Post Office Life Insurance Scheme: పోస్టాఫీసు ద్వారా చిన్న మొత్తాల పొదుపు పథకాలను ‍‌(Small Savings Schemes) మాత్రమే కాదు, ఇన్సూరెన్స్‌ పాలసీ కూడా తీసుకోవచ్చు. తపాలా శాఖ అందిస్తున్న బెస్ట్‌ స్కీమ్స్‌లో ఒకటి 'పోస్టల్‌ జీవిత బీమా పథకం' (Postal Life Insurance - PLI). ఈ స్కీమ్‌ తీసుకునే వ్యక్తికి 50 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్‌ కవరేజీ సహా చాలా బెనిఫిట్స్‌ కూడా అందుతాయి. 


పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ వివరాలు (Postal Life Insurance Scheme Details)
పోస్టాఫీస్ జీవిత బీమా పథకంలో చేరడానికి రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి PLI, రెండోది RPLI. పీఎల్‌ఐ స్కీమ్‌ కింద 6 రకాల పాలసీలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వాటిలో ఒకటి 'హోల్ లైఫ్ అస్యూరెన్స్‌ పాలసీ' ‍‌(whole life insurance policy). ఇది సంపూర్ణ జీవిత బీమా పథకం. ఈ పాలసీ కింద, హామీ డబ్బు ‍‌(Sum assured) కనిష్టంగా రూ. 20,000 నుంచి గరిష్టంగా రూ. 50 లక్షల వరకు చేతికి వస్తుంది. ఈ పాలసీ కొన్న వ్యక్తి 80 సంవత్సరాలకు సమ్ అష్యూర్డ్ బెనిఫిట్‌ పొందుతాడు. దీని కంటే ముందే పాలసీదారు మరణిస్తే, నామినీకి ఆ డబ్బు చెల్లిస్తారు.


పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద రుణం (Loan on Postal Life Insurance)
పీఎల్‌ఐ స్కీమ్‌లో చేరి 4 సంవత్సరాలు పూర్తయితే రుణం పొందడానికి అర్హత వస్తుంది. పాలసీ చేసిన వ్యక్తి, తన పాలసీని హామీగా పెట్టి లోన్‌ తీసుకోవచ్చు. బీమా కొన్న తర్వాత, ఏ కారణం వల్లనైనా దానిని కొనసాగించలేకపోతే, 3 సంవత్సరాల తర్వాత సరెండర్ చేయొచ్చు. అయితే, పాలసీని తీసుకున్న 5 ఏళ్ల లోపు సరెండర్ చేస్తే బోనస్ లభించదు. 5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేస్తే, హామీ మొత్తంపై, పాలసీ కొనసాగించిన కాలానికి దామాషా ప్రకారం బోనస్ చెల్లిస్తారు.


కనిష్ట - గరిష్ట వయో పరిమితి ‍‌(Minimum – Maximum Age Limit)
PLI హోల్ లైఫ్ అస్యూరెన్స్ పాలసీ తీసుకోవడానికి ఒక వ్యక్తికి కనీసం 19 సంవత్సరాల వయస్సు, గరిష్టంగా 55 ఏళ్ల వయస్సు ఉండాలి. ఈ పాలసీ కొనాలంటే పోస్టాఫీస్‌కు వెళ్లక్కర్లేదు, ఇంట్లోనే కూర్చుని, పోస్టాఫీస్ అధికారిక వెబ్‌సైట్ https://pli.indiapost.gov.in లోకి ఆన్‌లైన్‌ ద్వారా పాలసీని కొనొచ్చు. ఇదే సైట్‌ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు, దాని తాలూకు రిసిప్ట్‌ సహా సంబంధిత డాక్యుమెంట్స్‌ డిజిటల్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటాయి, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 


ఆన్‌లైన్‌ గురించి తెలీకపోతే నేరుగా పోస్టాఫీసుకు వెళ్లి ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. 


వాస్తవానికి, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ బ్రిటిష్‌ కాలం నాటి పథకం. 1884 ఫిబ్రవరి 1న దీనిని లాంచ్‌ చేశారు. తొలుత.. ప్రభుత్వ & ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం మాత్రమే దీనిని ప్రారంభించారు. ఆ తర్వాత మార్పులు-చేర్పులు చేసి దేశంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు. కాలానుగుణంగా మారుతూ ఈ బీమా పథకం ఇప్పటికీ కొనసాగుతోంది, ఖాతాదార్లకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది.


మరో ఆసక్తికర కథనం: మీ క్రెడిట్‌ స్కోర్‌ను ఫోన్‌పేలో ఫ్రీగా చెక్‌ చేసుకోవచ్చు, బ్యాంక్‌లకు డబ్బులు కట్టొద్దు