PF Amount Withdrawal Before Maturity: ప్రావిడెంట్ ఫండ్ (PF) లేదా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది ఉద్యోగులకు దీర్ఘకాలిక పొదుపు ప్రయోజనాన్ని + ఉద్యోగ అనంతర జీవితంలో ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పథకం కింద, ఉద్యోగి ప్రతి నెలా తన ప్రాథమిక వేతనం (Basic Pay) + కరవు భత్యంలో (DA) 12 శాతం మొత్తాన్ని జమ చేయాలి. దీనికి సమాన మొత్తాన్ని ఆ కంపెనీ యాజమాన్యం (EPF+EPSలో) జమ చేస్తుంది. EPFలో జమ చేసే డబ్బుకు వార్షిక వడ్డీ లభిస్తుంది. పదవీ విరమణ తర్వాత, ఆ ఉద్యోగి, PF మొత్తాన్ని ఒకేసారి (Lumpsum) విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, ప్రతి వ్యక్తి జీవితంలో హఠాత్తుగా కొన్ని అత్యవసర పరిస్థితులు ఎదరవుతాయి. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి డబ్బు అవసరం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఉద్యోగులు అప్పు కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా, కొన్ని షరతులకు లోబడి, పీఎఫ్ డబ్బును రిటైర్మెంట్ కంటే ముందుగానే విత్‌డ్రా చేయవచ్చు.
PF డబ్బును ముందుస్తుగా విత్‌డ్రా చేసే పరిస్థితులు
వైద్య అత్యవసర పరిస్థితి (మెడికల్ ఎమర్జెన్సీ), ఇంట్లో జరిగే వివాహం, ఉద్యోగి పిల్లల చదువు లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేస్తున్నప్పుడు.. మెచ్యూరిటీకి ముందే PF డబ్బులో కొంత మొత్తాన్ని విత్‌డ్రా (Partial Withdrawal Of PF Amount) చేసుకోవచ్చు, అకౌంట్ మొత్తాన్నీ ఖాళీ చేయడానికి అనుమతి ఉండదు. EPF నుంచి పాక్షిక మొత్తాన్ని ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్‌లో రెండు మార్గాల్లోనూ విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి, ఈపీఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, మీ వ్యక్తిగత ఖాతాలోకి లాగిన్ కావాలి. దీని కోసం మీ UAN (Universal Account Number), పాస్‌వర్డ్ అవసరం. ఇక్కడ.. పీఎఫ్ ఖాతా నుంచి విత్‌డ్రా కోసం అభ్యర్థన పెట్టుకోవాలి, విత్‌డ్రాయల్ కారణాలు వివరించాలి, సంబంధిత పత్రాలు అప్‌లోడ్ చేయాలి. సంబంధిత అధికారుల సమ్మతి పొందగానే డబ్బు పీఎఫ్ ఖాతా నుంచి మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతుంది.
ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు
ఆన్‌లైన్ విధానం తెలీకపోయినా, కుదరకపోయినా.. PF విత్‌డ్రాయల్ కోసం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఇందుకోసం, UAN పోర్టల్‌లో మీ ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌డేటెడ్‌గా ఉండాలి. మీరు నేరుగా EPFO కార్యాలయానికి వెళ్లి, సంబంధిత ఫారాన్ని పూర్తి చేసి సమర్పించాలి. విత్‌డ్రాయల్ కోసం మీరు చెప్పిన కారణానికి సంబంధించిన పత్రాలు కూడా సమర్పించాలి. ఆమోదం పొందగానే PF డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. UAN పోర్టల్‌లో ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు అప్‌డేట్ కాకపోతే మీ PF డబ్బును విత్‌డ్రా చేయలేరు.
పీఎఫ్ డబ్బు మీ ఖాతాకు డబ్బు ఎప్పుడు జమ అవుతుందో తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌లో 'స్టేటస్ చెక్' చేయవచ్చు. దీనికోసం, యూఏఎన్ పోర్టల్‌లోకి లాగిన్ అయిన తర్వాత, "Online Services" ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత, "Track Claim Status" మీద క్లిక్ చేయాలి. ఇక్కడ, మీ రిఫరెన్స్ నంబర్‌ను నమోదు చేసి క్లెయిమ్ స్థితిని తనిఖీ చేయవచ్చు.
కస్టమర్ కేర్ సౌకర్యం
పీఎఫ్‌కు సంబంధించిన సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 14470కి కాల్ చేయవచ్చు లేదా 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సమాచారం పొందవచ్చు. 7738299899 నంబర్‌కు 'EPFOHO UAN' SMS పంపి లేదా employeefeedback@epfindia.gov.inకి ఇ-మెయిల్ పంపి మీ పీఎఫ్ బ్యాలెన్స్ సమాచారాన్ని పొందవచ్చు.
మరో ఆసక్తికర కథనం: మీ ఇంటి ఆడపిల్ల కోసం ఇన్వెస్ట్ చేయండి - రూపాయికి రెండు రూపాయలు లాభం