Indian railway service charges: ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు విచిత్రమైన అనుభూతి అందించనుంది. సేవల రుసుమును తొలగించినట్టే తొలగించి మరో విధంగా అమలు చేస్తోంది! ప్రీమియం రైళ్లలో ముందుగా బుక్ చేయని భోజనాలు, పానీయాలపై ఆన్‌బోర్డ్ సేవా రుసుములను ఐఆర్‌సీటీసీ తొలగించింది. అయితే స్నాక్స్, మధ్యాహ్నం, రాత్రి భోజనాల ధరల్లో రూ.50ను కలిపేసింది. ఇక నుంచి ముందుగా బుక్ చేసినా, చేయకపోయినా టీ, కాఫీ ధరలు ప్రయాణికులందరికీ ఒకేలా ఉంటాయి.
గతంలో రైలు టికెట్‌తో పాటు భోజనాలను బుక్ చేసుకోనివారు ప్రయాణిస్తుండగా ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఐఆర్‌సీటీసీ అదనంగా రూ.50 వరకు సేవా రుసుము వసూలు చేసేది. రూ.20 విలువ చేసే టీ, కాఫీ అయినా సరే వాటిపై రూ.50 ఫీజు కలిపి రూ.70 తీసుకొనేది. ఇప్పుడు రాజధాని, దురంతో, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో ముందుగా బుక్ చేసుకున్నా లేకపోయినా కాఫీ, టీకి రూ.20 ఇస్తే సరిపోతుంది. ఒకప్పట్లా సర్వీస్ ఛార్జ్‌తో కలిపి రూ.70 ఇవ్వాల్సిన అవసరం లేదు.
గతంలో అల్పాహారానికి రూ.105, భోజనానికి రూ.185, సాయంత్రం స్నాక్స్‌కు రూ.90 తీసుకొనేవారు. భోజనాలపై రూ.50 వరకు అదనపు రుసుము వసూలు చేసేవారు. ఇప్పుడు భోజనం ఖర్చులోనే సేవా రుసుమును కలిపేసి అల్పాహారానికి రూ.155, భోజనానికి రూ.235, స్నాక్స్‌కు రూ.140 తీసుకుంటారు.
'తొలగించిన సేవా రుసుముల ధరలు కేవలం టీ, కాఫీ వరకు ప్రతిబింబిస్తున్నాయి. ముందుగా బుక్ చేసుకున్నా, చేసుకోకపోయినా ఒకే ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇక భోజనాలను బుక్ చేసుకోని వారికి సేవా రుసుమును అసలు ధరలోనే కలిపేశారు' అని ఓ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. వందే భారత్ రైళ్లలోనూ ఆన్ బోర్డ్ సేవలను బుక్ చేసుకోనివారూ ఇవే ధరలు చెల్లించాల్సి ఉంటుంది.