Samman Crtificate Saving Scheme: మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ఈ ఆర్థిక సంవత్సరంతో (2023-24) పాటే ప్రారంభమైంది. ఇది, మహిళల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన డిపాజిట్ పథకం. ఏప్రిల్ 1, 2023 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మూడు నెలల్లో (ఏప్రిల్-జూన్) ఈ స్కీమ్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఉమెన్ ఫాలోయింగ్ పెరిగింది, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
10 లక్షల మంది - రూ. 6,000 కోట్లు
ఇప్పటివరకు, 1.026 మిలియన్ల మంది (10 లక్షల మంది) మహిళా పెట్టుబడిదారులు 'మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్' కింద అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఆ అకౌంట్స్‌లో రూ. 6,000 కోట్లకు పైగా డబ్బును జమ చేశారు. ప్రస్తుతానికి ఈ స్కీమ్ పోస్టాఫీసుల్లో మాత్రమే అందుబాటులో ఉంది.
ఇకపై బ్యాంకుల్లోనూ అందుబాటులోకి ఈ స్కీమ్
ఈ స్కీమ్‌కు వస్తున్న స్పందన చూసి, దీనిని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎంపిక చేసిన ప్రైవేట్ బ్యాంకుల్లోనూ స్టార్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, IDBI బ్యాంక్‌తో పాటు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌ను నిర్వహిస్తాయి. మహిళలు తమ దగ్గర్లోని ఈ బ్యాంక్ బ్రాంచుల్లో ఈ పథకం కింద అకౌంట్ ఓపెన్ చేసి, బెనిఫిట్స్ పొందొచ్చు. దీంతో, రాబోయే రోజుల్లో ఈ పథకంలో చేరే వాళ్ల సంఖ్య, పెట్టుబడి మొత్తం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ వడ్డీ రేటు
ఇది రెండేళ్ల డిపాజిట్ స్కీమ్. పెట్టుబడిపై ఏటా 7.5 శాతం వడ్డీ (Mahila Samman Crtificate Saving Scheme Interest Rate) చెల్లిస్తారు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం కింద మహిళలు మాత్రమే ఖాతాలు ప్రారంభించగలరు. మైనర్ బాలికల బదులు వాళ్ల తల్లిదండ్రులు/గార్డియన్స్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మార్చి 31, 2025 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది.
మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ అకౌంట్‌లో కనిష్టంగా రూ. 1,000 నుంచి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. పెట్టుబడిపై ఇచ్చే 7.5 శాతం వార్షిక వడ్డీని ప్రతి త్రైమాసికం తర్వాత ఖాతాలో జమ చేస్తారు. పథకం మెచ్యూరిటీ తర్వాత, ఖాతాదారు ఫారం-2ను పూరించి, అకౌంట్‌లోని డబ్బుల్ని వెనక్కు తీసుకోవచ్చు. మెచ్యూరిటీ గడువుకు ముందే డబ్బు అవసరమైతే, అకౌంట్‌ను ప్రారంభించిన ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, ఖాతాలో ఉన్న మొత్తంలో 40 శాతాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
CBDT నోటిఫికేషన్ ప్రకారం, మహిళ సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయంపై TDS ఉంటుంది. అయితే, వడ్డీ ఆదాయం సంవత్సరానికి రూ. 40,000 మించకపోతే TDS చెల్లించాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భంలో TDSకు బదులుగా, ఆ వడ్డీ ఆదాయం అకౌంట్ హోల్డర్ మొత్తం ఆదాయానికి యాడ్ అవుతుంది. రిటర్న్ ఫైల్ చేసే సమయంలో ఇన్‌కమ్ స్లాబ్ సిస్టమ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు పెరిగే ఛాన్స్, సాయంత్రానికి ప్రకటన!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial