GST Rates: కొన్ని వస్తువులను విడిగా అమ్మినప్పుడు జీఎస్టీ వర్తించదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ధాన్యాలు, పప్పులు, పిండి, పెరుగు, బటర్‌ మిల్క్‌ను ప్యాక్‌ చేయకుండా విక్రయిస్తే 5 శాతం పన్ను ఉండదని స్పష్టం చేశారు. జీఎస్‌టీ మండలిలో ఒక్కరే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోరని, అంతా కలిసి సమష్టిగా పన్ను రేట్లు నిర్ణయిస్తారని వరుస ట్వీట్లు చేశారు. కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.


'ముందుగానే ప్యాక్‌ చేసిన, లేబుల్‌ వేసిన వస్తువులపై పన్ను వేయాలన్న నిర్ణయం జీఎస్టీ మండలి సమష్టిగా తీసుకుంది. ఏ ఒక్కరో తీసుకోలేదు. ఈ జాబితాలోని వస్తువులను ప్యాక్‌ చేయకుండా విక్రయిస్తే ఎలాంటి జీఎస్‌టీ వర్తించదు. మా చర్చలు ఎలా జరిగాయో, వాటి సారాంశం ఏమిటో ఈ 14 ట్వీట్లలో ఇస్తున్నాం' అని నిర్మల ట్వీట్‌ చేశారు.






'పప్పులు, ధాన్యాలు, పిండి సహా మరికొన్ని ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించాలని జీఎస్టీ మండలి 47వ సమావేశంలో నిర్ణయించింది. ప్రస్తుతం వ్యాపించిన  సమాచారంలో అవాస్తవాలు ఉన్నాయి. ఆ ఆహార పదార్థాలపై పన్ను విధించడం ఇదే తొలిసారా? కానే కాదు. జీఎస్టీకి ముందూ ఇలాంటి వస్తువులపై రాష్ట్రాలు పన్నుల ద్వారా రాబడి పొందాయి. తిండి గింజలపై కొనుగోలు పన్ను ద్వారా పంజాబ్‌ ఒక్కటే రూ.2000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఉత్తర్‌ ప్రదేశ్‌ రూ.700 కోట్లు రాబట్టింది. ఆహార పదార్థాలపై పంజాబ్‌ 5.5, మహారాష్ట్ర 6, చత్తీస్‌ గఢ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, కేరళ, మణిపుర్‌ 5 శాతం మేర పన్ను వసూలు చేశాయి' అని నిర్మలా సీతారామన్‌ ట్వీట్‌ చేశారు.


'గతంలో రిజిస్టర్‌ చేసిన బ్రాండ్లపై జీఎస్టీ విధించాం. దీనిని కొందరు వ్యాపారస్తులు దుర్వినియోగం చేశారు. సవ్యంగా పన్నులు చెల్లిస్తున్నవారు అందరికీ ఒకేలా ఉండాలా మార్పులు చేయాలని కోరారు. వారి సూచనల మేరకే ప్యాకేజీ, లేబుల్‌ వేసిన ఆహార పదార్థాలపై 5 శాతం జీఎస్టీ విధించాం. పన్ను ఎగవేతను రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్‌ రాష్ట్రాల అధికారులతో కూడిన బృందం గుర్తించింది. దుర్వినియోగం చేయకుండా నిబంధనలు మార్చాలని అనేక సమావేశాల్లో చర్చించాం' అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.






జీఎస్టీ వర్తించని వస్తువులు



  • ధాన్యాలు, పప్పులు

  • గోధుమలు

  • ఓట్స్‌

  • మైదా పిండి

  • బియ్యం

  • పిండి

  • రవ్వ

  • శెనగపిండి

  • పఫ్ఫుడ్‌ రైస్‌

  • పెరుగు / లస్సీ