Share Market News: స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న తుపాను నుంచి, దివంగత పెట్టుబడిదారుడు & బిగ్‌ బుల్‌ రాకేష్ జున్‌జున్‌వాలా షేర్లు కూడా తప్పించుకోలేకపోయాయి. జున్‌జున్‌వాలా పిల్లల పేరు మీద ఉన్న మూడు ట్రస్టుల పెట్టుబడులను మార్కెట్‌ పతనం ఓ ఊపు ఊపింది. దూరదృష్టి & లోతైన అవగాహనతో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు పెడతారని, స్టాక్స్‌ను ఎంచుకుంటారని మార్కెట్‌ భావిస్తుంది. ఆయన చనిపోయిన తర్వాత కూడా, ఝున్‌ఝున్‌వాలా పోర్టిఫోలియోను కాపీ చేసి చాలా మంది ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలను నిర్మించుకున్నారు. ఇప్పుడు, రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడుల్లో ఒకటైన కంకర్డ్‌ బయోటెక్ స్టాక్, కేవలం రెండు సెషన్లలోనే బాగా పడిపోయింది. ఆ పతనం ధాటికి, రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కుటుంబ ట్రస్ట్‌లు దాదాపు రూ.1,600 కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి.


30 శాతం వరకు భారీ పతనం
కేవలం రెండు ట్రేడింగ్ సెషన్లలోనే కంకర్డ్‌ బయోటెక్ షేర్లు 30 శాతం వరకు పడిపోయాయి. గత శుక్రవారం (14 ఫిబ్రవరి 2025) ఈ కంపెనీ షేర్లు 19.75% పతనమై రూ. 1,693.20 వద్ద ముగిశాయి. సోమవారం (17 ఫిబ్రవరి 2025) దీని ధర 12.46% క్షీణించి రూ. 1,482.15కి చేరుకుంది. ఈ రోజు (మంగళవారం, 18 ఫిబ్రవరి 2025), ఉదయం 11.30 గంటల సమయానికి ఈ షేర్‌ 2.43% పెరిగి రూ. 1,723.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కంకర్డ్‌ బయోటెక్ స్టాక్ ఇప్పుడు దాని 52 వారాల గరిష్ట స్థాయి రూ. 2,658 నుంచి దాదాపు 45 శాతానికి పైగా పడిపోయింది. 


కంకర్డ్‌ బయోటెక్ స్టాక్ పెట్టుబడుల్లో ఎక్కువ భాగాన్ని నిష్ఠ ఝున్‌ఝున్‌వాలా డిస్క్రిషనరీ ట్రస్ట్, ఆర్యమాన్ ఝున్‌ఝున్‌వాలా డిస్క్రిషనరీ ట్రస్ట్, ఆర్యవీర్ ఝున్‌ఝున్‌వాలా డిస్క్రిషనరీ ట్రస్ట్ కలిగి ఉన్నాయి. ఇవి సమష్టిగా ఆ కంపెనీలో పావు వంతు వాటాను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో, నిష్ఠ ఝున్‌ఝున్‌వాలా ట్రస్ట్ 8.03 శాతం (83,99,732 షేర్లు), ఆర్యమాన్ & ఆర్యవీర్ ట్రస్టులు తలో 8.03 శాతం (83,99,754 షేర్లు) కలిగి ఉన్నాయి. 


కంపెనీకి అంత భారీ నష్టం ఎందుకు వచ్చింది? 
కంకర్డ్‌ బయోటెక్ షేర్లు భారీగా పడిపోవడానికి అతి పెద్ద కారణం డిసెంబర్ త్రైమాసిక (2024 అక్టోబర్‌-డిసెంబర్‌ కాలం) ఫలితాలే. ఈ కాలంలో కంపెనీ పెద్దగా లాభాలు ఆర్జించలేదు. డిసెంబర్ త్రైమాసికంలో, కంపెనీ నికర లాభం గత సంవత్సరంతో పోలిస్తే 2 శాతం తగ్గింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.75.9 కోట్ల లాభాన్ని ఆర్జించగా, ఏడాది క్రితం అదే కాలంలో లాభం రూ.77.6 కోట్లుగా ఉంది. ఈ సంవత్సర కాలంలో కంపెనీ ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.244.2 కోట్లకు చేరుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: భారత్‌లో ఉద్యోగాలకు 'టెస్లా' ప్రకటన - మోదీ చేసిన 'మ్యాజిక్‌' ఇది