Rakesh Jhunjhunwalas net worth dips over ₹1000 crore this week in these two stocks : ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలు స్టాక్‌ మార్కెట్లను వెంటాడుతున్నాయి. చాలా కంపెనీల షేర్ల ధరలు పతనమవుతున్నాయి. ఇన్వెస్టర్లు తమ పోర్టుపోలియోలోని షేర్లను తెగనమ్ముతున్నారు. నాణ్యమైన స్టాక్స్‌ సైతం 52 వారాల కనిష్ఠ స్థాయిలో కదలాడుతున్నాయి. ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (Rakesh Jhunjhunwala) పెట్టుబడి పెట్టినప్పటికీ టైటాన్‌ కంపెనీ (Titan), స్టార్‌హెల్త్‌ (Star Health) షేర్లు ఈ వారం తీవ్రంగా నష్టపోయాయి. దాంతో చివరి ఐదు రోజుల్లో రాకేశ్‌ ఏకంగా రూ.1000 కోట్ల మేర సంపదను కోల్పోయారు.


గత వారంలో టైటాన్‌ షేర్లు రూ.2,053 నుంచి రూ.1,944 స్థాయికి పడ్డాయి. ఒక్కో షేరు రూ.108 మేర నష్టపోయింది. స్టార్‌హెల్త్‌ సైతం రూ.531 నుంచి రూ.475కు తగ్గింది. వారం రోజుల్లో ఒక్కో షేరు రూ.55 మేర నష్టపోయింది. 2022, మార్చి నాటికి టైటాన్‌లో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాకు 3,53,10,395 షేర్లు ఉన్నాయి. ఆయన భార్య రేఖాకు 95,40,575 షేర్లు ఉన్నాయి. మొత్తంగా వీరిద్దరికీ కలిపి 4,48,50,970 టైటాన్స్‌ షేర్లు ఉన్నాయి. ఇక స్టార్ హెల్త్‌లో ఆర్జేకు 10,07,53,935 షేర్లు ఉన్నాయి.


Also Read: బంగారం భగ భగ! దిగుమతి పన్ను రెట్టింపు చేసిన కేంద్రం!


Also Read: క్రెడిట్‌ కార్డు అప్పు గుదిబండలా మారిందా? ఈ 10 చిట్కాలతో రిలాక్స్‌ అవ్వండి!


టైటాన్‌ ఒక్కో షేరు ఐదు సెషన్లలో రూ.108.75 తగ్గడంతో రాకేశ్ ఝున్‌ఝన్‌వాలా దంపతుల సంపద రూ.485 కోట్ల మేర తగ్గింది. స్టార్‌హెల్త్‌ ఒక్కో షేరు రూ.55.20 తగ్గడంతో రూ.555 కోట్ల మేర నష్టం వాటిల్లింది. మొత్తంగా ఈ రెండు కంపెనీల వల్ల వారు రూ.1040 కోట్ల మేర సంపద  నష్టపోయారు. అలాగే వారు పెట్టుబడులు పెట్టిన టాటా మోటార్స్‌, ఇండియన్‌ హోటల్స్‌, ర్యాలీస్‌ ఇండియా, నాల్కో, కెనరా బ్యాంక్ షేర్లు సైతం నష్టాల్లోనే ముగిశాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.