Benifits Of Sukanya Samriddhi Yojana: తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ శక్తి మేరకు అన్నీ సమకూర్చాలని భావిస్తారు. కానీ, ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న ఈ కాలంలో వారి ఆశలన్నీ నెరవేరకపోవచ్చు. ఇప్పుడు స్కూల్ నుంచి కాలేజీ చదువు వరకు అన్నీ చాలా ఖరీదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఆలోచించి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది.
సుకన్య సమృద్ధి యోజన
ఆడపిల్లల విద్యను ప్రోత్సహించేందుకు, భారత ప్రభుత్వం 2015లో సుకన్య సమృద్ధి యోజన (SSY)ను ప్రారంభించింది. ఇది ఒక ప్రత్యేక డిపాజిట్ పథకం. దీని లక్ష్యం... బాలికల విద్య & వివాహం కోసం వారి కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేయడం. ఈ ఖాతాలో గరిష్టంగా 15 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఖాతా మెచ్యూరిటీ సమయంలో వచ్చే ప్రధాన మొత్తం, దానిపై వచ్చే వడ్డీ ఆదాయం రెండూ ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి (Section 80C) కింద పన్ను రహితం (Tax-free)
సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఎలా ప్రారంభించాలి?
సుకన్య సమృద్ధి యోజన పథకం కింద, మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులలో (స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటివి) ఖాతా ప్రారంభించొచ్చు. 10 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల కోసం తల్లిదండ్రులు ఈ పథకంలో పెట్టుబడిని ప్రారంభించవచ్చు.
కనిష్ట - గరిష్ట జమ
అత్యంత పేదవారికి కూడా ఈ పథకంలో అందుబాటులో ఉంటుంది, కేవలం 250 రూపాయలతో పెట్టుబడిని ప్రారంభించొచ్చు. ఖాతాలో, ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ. 250 & గరిష్టంగా రూ. 1.50 లక్షలు జమ చేయవచ్చు. గరిష్టంగా ఇందులో 15 ఏళ్ల పాటు డిపాజిట్ చేయవచ్చు. ఖాతా లాక్-ఇన్ పీరియడ్ 21 సంవత్సరాలు. అంటే, 15 సంవత్సరాల్లో పెట్టుబడి కాలం ముగిసినప్పటికీ, డిపాజిట్ తేదీ నుంచి 21 ఏళ్ల తర్వాత ఆ ఖాతా మెచ్యూర్ అవుతుంది. మీరు డిపాజిట్లు చేయని కాలానికి (15 సంవత్సరాల తర్వాత) కూడా వడ్డీ ఆదాయం వస్తుంది. ఖాతాదారు (అమ్మాయి) మెచ్యూరిటీ వ్యవధికి ముందే (18 సంవత్సరాల వయస్సు తర్వాత) వివాహం చేసుకుంటే, ఈ ఖాతా క్లోజ్ అవుతుంది.
ముందస్తు ఉపసంహరణ
ఆడపిల్ల చదువు ఖర్చుల కోసం, గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ఉన్న ఖాతా బ్యాలెన్స్‌లో 50% మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా పదో తరగతి పాసైన తర్వాత మాత్రమే పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.
ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల పేరు మీద SSY ఖాతాలు ప్రారంభించొచ్చు. అయితే, ఒకే కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు (కవలలు) జన్మిస్తే, ఒకే కుటుంబం నుంచి రెండు కంటే ఎక్కువ ఖాతాలను తెరవవచ్చు.
వడ్డీ రేటు
ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో పోలిస్తే, సుకన్య సమృద్ధి ఖాతాపై వచ్చే వడ్డీ రేటు అత్యధికం. ఈ సంవత్సరం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో, ఈ పథకం కింద 8.20 శాతం వడ్డీ రేటును (Interest Rate) నిర్ణయించారు.
రూపాయికి రెండు రూపాయలు లాభం
మీ పాపకు 5 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో పెట్టుబడి ప్రారంభించి, 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 3,000 డిపాజిట్ చేస్తే... ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారం మెచ్యూరిటీ సమయంలో మీకు రూ. 16,62,619 చేతికి వస్తాయి.
అంటే మీరు మొత్తం రూ. 5,40,000 పెట్టుబడి పెడితే, 15 ఏళ్లలో దానిపై రూ. 11,22,619 వడ్డీ రాబడి వస్తుంది. రూపాయికి రెండు రూపాయల లాభమంటే ఇదే.
డిఫాల్ట్ ఖాతాను యాక్టివేట్ చేయండి
ఎవరైనా ఏడాదిలో కనీసం రూ. 250 కూడా ఖాతాలో జమ చేయలేకపోతే, ఆ ఖాతా తాత్కాలికంగా (డిఫాల్ట్) మూతబడుతుంది. దీనిని మళ్లీ యాక్టివేట్ చేయవచ్చు. ఇందుకోసం, ఖాతా తెరిచిన 15 సంవత్సరాల లోపు రూ. 250 చెల్లించాలి + వార్షిక మొత్తాన్ని చెల్లించలేకపోయిన కాలానికి ఒక్కో ఏడాదికి రూ. 50 చొప్పున జరిమానా చెల్లించాలి.
మరో ఆసక్తికర కథనం: విమాన టిక్కెట్లను చవగ్గా బుక్ చేసుకునే రహస్యాలు ఇవి, మీకు బోలెడంత డబ్బు ఆదా!