PPF Rules Changed From October 2024: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా (PPF ఖాతా)కు సంబంధించిన రూల్స్‌లో కొన్ని మార్పులు జరిగాయి. పాత ఖాతాలకు కాకుండా, ఈ ఏడాది అక్టోబర్ (01 అక్టోబర్‌ 2024) నుంచి ప్రారంభించే కొత్త ఖాతాలకు కొత్త రూల్స్‌ వర్తిస్తాయి. ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలు, పిల్లల పేరిట తెరిచిన ఖాతాలు, నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌ (NRI) పీపీఎఫ్ ఖాతాలకు సంబంధించిన నియమాలు మార్చారు.


మైనర్ PPF ఖాతాపై వడ్డీ
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) నోటిఫికేషన్‌ ప్రకారం, పోస్టాఫీస్‌ ద్వారా అమలవుతున్న జాతీయ పొదుపు పథకాల (National Savings Schemes) కింద PPF ఖాతాలో నూతన మార్పులు జరిగాయి. కొత్త నిబంధనల ప్రకారం, మైనర్ పేరు మీద తెరిచిన పీపీఎఫ్ ఖాతాలో, అతనికి 18 ఏళ్లు వచ్చే వరకు వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. అతను మేజర్‌గా మారే తేదీని ఈ ఖాతా మెచ్యూరిటీ వ్యవధిగా పరిగణిస్తారు. తల్లిదండ్రులు, తాతలు లేదా సంరక్షకులు మైనర్ పేరిట వేర్వేరుగా ఖాతాలు తెరిచి ఉంటే, అన్ని ఖాతాల్లో జమ చేసే డబ్బు గరిష్ట వార్షిక పరిమితికి (రూ. 1.50 లక్షలు) మించకూడదు. జాయింట్ అకౌంట్ విషయంలో కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.


ఒకటి కంటే ఎక్కువ PPF ఖాతాలు ఉంటే?
ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ PPF ఖాతాలను తెరిచి ఉంటే వాటిని విలీనం చేసి ఒకటిగా మారుస్తారు. ప్రాథమిక ఖాతాలో వడ్డీ జమ అవుతూ ఉంటుంది. ఇతర ఖాతాల్లో ఉన్న డబ్బు కూడా ప్రాథమిక ఖాతాకు బదిలీ అవుతుంది. అన్ని ఖాతాల్లో డిపాజిట్ చేసే డబ్బు కూడా నిర్ణీత వార్షిక పరిమితిని మించకూడదు. ఖాతాల విలీనం తర్వాత స్థిర వడ్డీ రేటు వర్తిస్తుంది. అన్ని అకౌంట్లలో కలిపి డబ్బు పరిమితికి మించి ఉంటే, దానిని ఖాతాదారుకు తిరిగి ఇచ్చేస్తారు. ప్రైమరీ & సెకండరీ అకౌంట్‌ కాకుండా ఏదైనా మూడో PPF ఖాతా కూడా ఉంటే, దానిపై వడ్డీ చెల్లించరు.


NRI PPF ఖాతా
కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒక NRI పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ కింద PPF ఖాతాను తెరిస్తే, అతను 30 సెప్టెంబర్ 2024 వరకు మాత్రమే వడ్డీని పొందుతాడు. ఆ తర్వాతి కాలానికి వడ్డీ చెల్లించరు. నివాస ధ్రువీకరణ పత్రం లేనివారి విషయంలో ఈ రూల్‌ వర్తిస్తుంది. వడ్డీ రాకపోయినప్పటికీ, ఒకవేళ NRIకి ఇష్టమైతే, మెచ్యూరిటీ తేదీ వరకు తన PPF ఖాతాను కొనసాగించవచ్చు. NRIలుగా మారిన భారతీయ పౌరులపై ఈ రూల్‌ ప్రభావం ఉంటుంది. 


పీపీఎఫ్‌ ఖాతా వడ్డీ, ఇతర వివరాలు
ప్రస్తుతం, పీపీఎఫ్‌ ఖాతాల మీద ఏడాదికి 7.1 శాతం వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రతి 3 నెలలకు ఒకసారి దీని వడ్డీ రేటును ప్రభుత్వం ప్రకటిస్తుంది. పీపీఎఫ్‌ ఖాతాలో పెట్టుబడి 15 సంవత్సరాలు పాటు లాక్‌ అవుతుంది. అయితే, అత్యవసర పరిస్థితుల్లో, ఖాతా ప్రారంభించిన 5 సంవత్సరాల తర్వాత డబ్బు తీసుకోవచ్చు. 15 ఏళ్ల తర్వాత అకౌంట్‌లోని మొత్తం డబ్బును ఏకమొత్తంగా తీసుకోవచ్చు. పీపీఎఫ్‌ ఖాతాలో జమ చేసిన డబ్బుకు ఆదాయ పన్ను మినహాయింపును ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, పీపీఎఫ్‌ ఖాతాపై వచ్చే వడ్డీ (interest), మెచ్యూరిటీ అమౌంట్‌పైనా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.


మరో ఆసక్తికర కథనం: ఈ ఏడాది 48 లక్షల పెళ్లిళ్లు, రూ.6 లక్షల కోట్ల ఖర్చు - ముహూర్తాలు ఎప్పుడంటే?