PPF Vs VPF Details: ముసలితనంలో లేదా పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించే పథకాల్లో పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), వాలెంటరీ ప్రావిడెండ్‌ ఫండ్‌ (VPF) పథకాలకు ఎక్కువ ప్రజాదరణ ఉంది. సాధారణంగా, ఉద్యోగులకు ప్రావిడెండ్‌ ఫండ్‌ (EPF) ఖాతా ఉంటుంది. దీనికి కొనసాగింపు మార్గమే వాలెంటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌ అని చెప్పొచ్చు. EPFO కోసం ఒక ఉద్యోగి కాంట్రిబ్యూట్‌ చేసే 12% మొత్తానికి మించి పొదుపు చేయాలనుకుంటే VPF అందుకు ఉపయోగపడుతుంది. సాధారణ ప్రజలకు పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఉపయోగపడుతుంది.


PPF Vs VPF:                       


అర్హత        
EPF అకౌంట్‌ యాక్టివ్‌గా ఉన్న ఉద్యోగులు మాత్రమే VPF ఖాతా తెరవగలరు. PPF ఖాతాకు ఈ అడ్డంకి లేదు. ఉద్యోగం ఉన్నా, లేకపోయినా పీపీఎఫ్‌ ఖాతా ప్రారంభించి పెట్టుబడి పెట్టొచ్చు.


కనీస, గరిష్ట మొత్తాలు      
పీపీఎఫ్‌ ఖాతాలో కనిష్ట మొత్తం కేవలం 100 రూపాయలు. ఒక ఆర్థిక సంవత్సరం మొత్తంలో 500 రూపాయలకు తగ్గకుండా జమ చేయాలి. గరిష్టంగా రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ఉద్యోగులకు మాత్రమే అర్హత ఉన్న వీపీఎఫ్‌లో ఖాతాలో కనిష్ట పరిమితి లేదు. ఉద్యోగి మూల వేతనం + డీఏకు సమానమైన మొత్తానికి మించకుండా డిపాజిట్‌ చేయొచ్చు, ఇదే గరిష్ట పరిమితి.


వడ్డీ రేటు      
2024 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో పీపీఎఫ్‌ ఖాతాపై 7.10% వడ్డీని నిర్ణయించారు. ఈపీఎఫ్‌పై చెల్లించే వడ్డీ రేటే వీపీఎఫ్‌కూ వర్తిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌ కోసం 8.25% వడ్డీ రేటును కేంద్రం నిర్ణయించింది.


మరో ఆసక్తికర కథనం: ఈపీఎఫ్‌వో నుంచి భారీ ఉపశమనం - చెక్ బుక్, పాస్‌బుక్ లేకపోయినా క్లెయిమ్‌ చేయొచ్చు 


నగదు ఉపసంహరణ        
పీపీఎఫ్‌ ఖాతా కాల పరిమితి 15 సంవత్సరాలు. ఇది పూర్తయ్యాక మరో ఐదేళ్లు పొడిగించొచ్చు. ఖాతా తెరిచిన ఆరో ఆర్థిక సంవత్సరం తర్వాత కొంత డబ్బు వెనక్కు తీసుకోవచ్చు. పీపీఎఫ్‌ ఖాతాలోని డిపాజిట్ల ఆధారంగా బ్యాంక్‌ లోన్ కూడా వస్తుంది. పీపీఎఫ్‌ ఖాతాకు కాల పరిమితి లేదు, పదవీ విరమణ చేసేవరకు డబ్బు జమ చేయవచ్చు. రిటైర్మెంట్‌ తర్వాత ఆ డబ్బును వెనక్కు తీసుకోవచ్చు. 


పన్ను ప్రయోజనం             
పీపీఎఫ్‌, వీపీఎఫ్‌ ఈ రెండూ ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80C పరిధిలోకి వస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షల పెట్టుబడి మొత్తానికి పన్ను మినహాయింపు పొందొచ్చు. వీపీఎఫ్‌ ఖాతాపై పొందే వడ్డీ ఆదాయానికి కూడా షరతులకు లోబడి పన్ను వర్తించదు.


ఖాతా ప్రారంభం       
పీపీఎఫ్‌ ఖాతాను మీ దగ్గరలోని పోస్టాఫీసు లేదా బ్యాంక్‌ శాఖలో ప్రారంభించొచ్చు. పీపీఎఫ్ ఖాతాను ఆన్‌లైన్‌లోనూ తెరవొచ్చు. వీపీఎఫ్‌ ఖాతా ప్రారంభించాలంటే కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించాలి.


మరో ఆసక్తికర కథనం: ఓటింగ్‌ పూర్తికాగానే ధరాఘాతం - పెరిగిన పాల రేట్లు - పెరగనున్న పెట్రోల్‌, మొబైల్‌ బిల్లులు!