌ లేదా రాఖీ పండుగ. దీంతోపాటే మన దేశంలో పండుగ సీజన్ కూడా ప్రారంభమవుతుంది, నెలల తరబడి కొనసాగుతుంది. ఈ పండుగల సీజన్‌లో జరిగే లక్షల కోట్ల రూపాయల విలువైన కొనుగోళ్లు అటు అన్ని రంగాలకు, ఇటు ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తిని అందిస్తాయి. 


ఈ సంవత్సరం రాఖీ పండుగ రోజు మీ సోదరికి విభిన్నమైన కానుక ఇవ్వండి. ఆమె ఆరోగ్యం, ఆర్థిక భద్రత పట్ల మీకున్న తాపత్రయాన్ని ఆ కానుక గుర్తు చేసేలా ఉంటే, అది ఇంకా స్పెషల్‌గా నిలుస్తుంది. 


ఆరోగ్య బీమా (Health Insurance)
మన జీవితాల్లో, అనుకోకుండా వచ్చే అతి పెద్ద ఖర్చుల్లో ఫస్ట్‌ ప్లేస్‌ ఆరోగ్య చికిత్సలది. అనారోగ్యాలు ఎప్పుడూ చెప్పి రావు. కాలం మారుతున్న కొద్దీ హాస్పిటల్‌ ఖర్చులు కూడా కొండలా పెరుగుతున్నాయి. అనారోగ్యాల విషయంలో ముందస్తు సంసిద్ధత ఎంత అవసరమో కొవిడ్ మహమ్మారి ప్రజలకు బాగా వివరించింది. ఒక ఆరోగ్య బీమా అలాంటి కష్టకాలం నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. భారత ప్రభుత్వం కూడా ఆరోగ్య బీమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఇదే కారణం. ఈ సంవత్సరం రక్షా బంధన్ సందర్భంగా మీరు మీ సోదరికి సమగ్ర ఆరోగ్య బీమాను బహుమతిగా ఇవ్వవచ్చు, వ్యాధుల నుంచి ఆమెకు రక్షణ కల్పించవచ్చు.


ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit/ FD)
సాంప్రదాయ పెట్టుబడి పద్ధతుల్లో ఇది ఒకటి. మీ సోదరికి అద్భుతమైన బహుమతి ఇవ్వాలనుకుంటే, FD ఒక బెస్ట్‌ ఆప్షన్‌. ఫిక్స్‌డ్ డిపాజిట్‌ అనేది రిస్క్‌ లేని, రిటర్న్‌ గ్యారెంటీ ఉండే ఎంపిక. మీ ఇంటికి సమీపంలోని బ్యాంక్‌లోనే అందుబాటులో ఉంటుంది. మీరు మీ సోదరి కోసం FD చేస్తే, భవిష్యత్తులో ఆమె పిల్లల చదువులు, ఇల్లు కట్టుకోవడం వంటి వాటిరకి చాలా ఉపయోగం ఉంటుంది.


డిజిటల్ గోల్డ్ (Digital Gold)
భారతదేశం బంగారాన్ని ప్రేమించే దేశం. ఇది FD కంటే పాతదైన, అందరూ ఇష్టపడే ఆప్షన్‌. మన దేశంలో, వివిధ సందర్భాల్లో స్నేహితులు, బంధువులకు బంగారాన్ని బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీ. రాఖీ పండుగ సందర్భంగా చాలా మంది సోదరులు తమ అక్కాచెల్లెళ్లకు బంగారాన్ని కానుకగా ఇస్తున్నారు. మీరు కూడా మీ సోదరికి నగలను బహుమతిగా ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటే, ఈసారి కొన్ని మార్పులు చేసి డిజిటల్ బంగారాన్ని బహుమతిగా ఇవ్వండి. డిజిటల్ బంగారాన్ని అవసరమైనప్పుడు వెంటనే నగదుగా మార్చుకోవచ్చు. దొంగల భయం ఉండదు. తిరిగి అమ్మినప్పుడు తరుగు ఆందోళన కూడా ఉండదు.


మ్యూచువల్ ఫండ్ (Mutual Fund)
ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కోసం అందరూ ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేరు. అయినా, మీరు అమితంగా ఇష్టపడే సిస్టర్‌కు మంచి ఆర్థికపరమైన బహుమానం ఇవ్వాలనుకుంటే, మ్యూచువల్ ఫండ్స్ ఒక గొప్ప ఎంపిక అవుతుంది. మీరు మీ సోదరి కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టే బదులు క్రమంగా వాయిదాల పద్ధతిలో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంటుంది. కాలం గడిచే కొద్దీ, మీ సిస్టర్‌ కోసం పెద్ద మొత్తం డబ్బు సిద్ధం అవుతుంది.


స్టాక్స్ (Stocks)
మీరు దీన్ని మీ సోదరికి నేరుగా ఇవ్వవచ్చు. ఇందుకోసం మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ సిస్టర్‌కు ట్రేడింగ్ అకౌంట్‌ లేకుంటే, ఆమె పేరిట నిమిషాల వ్యవధిలో డీమ్యాట్ ఖాతాను తెరిచి, మంచి కంపెనీ షేర్లను కొని, వాటిని మీ సోదరికి బహుమతిగా ఇవ్వండి. రాబోయే సంవత్సరాల్లోని ప్రతి రక్షాబంధన్‌ రోజు మీరు మరిన్ని షేర్లను ఆ డీమ్యాట్‌ అకౌంట్‌లో యాడ్‌ చేస్తూ వెళ్లండి. ఇవి కూడా ఆమెకు ఆర్థికంగా చాలా అండగా నిలుస్తాయి.


మరో ఆసక్తికర కథనం: లక్షకు ₹12 లక్షలు - ఇన్వెస్టర్లను మూడేళ్లలో మిలియనీర్లుగా మార్చిన టాటా స్టాక్‌


Join Us on Telegram: https://t.me/abpdesamofficial