PhonePe Payments Abroad:
మొబైల్, ఆన్‌లైన్ చెల్లింపు సేవల కంపెనీ ఫోన్‌పే (Phonepe) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఇకపై అంతర్జాతీయ చెల్లింపులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వనుంది. విదేశాల్లో పర్యటించే భారతీయులు అక్కడి వ్యాపారస్థులకు యూపీఐ పద్ధతిలో డబ్బులు చెల్లించొచ్చని వివరించింది. ఇలాంటి సౌకర్యం అందిస్తున్న భారతదేశపు తొలి కంపెనీ తమదేనని వెల్లడించింది. భారత్‌లో యూపీఐ లావాదేవీల్లో ఎక్కువ మార్కెట్ వాటా ఫోన్‌పేదే కావడం విశేషం.
అంతర్జాతీయ డెబిట్ కార్డు ఆధారంగా ఫోన్‌పేలో విదేశాల్లో యూపీఐ లావాదేవీలు చేపట్టొచ్చు. అప్పుడు కస్టమర్ బ్యాంకు ఖాతా నుంచి విదేశీ కరెన్సీ డెబిట్ అవుతుంది. యూఏఈ, సింగపూర్, మారిషస్, నేపాల్, భూటాన్ వంటి దేశాల్లో లావాదేవీలు చేపట్టొచ్చని కంపెనీ తెలిపింది. అక్కడి అంతర్జాతీయ వ్యాపారస్థుల వద్దగల స్థానిక క్యూఆర్ కోడ్‌లు స్కాన్ చేసేందుకు యాప్ సహకరిస్తుందని పేర్కొంది.
యూపీఐ ఇంటర్నేషనల్ (UPI International) సేవలు అనుసంధానించిన బ్యాంకు ఖాతాను ఫోన్‌పేలో యాక్టివేట్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. పర్యాటక ప్రదేశాల్లో అప్పటికప్పుడు లేదా పర్యటనకు ముందుగానే యాప్‌తో బ్యాంకు ఖాతాను లింక్ చేసుకోవచ్చని వివరించింది. యూపీఐ పిన్ (UPI Pin) ఎంటర్‌చేస్తే సేవలు వెంటనే యాక్టివేట్ అవుతాయని వెల్లడించింది. ఈ సౌకర్యంతో కస్టమర్ భారత్‌కు ఆవల చెల్లింపులు చేసేందుకు ఎలాంటి క్రెడిట్ కార్డు, ఫారెక్స్ అవసరం లేదని పేర్కొంది.
'మిగతా ప్రపంచమూ యూపీఐ సేవల అనుభవం పొందేందుకు యూపీఐ ఇంటర్నేషనల్ మొదటి మెట్టు. ఈ సేవలు పర్యాటక, చెల్లింపుల రంగంలో పెను మార్పులు తీసుకొస్తాయి. విదేశాల్లో భారతీయులు చెల్లింపులు చేపట్టే విధానంలో పరివర్తన తీసుకొస్తుందన్న నమ్మకం ఉంది' అని ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు, సీటీవో రాహుల్ చారి అన్నారు.
ప్రపంచంలోని అనేక దేశాల్లో యూపీఐ అంతర్జాతీయ సేవలను ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, బ్రిటన్ దేశాల్లోని ప్రవాస భారతీయులు భారత ఫోన్ నంబర్ లేకుండానే యూపీఐ చెల్లింపులు చేసేందుకు అనుమతిస్తామని జాతీయ చెల్లింపుల కంపెనీ ఎన్‌పీసీఐ (NPCI) గత నెల్లో పేర్కొంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.