Credit Card Debt: ఇంటి అవసరాల కోసం క్రెడిట్ కార్డులను వాడుతుంటే బాగానే అనిపిస్తుంది. కానీ పెద్దమొత్తంలో తీసుకున్న అప్పును చెల్లించాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి! ఒక్క ఈఎంఐ ఆలస్యమైనా వడ్డీ బాదుడు మామూలుగా ఉండదు. అందుకే క్రెడిట్ కార్డు సహా ఇతర రుణాలు తీర్చేందుకు ఆర్థిక నిపుణులు ఇస్తున్న సూచనలివే!
మీ రుణాలు సమీక్షించుకోండి
అప్పులు తీర్చేందుకు మొదట కావాల్సింది వాటిని సమీక్షించుకోవడం! ఎంత రుణపడ్డారు? ఎవరికి రుణపడ్డారు? ఎప్పటి వరకు అన్నది రివ్యూ చేసుకోవాలి. మీకు వస్తున్న ఆదాయాన్ని ఏం చేస్తున్నారో పరిశీలించాలి. అప్పుడు ఖర్చులను ఎక్కడ తగ్గించాలో తెలుస్తుంది. దీనిద్వారా చక్కని స్పెండింగ్ ప్యాట్రెన్స్ అలవడతాయి.
ట్రాక్ చేయండి
మూడు నెలల ఆదాయం, ఖర్చులను ట్రాక్ చేయాలి. ఎక్సెల్ షీట్‌ను ఉపయోగించి ప్రతిదీ రికార్డు చేసుకోవాలి. మీ అవసరాలు, కోరికల చిట్టాను తెలుసుకోవాలి. ఉదాహరణకు ఇంటి అద్దె, బీమా, ఆహారం అనేవి అవసరాలు. కొందరికి చిన్న కారు సరిపోతుంది. కానీ పెద్ద కారుంటే బాగుంటుందన్న కోరిక ఉంటుంది. ఇలా మీ కోరికలు, అవసరాలను ట్రాక్ చేస్తే డబ్బును మిగిల్చుకోవచ్చు.
అత్యవసర నిధి
ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే అత్యవసర నిధి (Emergency fund) ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకుంటే అప్పు తీర్చేందుకు మిగిలించే డబ్బును ఖర్చుపెట్టే అవసరం రాదు. పైగా ఆస్పత్రి వంటి ఖర్చులకు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉండదు.
క్రెడిట్ కార్డు ప్రొవైడర్ సాయం తీసుకోండి
రుణం తీర్చేందుకు మీ క్రెడిట్ కార్డు ప్రొవైడర్ సాయం తీసుకోండి. పెద్ద మొత్తంలో ఉన్న అప్పు తీర్చేందుకు ఏదైనా సూచనలు ఇస్తారేమో కనుక్కోండి. ఎందుకంటే అప్పు తీర్చాలనుకున్న మీ నిజాయతీని చూసి కొన్ని సంస్థలు చెల్లించాల్సిన మొత్తంలో కొంత తగ్గించొచ్చు. లేదా వడ్డీలో మినహాయింపులు ఇవ్వొచ్చు. లేదా వడ్డీరేటును తగ్గించొచ్చు.
రీ ఫైనాన్స్‌కు ప్రయత్నించండి
మీ క్రెడిట్ కార్డు అప్పు విపరీతంగా పోగుపడిందనుకోండి చిక్కుల్లో పడతారు. ప్రతి నెలా విపరీతంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీ మార్టగేజ్ కోసం రీఫైనాన్స్ కోసం ప్రయత్నించండి. దానివల్ల వడ్డీభారం తగ్గుతుంది. క్రెడిట్ స్కోరు మెరుగవుతుంది. సింపుల్‌గా ఎక్కువ వడ్డీరేటుతో కూడిన అప్పు తీర్చేందుకు తక్కువ వడ్డీరేటుతో మరో అప్పు తీసుకోవడం అన్నమాట.
తుది గడువు పెట్టుకోండి
మీ అప్పు తీర్చేందుకు తుది గడువును సెట్ చేసుకోండి. ఆన్‌లైన్ క్యాల్కులేటర్లను ఉపయోగించుకోండి. అవసరమైతే ఆర్థిక నిపుణులను సంప్రదించండి. సుదీర్ఘ కాలమైనా సరే తుది గడువు నిర్ణయించుకుంటే ఒక లక్ష్యం ఏర్పడుతుంది. మెల్లగా అప్పు తీర్చే అలవాటు అవుతుంది. దానిపై ఫోకస్ పెరుగుతుంది.
ఏది ముందో నిర్ణయించుకోండి
చాలా మంది వద్ద రెండుమూడు క్రెడిట్ కార్డులు ఉంటాయి. ప్రతి దానిమీదా అప్పు ఉంటుంది. అలాంటప్పుడు ఏ క్రెడిట్ కార్డు అప్పు ముందుగా తీర్చాలో నిర్ణయించుకోండి. అలాగే నెలలో వీలైనన్ని ఎక్కువ సార్లు డబ్బు కట్టేయండి. ఉదాహరణకు ఒక కిస్తీ కాకుండా రెండు మూడు సార్లు కట్టేయండి.
వాడటం తగ్గించండి
అప్పుల పాలై తిప్పలు పడకుండా ఉండాలంటే అత్యంత కఠినమైన నిర్ణయం ఒకటుంది. అదే క్రెడిట్ కార్డులను ఉపయోగించడాన్ని మానేయడం! చాలామంది అవసరం ఉన్నా లేకున్నా ఎడాపెడా కార్డులను వాడేస్తుంటారు. కార్డు బ్యాలెన్స్ అయిపోతుందో లేదో చెక్ చేసుకోకుండా గీకేస్తారు. ఆ తర్వాత ఇబ్బంది పడతారు.
బాధను పంచుకోండి
కొన్నిసార్లు అప్పులు తీర్చే ప్రక్రియ మానసికంగా భారమవుతుంది! ఆర్థిక అవసరాలను సరిగ్గా నెరవర్చకపోవడంతో ఇబ్బంది పడుతుంటాం. అలాంటప్పుడు మీ స్నేహితులు, బంధువులతో మీరెలా అప్పులు తీరుస్తున్నారో చెప్పండి. మీ బాధను పంచుకోవడం ద్వారా సాంత్వన లభిస్తుంది. వారిచ్చే ప్రోత్సాహంతో మీరు మరింత త్వరగా రుణం తీర్చగలరు.
ఓపిక పట్టాలి
మనకు బాగా మంచి చేసిది అంత త్వరగా అలవాటవ్వదని అంటుంటారు! మీరు అప్పు తీర్చడం కూడా అంత సులభమేమీ కాదు. ఓపిక అవసరం అవుతుంది. కాస్త సహనంగా ఉండే మీ లక్ష్యం నెరవేరుతుంది.