Post Office Scheme: ఈ నెల ప్రారంభంలో, కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై (small savings schemes) వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది, కొన్ని స్కీమ్స్‌పై పాత ఇంట్రస్ట్‌ రేట్లనే కొనసాగించింది. పాత ఇంట్రస్ట్‌ రేట్‌ కొనసాగిన పథకాల్లో కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra) ఒకటి. 


కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌పై వడ్డీ రేటు
కిసాన్ వికాస్ పత్ర పథకంపై వడ్డీ రేటును, సెంట్రల్‌ గవర్నమెంట్‌, ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీన 7.2 శాతం నుంచి 7.4 శాతానికి పెంచింది. ఇది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి వర్తించింది. జులై 1 నుంచి కూడా ఇదే రేటును గవర్నమెంట్‌ కంటిన్యూ చేసింది. దీంతో, జులై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి కూడా 7.4 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద చాలా బ్యాంకులు ఇస్తున్న ఇంట్రెస్ట్‌ రేట్‌ కంటే ఇదే ఎక్కువ.


రిస్క్‌ లేని పెట్టుబడి
కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకాన్ని పోస్టాఫీస్‌ల ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది కాబట్టి దీనిలో మీ పెట్టుబడికి రిస్క్‌ ఉండదు. ఇది ఏకకాల డిపాజిట్ పథకం ‍‌(One-time Deposit Scheme). అంటే, ఈ స్కీమ్‌లో విడతల వారీగా డబ్బు జమ చేయడం కుదరదు, డబ్బు మొత్తాన్ని ఒకే దఫాలో పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత, నిర్ణీత కాల వ్యవధిలో రెట్టింపు డబ్బును పొందవచ్చు. ఈ పథకం కింద, మీ దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ స్కీమ్‌ బెనిఫిట్స్‌ ఖరారు చేశారు. ఇందులో, మీరు కనిష్టంగా రూ. 1,000 జమ చేయాలి, గరిష్ట మొత్తానికి ఎలాంటి పరిమితి లేదు. ముందే చెప్పినట్లు, ఎంత మొత్తమయినా ఒకే దఫాలో డిపాజిట్‌ చేయాలి.


5 నెలల ముందే డబ్బు రెట్టింపు
ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కిసాన్ వికాస్ పత్ర పథకం వడ్డీ రేటును పెంచిన కేంద్ర ప్రభుత్వం, డిపాజిట్‌ డబ్బును డబుల్‌ చేసే టైమ్‌ పిరియడ్‌ను కూడా తగ్గించింది. ఇంతకుముందు, ఈ స్కీమ్‌లో డబ్బు రెట్టింపు కావడానికి 120 నెలలు పట్టేది, ఇప్పుడు 115 నెలల్లోనే రెట్టింపు అవుతుంది. అంటే, గతంలో 10 సంవత్సరాలకు డబ్బులు డబుల్‌ అయితే, ఇప్పుడు 9 సంవత్సరాల 7 నెలల్లోనే రెట్టింపు మొత్తం చేతికి వస్తుంది. ఉదాహరణకు... మీరు ఈ పథకంలో రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే, 115 నెలల తర్వాత మెచ్యూరిటీ అమౌంట్‌గా రూ. 20 లక్షలు పొందవచ్చు. ఈ పథకం కింద, చక్రవడ్డీ బెనిఫిట్‌ లభిస్తుంది.


కిసాన్ వికాస్ పత్ర కింద, 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న ఎవరైనా ఖాతా ఓపెన్‌ చేయవచ్చు, డిపాజిట్‌ చేయవచ్చు. కనీస మొత్తం రూ. 1000 నుంచి, గరిష్టంగా ఎంత మొత్తాన్నైనా రూ. 100 గుణిజాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. సింగిల్‌ అకౌంట్‌తో పాటు, ఇద్దరు లేదా ముగ్గురు కలిసి జాయింట్‌లో అకౌంట్‌ కూడా ఓపెన్‌ చేయవచ్చు.


డిపాజిట్‌ మెచ్యూరిటీకి ముందే ఖాతాదారు మరణిస్తే..?
ఒకవేళ, డిపాజిట్‌ మెచ్యూరిటీ గడువు కంటే ముందే KVP ఇన్వెస్టర్‌ మరణిస్తే, ఆ ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. దీని కోసం, ఖాతాదారు మరణ ధృవీకరణ పత్రం, నామినీ వ్యక్తిగత గుర్తింపు పత్రాన్ని పోస్టాఫీసులో ఇవ్వాలి. ఆ తర్వాత సంబంధిత ఫారం నింపి సబ్మిట్‌ చేయాలి. ఈ ప్రక్రియ తర్వాత, కొన్ని రోజుల్లోనే డబ్బు చేతికి వస్తుంది.


మరో ఆసక్తికర కథనం: అటెన్షన్‌ ప్లీజ్‌, ఈ విషయాలు ITRలో రిపోర్ట్‌ చేయకపోతే ₹10 లక్షల ఫైన్‌!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial