Marriage Cost In India: అక్టోబర్ ప్రారంభంతో పండుగ సీజన్ తారస్థాయికి చేరుకుంది. అక్టోబర్‌ 31న దీపావళితో మన దేశంలో పెద్ద పండుగల సీజన్ ముగుస్తుంది. ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. సుముహూర్తాల్లో దాదాపు 48 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా. ఈ పెళ్లిళ్ల కోసం దాదాపు రూ.6 లక్షల కోట్లను భారతీయులు ఖర్చు చేయబోతున్నారు. వ్యాపారస్తులతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ కూడా వీటి వల్ల గొప్ప ప్రయోజనం పొందొచ్చు. ఈసారి పెళ్లిళ్లలో ఎక్కువగా భారతీయ వస్తువులనే వినియోగిస్తారని వ్యాపారస్తులు భావిస్తున్నారు.


నవంబర్ 12 నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం
ఈ ఏడాది నవంబర్ 12 నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అవుతుంది. పెళ్లిళ్ల సీజన్‌లో ప్రజలు చేసే ఖర్చుపై 'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్' (CAIT) పరిశోధన చేసింది. CAIT ప్రకారం, ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్‌లో వస్తువులు & సేవల రిటైల్ రంగంలో దాదాపు రూ. 5.9 లక్షల కోట్ల వ్యాపారం జరగొచ్చు. గతేడాది ఇదే సీజన్‌లో దాదాపు 35 లక్షల జంటలు ఒక్కటైతే (35 లక్షల వివాహాలు), వారి వల్ల రూ. 4.25 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరిగింది. 2023 సంవత్సరంలో వివాహాలకు 11 శుభ ముహూర్తాలు ఉన్నాయి, ఈ సంవత్సరం 18 శుభ ముహూర్తాలు ఉన్నాయి. ముహూర్తాల సంఖ్య పెరిగింది కాబట్టి వ్యాపారం కూడా పెరుగుతుందని CAIT అంచనా. పరిశోధన ప్రకారం, ఈ సీజన్‌లో, ఒక్క దిల్లీలోనే 4.5 లక్షల వివాహాల ద్వారా రూ. 1.5 లక్షల కోట్ల వ్యాపారం జరగొచ్చు.


నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో శుభముహూర్త తేదీలు
CAITకి చెందిన వేద, ఆధ్యాత్మిక కమిటీ కన్వీనర్ ఆచార్య దుర్గేష్ తారే చెబుతున్న ప్రకారం... ఈ సంవత్సరం వివాహ సీజన్ నవంబర్ 12న ఏకాదశి నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్‌ నెలలో.. 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28 & 29 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబర్‌ నెలలో... 4, 5, 9, 10, 11, 14, 15 & 16 తేదీల్లో కళ్యాణ ఘడియలు ఉన్నాయి. ఆ తర్వాత దాదాపు ఒక నెల పాటు ముహూర్తాలు లేవు. మళ్లీ, 2025  జనవరి మధ్య నుంచి మొదలై మార్చి వరకు కొనసాగుతాయి.


పెళ్లిళ్ల సీజన్‌లో వీటికి డిమాండ్‌
ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందనగా, ప్రజలు ఇప్పుడు భారతీయ వస్తువులకు ప్రాధాన్యత ఇస్తున్నారని CAIT జాతీయ ప్రధాన కార్యదర్శి & ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’, ‘స్వయం సమృద్ధి భారత్‌’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు బలంగా వ్యాపించిందన్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో... దుస్తులు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్‌ & ఎలక్ట్రికల్‌ ఉపకరణాలు, డ్రై ఫ్రూట్స్‌, స్వీట్లు, చిరుతిళ్లు, కిరాణా సరకులు, కూరగాయలు, బహుమతులు వంటి వాటి విక్రయాలు పెరుగుతాయి. ఇవే కాకుండా... బాంక్వెట్ హాల్స్, హోటళ్లు, వివాహ గృహాలు, విడిది గృహాలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్, టెంట్ డెకరేషన్, క్యాటరింగ్ సర్వీసెస్, ఫ్లవర్ డెకరేషన్, ట్రాన్స్‌పోర్ట్, క్యాబ్ సర్వీస్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఆర్కెస్ట్రా, బ్యాండ్, లైట్ & సౌండ్ వంటి వాటికి డిమాండ్ పెరుగుతుంది.


మరో ఆసక్తికర కథనం: ఈ రోజు స్టాక్‌ మార్కెట్లకు మాత్రమే సెలవా, MCXలో ట్రేడింగ్‌ జరుగుతుందా?