Pet Animal Insurance: పెంపుడు జంతువుల బీమా: మనుషులతో పాటు స్థిరచరాస్తులన్నింటికీ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఆఖరికి బ్యాంక్ డిపాజిట్లు, ప్రయాణాలకు కూడా ఇన్సూరెన్స్ ఉంది. బ్యాంక్ దివాలా తీసినా, ప్రయాణం క్యాన్సిల్ అయినా దాని తాలూకు నష్టపరిహారం లభిస్తుంది. అలాగే, పెంపుడు జంతువులకు కూడా బీమా సౌకర్యం ఉందని మీకు తెలుసా?.
ఎక్కువ శాతం ఇళ్లలో పెంపుడు జంతువులు కూడా కుటుంబ సభ్యులే. వాణి ప్రాణప్రదంగా చూసుకుంటారు. వాటికి అనారోగ్యం వచ్చినా, దూరమైనా తట్టుకోలేరు. అందుకే, కుటుంబ సభ్యుల తరహాలోనే వాటికీ ఇన్సూరెన్స్ చేయవచ్చు. కొన్ని షరతులతో పెట్ యానిమల్స్‌కు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ (Pet Animal Insurance) అందిస్తున్నాయి బీమా కంపెనీలు.
ఒక రిపోర్ట్ ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా పట్టణ ప్రాంతాల్లో పెంపుడు జంతువులను పెంచుకునే వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత, పెట్స్ ఉన్న ఇళ్ల సంఖ్య బాగా పెరిగింది. 2025 నాటికి పెంపుడు జంతువుల మార్కెట్ 10 వేల కోట్ల రూపాయల స్థాయికి చేరుకుంటుందని ఆ నివేదిక అంచనా వేసింది. ఇది చదివిన తర్వాత, మీ లవ్లీ పెట్ కోసం ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనిపిస్తే, బీమా కంపెనీకి కాల్ చేసే ముందు కొన్ని విషయాల గురించి వివరంగా తెలుసుకోవాలి.
మరో ఆసక్తికర కథనం: ఫ్రీగా ఆధార్ అప్‌డేట్ చేయాలంటే మరో 2 రోజులే ఛాన్స్, ఆ తర్వాత డబ్బులు కట్టాలి
పెంపుడు జంతువులకు ఎలాంటి బీమా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి?
పెంపుడు జంతువుల కోసం చాలా రకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదం నుంచి అనారోగ్యం, మరణం తదితరాల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. ఒకవేళ మీ పెట్ యానిమల్ ముద్దుగా ఉందని ఎవరైనా ఎత్తుకెళ్లినా, దానికీ పరిహారం అందజేసే ఒక బీమా పథకం అందుబాటులో ఉంది. ఇలాంటి బీమా పథకాల వల్ల మీ అకౌంట్‌లోకి డబ్బు వస్తుంది. మీ పెట్ అనారోగ్యానికి గురైతే, ఆ డబ్బుతో మంచి చికిత్స చేయించవచ్చు. ఒకవేళ అది మీకు శాశ్వతంగా దూరమైతే, అలాంటి బ్రీడ్‌నే మరొకదానిని తీసుకొచ్చుకుని, బాధను క్రమక్రమంగా మరిచిపోవచ్చు.
మీ పెంపుడు జంతువు కోసం బీమా కొనుగోలు చేయబోతున్నట్లయితే, ఈ ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి:
పెట్ యానిమల్ ఇన్సూరెన్స్ అనేది ఒక ప్రత్యేక బీమా పథకం. ఇది, వాటి ఆరోగ్యాన్ని సురక్షితం ఉంచడంలో ఆర్థికంగా సాయపడుతుంది
ఈ రకమైన బీమా పథకాన్ని 2 నెలల నుండి 10 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు.
నిర్ణీత ప్రీమియం మొత్తాన్ని చెల్లించడం ద్వారా.. ప్రమాదం, దొంగతనం, అనారోగ్యం, ఇతర కారణాలు సహా అనేక రకాల పెట్ యానిమల్ ఇన్సూరెన్స్ కవరేజ్‌లను పొందవచ్చు.
గర్భం లేదా ప్రసవం, గ్రూమింగ్, కాస్మెటిక్ సర్జరీ దీనిలో కవర్ కాదు.
న్యూ ఇండియా అస్యూరెన్స్, బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ వంటి కంపెనీలు ఈ తరహా పెట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అందిస్తున్నాయి.
మరో ఆసక్తికర కథనం: ఐటీ రిటర్న్ ఫైల్ చేసే ముందు ఇది చెక్ చేయండి, మీకు తిరుగుండదు