SBI Annuity Deposit Scheme: మన దేశంలో, ప్రజలకు అతి నమ్మకమైన బ్యాంక్ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (State Bank Of India). ఈ బ్యాంక్ ద్వారా కస్టమర్లు చాలా రకాల ప్రయోజనాలు పొందుతున్నారు. టర్మ్ డిపాజిట్లు కాకుండా చాలా స్పెషల్ డిపాజిట్ స్కీముల్లో డబ్బును డిపాజిట్ చేసి వడ్డీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అలాంటి ప్రత్యేక పథకాల్లొ ఒకటి "ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ పథకం".
ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే... ఇందులో ఒకేసారి డిపాజిట్ చేయాలి, ఆ తర్వాత, మీకు ప్రతి నెలా వడ్డీతో పాటు హామీతో కూడిన ఆదాయం (guaranteed income) లభిస్తుంది. కస్టమర్‌కు అసలుతో పాటు ప్రతి నెలా వడ్డీ కూడా వస్తుంది. ప్రతి త్రైమాసికంలో, ఖాతాలో మిగిలిన డబ్బుపై వడ్డీని లెక్కిస్తారు. SBI వెబ్‌సైట్ ప్రకారం, ఈ డిపాజిట్‌పై వడ్డీ బ్యాంక్ FDకి సమానంగా ఉంటుంది.
ఎంత కాలానికి డిపాజిట్ చేయాలి?
36 నెలలు, 60 నెలలు, 84 నెలలు లేదా 120 నెలల కోసం ఏకమొత్తంగా డబ్బును డిపాజిట్ చేయవచ్చు. ఎంత డబ్బయినా డిపాజిట్ చేయొచ్చు, ఈ పథకంలో గరిష్ట పరిమితి లేదు. కనీస యాన్యుటీ నెలకు రూ.1000. అంటే, పింఛను తరహాలో నెలకు కనీసం వెయ్యి రూపాయలు చేతికి వస్తుంది.
చెల్లింపు ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో, మీరు డబ్బును డిపాజిట్ చేసిన తర్వాతి నెల నిర్ధిష్ట తేదీ నుంచి యాన్యుటీ చెల్లింపు ప్రారంభం అవుతుంది. ఒకవేళ ఆ తేదీ (29, 30 లేదా 31) ఒక నెలలో లేకుంటే, ఆ తర్వాతి నెల 1వ తేదీన యాన్యుటీ అందుతుంది. యాన్యుటీ చెల్లింపునకు ముందే TDS కట్ చేస్తారు. మిగిలిన డబ్బును మీ సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్‌లో బ్యాంక్ క్రెడిట్ చేస్తుంది.
SBI యాన్యుటీ డిపాజిట్ పథకంలో సాధారణ కస్టమర్లు, సీనియర్ సిటిజన్లు ఎవరైనా డిపాజిట్ చేయొచ్చు. టర్మ్ డిపాజిట్లపై (FD) ఇచ్చే వడ్డీని ఈ పథకంలో బ్యాంక్ ఇస్తుంది. ఈ అకౌంట్ నామినేషన్ సదుపాయం కూడా ఉంది. కస్టమర్‌కు యూనివర్సల్ పాస్‌బుక్ జారీ చేస్తారు. దీనివల్ల, ఒక శాఖ నుంచి మరో శాఖకు ఖాతాను బదిలీ చేసుకోవచ్చు.
రుణ సౌకర్యం
మీకు అవసరమైతే, యాన్యుటీ బ్యాలెన్స్ మొత్తంలో 75% వరకు ఓవర్‌డ్రాఫ్ట్/లోన్ రూపంలో తీసుకోవచ్చు. లోన్/ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకున్న తర్వాత, మీరు రావల్సిన యాన్యుటీ డబ్బును లోన్ అకౌంట్‌లో జమ చేస్తారు.
ప్రి-క్లోజింగ్
డిపాజిటర్ మరణిస్తే, ఈ పథకాన్ని గడువుకు ముందే మూసివేయవచ్చు. రూ. 15 లక్షల వరకు డిపాజిట్లకు ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఆ సమయంలో, FDపై విధించే అదే రేటుకు సమానంగా ప్రి-మెచ్యూరిటీ పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది. అంటే, టర్మ్ డిపాజిట్ రేట్ ప్రకారం ఈ పథకంలో ప్రి-మెచ్యూరిటీ పెనాల్టీని బ్యాంక్ వసూలు చేస్తుంది.
ఎవరు అర్హులు
ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ అన్ని ఎస్‌బీఐ శాఖల్లో అందుబాటులో ఉంది. మీకు దగ్గరలో ఉన్న SBI బ్రాంచ్‌కు వెళ్లి ఖాతా ఓపెన్ చేయవచ్చు. మైనర్లు సహా, భారతదేశంలో నివశించే ఏ వ్యక్తయినా ఖాతాను తెరవొచ్చు. సింగిల్ లేదా జాయింట్‌గానూ ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
మరో ఆసక్తికర కథనం: యుద్ధం దెబ్బకు ఆకాశంలో గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి