EPF New Withdrawl Rules 2024: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO), ఈపీఎఫ్ క్లెయిమ్ రూల్స్ మార్చింది. దీనివల్ల, దేశవ్యాప్తంగా కోట్లాది మంది చందాదార్లకు పెద్ద ఉపశమనం లభించింది. ఇప్పుడు, EPF క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం రద్దు చేసిన చెక్ లేదా అటెస్ట్ చేసిన బ్యాంక్ పాస్‌బుక్ అవసరం లేదు. ఇప్పటివరకు, చెక్ లీఫ్ లేదా అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ కాపీని అప్‌లోడ్ చేయనందుకు EPFO ఆఫీసులు వేలకొద్దీ క్లెయిమ్స్ తిరస్కరిస్తున్నాయి. ఎట్టకేలకు, EPFO ఈ సమస్యకు పరిష్కారం చూపింది. ఒక సబ్‌స్క్రైబర్ ఇతర అన్ని షరతులను నెరవేరిస్తే, ఆ కేస్‌లో క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం చెక్ లీఫ్ లేదా బ్యాంక్ పాస్‌బుక్‌ను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ఆన్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్స్ వేగవంతం అవుతాయి.
సర్క్యులర్ జారీ చేసిన EPFO
ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ల కోసం నిబంధనలు మార్చినట్లు వెల్లడిస్తూ, 2024 మే నెల 28న, ఈపీఎఫ్‌వో ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. చెక్ లీఫ్ లేదా బ్యాంక్ పాస్‌బుక్ చిత్రాలను అప్‌లోడ్ చేయనందున తిరస్కరణకు గురయ్యే క్లెయిమ్‌ల సంఖ్యను తగ్గించడానికి నిబంధనల్లో మార్పులు చేసినట్లు తెలిపింది. అయితే, ఈ సడలింపు కొన్ని సందర్భాలకు మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు... బ్యాంక్ ఆన్‌లైన్ KYC ధృవీకరణ, DSC (డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్) ద్వారా KYC ధృవీకరణ, UIDAI ద్వారా ఆధార్ నంబర్ ధృవీకరణ వంటివి పూర్తయిన కేసుల్లోనే ఈ మినహాయింపు లభిస్తుంది.
ఇంతకు ముందు, EPF క్లెయిమ్ చేయడానికి సభ్యుడి పేరు, బ్యాంక్ ఖాతా నంబర్, IFSC కోడ్ వివరాలు ఉన్న బ్యాంక్ చెక్ లీఫ్‌ను (క్యాన్సిల్ చేసిన బ్యాంక్ చెక్) అప్‌లోడ్ చేయాలి. దీని ద్వారా, ఆ సభ్యుడి బ్యాంక్ ఖాతా వివరాలను EPFO నిర్ధరించుకుంటుంది. చెక్ లీఫ్ అందుబాటులో లేని పక్షంలో, ఆ సభ్యుడు తన బ్యాంక్ పాస్‌బుక్ (బ్యాంకు మేనేజర్ సంతకం ఉండాలి) కాపీని అప్‌లోడ్ చేయాలి. EPF సభ్యుడికి యూనివర్సల్ ఖాతా సంఖ్య (UAN) కచ్చితంగా ఉండాలి. ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా KYC పూర్తి చేయడంతో పాటు, వాటిని UAN నంబర్‌తో ధృవీకరించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ తతంగం తగ్గిపోయింది.
ఆన్‌లైన్ ద్వారా EPF క్లెయిమ్ ఎలా చేయాలి?
1. ముందుగా, https://unifiedportal-mem.epfindia.gov.in/ లింక్ ద్వారా EPFO అధికారిక పోర్టల్‌లోకి వెళ్లాలి. UAN, పాస్‌వర్డ్ నమోదు చేసి లాగిన్ కావాలి.
2. హోమ్ పేజీలో, క్లెయిమ్ సెక్షన్‌పై క్లిక్ చేయండి.
3. పెన్షన్ లేదా ఫుల్ సెటిల్‌మెంట్ వంటి క్లెయిమ్ రకాన్ని ఎంచుకోండి.
4. ఇక్కడ, ముందుగానే పూరించిన వివరాలు ఉంటాయి. ఆ వివరాలను ఒకసారి సరి చూసుకోండి.
5. ఇప్పుడు, EPFO ఇచ్చిన కొత్త వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. అవసరమైన అన్ని పత్రాలు లేదా సమాచారాన్ని అప్‌లోడ్ చేయండి.
6. ఆ తర్వాత, మొత్తం సమాచారాన్ని ధృవీకరించాలి, ఆ తర్వాత క్లెయిమ్ సబ్మిట్ చేయాలి.
7. ఇక్కడి నుంచి జరగాల్సిన పనిని EPFO చూసుకుంటుంది, తగిన పరిశీలన తర్వాత మీ క్లెయిమ్‌కు ఆమోదం తెలుపుతుంది.
మీరు సమర్పించిన క్లెయిమ్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి ఇదే పోర్టల్‌లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: ఈ రోజు బ్యాంక్‌లకు సెలవా, ఈ నెలలో ఎన్ని రోజులు హాలిడేస్?