Income Tax Return for FY2022-23: ఆదాయపు పన్ను పత్రాల దాఖలు సీజన్ ప్రారంభమైంది. ITR ఫైలింగ్ (Income Tax Return Filing) అనేది కొన్నేళ్ల క్రితం వరకు రాకెట్ సైన్స్ లాంటిది, కచ్చితంగా ఒక ఆడిటర్ అవసరం ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఎవరికి వాళ్లే రిటర్న్ ఫైల్ చేసేలా ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ చాలా మార్పులు తెచ్చింది, పన్ను పత్రాల సమర్పణను సులభంగా మార్చింది. ఇప్పుడు ప్రి-ఫిల్‌డ్ డాక్యుమెంట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. AIS, TIS, ఫామ్ 26AS వంటి డాక్యుమెంట్లలో టాక్స్‌పేయర్‌కు సంబంధించిన ప్రతి ఆదాయం, TDS నమోదవుతుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన ఆదాయాల గురించి మర్చిపోయే ఆస్కారం కూడా లేదు.
ఇన్‌కమ్ డిక్లరేషన్ ఈజీగా మారినా, అది ఒక సాంకేతిక అంశం. దీనిలో చిన్న పొరపాటు జరిగినా భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. మీ ఐటీఆర్‌కు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు రావచ్చు. మీరు 2022-23 ఆర్థిక సంవత్సరం లేదా 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయబోతున్నట్లయితే, ముందుగా కొన్ని విషయాల పట్ల జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడు, ఐటీఆర్ ఫైల్ చేయడం సులభమే కాకుండా తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఈ అస్త్రాలు సిద్ధం చేసుకోండి
మీరు మొదటిసారి ఐటీఆర్ ఫైల్ చేస్తున్నట్లయితే, ముందుగా మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మీ పర్మినెంట్ మొబైల్ నంబర్‌ను మీ వద్ద ఉంచుకోండి. మీ ఆధార్ నంబర్-పాన్ కచ్చితంగా లింక్ అయి ఉండాలి. ఇప్పుడు, ఆదాయపు పన్ను విభాగం అధికారిక వెబ్‌సైట్ https://eportal.incometax.gov.in అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. మొదటిసారి రిటర్న్ ఫైల్ చేసే వ్యక్తులు ముందుగా తమ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ వెబ్‌సైట్ హోమ్ పేజీలో, టాప్ రైడ్ సైడ్ కార్నర్‌లో క్రియేట్ బటన్ ఉంటుంది. దాని ద్వారా మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. మీ పాన్ నంబరే మీ యూజర్ ఐడీ అని గుర్తుంచుకోండి. పాస్‌వర్డ్ మీరే సృష్టించవచ్చు.
పాస్‌వర్డ్ మరచిపోతే ఏం చేయాలి?
చాలా మంది తమ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోతారు. అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. "ఫర్‌గాట్ పాస్‌వర్డ్" ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు. మీ అకౌంట్‌కు మీరు లింక్ చేసిన ఫోన్ నంబర్‌కు OTP వస్తుంది. ఇక్కడ అడిగిన వివరాలను సరిగ్గా పూర్తి చేస్తేక మళ్లీ కొత్త పాస్‌వర్డ్ సృష్టించవచ్చు.
AISను తనిఖీ చేయడం అవసరం
ITR ఫైల్ చేసే ముందు AIS (Annual Information Statement), TIS (Taxpayer Information Summary), 26ASను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. వార్షిక సమాచార నివేదికలో (AIS) మీ పూర్తి ఆదాయాల వివరాలు ఉంటాయి. దీనిని చూడాలంటే.. ఆదాయపు పన్ను విభాగం అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి. మీ యూజర్ ఐడీ (పాన్), పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. మెనూ బార్‌లో కనిపించే సర్వీసెస్‌ను క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో AISను ఎంచుకోండి. ఇందులోని పార్ట్ వన్‌లో.. మీరు పేరు, పాన్, ఆధార్ వంటి వ్యక్తిగత సమాచారం ఉంటుంది. రెండో భాగంలో.. మీ సంపాదన, TDS, అడ్వాన్స్ టాక్స్, సెల్ఫ్ అసెస్‌మెంట్, డిమాండ్ వంటి పూర్తి సమాచారం ఉంటుంది. వీటన్నింటినీ తనిఖీ చేసిన తర్వాత టాక్స్ రిటర్న్ ఫైల్ చేయండి. దీనివల్ల మీ వైపు నుంచి ఎలాంటి పొరపాటు జరగదు.
మరో ఆసక్తికర కథనం: బ్లాక్ డీల్ ఎఫెక్ట్‌తో బోర్లా పడ్డ గో ఫ్యాషన్, లాభాలు గంగపాలు