Rs 2 Lakh Pension Plan Through NPS: మీరు 40 ఏళ్ల వయస్సులోకి అడుగు పెట్టారా?, భవిష్యత్తు కోసం మంచి రిటైర్మెంట్‌ కార్పస్‌ సృష్టించే మంచి పెట్టుబడి మార్గం కోసం వెదుకుతున్నారా?, మీలా ఆలోచించే వాళ్ల కోసం మంచి ప్లాన్‌ రెడీగా ఉంది. పదవీ విరమణ ప్రణాళిక &పెట్టుబడి విషయంలో బాగా పాపులర్ అయిన స్కీమ్‌..  నేషనల్‌ పెన్షన్ సిస్టమ్ (NPS). కార్పొరేట్ డెట్, గవర్నమెంట్‌ బాండ్స్‌ వంటి అసెట్‌ క్లాస్‌లతో పాటు ఈక్విటీల్లోనూ పెట్టుబడి పెట్టే అవకాశాన్ని NPS అందిస్తుంది. మీరు దీనిని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే దీర్ఘకాలంలో ఆకర్షణీయమైన రాబడి పొందొచ్చు.


రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ కోసం పొదుపు చేయడంలో ఆలస్యం అయిందని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఇప్పట్నుంచి ప్రణాళికబద్ధంగా అడుగేస్తే, రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ. 2 లక్షల వరకు పొందే ఛాన్స్‌ మిగిలే ఉంది.


NPS విత్‌డ్రా రూల్‌: 40% యాన్యుటీ కొనుగోలు తప్పనిసరి
ప్రస్తుతం, ఒక NPS సబ్‌స్క్రైబర్, మెచ్యూరిటీ మొత్తాన్ని విత్‌డ్రా చేసే వీలు లేదు. జీవిత బీమా కంపెనీ నుంచి యాన్యుటీ ప్లాన్‌ కొనుగోలు చేయడానికి NPS కార్పస్‌లో కనీసం 40 శాతాన్ని పెట్టుబడిగా పెట్టాలి. ఈ యాన్యుటీ మొత్తం, పదవీ విరమణ తర్వాత సాధారణ పెన్షన్‌ను అందిస్తుంది. మిగిలిన 60% మొత్తాన్ని ఏకమొత్తంగా (lump sum) మీరు వెనక్కు తీసుకోవచ్చు. మీకు ఇష్టమైతే, యాన్యుటీని కొనుగోలు చేయడానికి ఈ 60% లంప్సమ్‌ నుంచి కూడా ఖర్చు చేయవచ్చు. ఒక NPS సబ్‌స్క్రైబర్, యాన్యుటీని కొనుగోలు చేయడానికి 100% మెచ్యూరిటీ మొత్తాన్ని ఉపయోగించవచ్చు.


నెలకు రూ.2 లక్షల పెన్షన్ పొందడానికి ఎన్‌పీఎస్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి?
మీకు ఇప్పుడే 40 ఏళ్లు నిండాయని అనుకుందాం. ఎన్‌పీఎస్‌లో లంప్సమ్‌ అమౌంట్‌ తీసుకోవడానికి మీకు ఇంకా 20 ఏళ్లు మిగిలే ఉన్నాయి. మీరు NPS పెట్టుబడి నుంచి నెలకు రూ. 2 లక్షలు పొందాలనుకుంటే, మీరు ఇప్పుడు ఎంత కాంట్రిబ్యూట్‌ చేయాలో చూద్దాం.


20 సంవత్సరాల తర్వాత మీ మొత్తం కార్పస్ మీద 6% రిటర్న్‌ వస్తుందని ఊహిస్తే, మెచ్యూరిటీ (60 ఏళ్ల వయస్సు నాటికి) మొత్తం తప్పనిసరిగా రూ. 4.02 కోట్లుగా ఉండాలి. ఇందులో 40% మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయడం తప్పనిసరి. కాబట్టి, యాన్యుటీని కొనుగోలు చేయడానికి రూ.1.61 కోట్లను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇదిపోగా, మీ 60 ఏళ్ల వయసులో రూ.2.41 కోట్ల లంప్సమ్ మిగిలి ఉంటుంది.


మీ లంప్సమ్‌ మొత్తాన్ని డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో (సెక్యూరిటీలు, బాండ్లు) పెట్టుబడిగా పెట్టవచ్చు. ఒకవేళ, నెలవారీ పెన్షన్‌ను సంపాదించడానికి ఆ రిటర్న్‌ సరిపోదని భావిస్తే, డెట్‌+ఈక్విటీలో కలిపి పెట్టుబడి పెట్టవచ్చు. మీ లంప్సమ్‌ పెట్టుబడి మీద కనీసం 6% రిటర్న్‌ పొందుతారని ఊహించుకుందాం. యాన్యుటీ రేటు కూడా సంవత్సరానికి 6% ఉండొచ్చని భావిద్దాం.


యాన్యుటీని కొనుగోలు చేయడానికి మొత్తం కార్పస్‌లో 40%ను మీరు ఉపయోగిస్తే, దీనిపై 6% రేట్‌ చొప్పున, యాన్యుటీ నుంచి ప్రతి నెలా రూ. 80,398  పెన్షన్ పొందుతారు. డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ నుంచి 6% రాబడితో, నెలకు రూ. 1,20,597 పొందుతారు. ఈ రెండు కలిపితే మీ పెట్టుబడిపై నెలకు మొత్తం రూ. 2,00,995 పెన్షన్ తీసుకుంటారు.


20 ఏళ్లలో రూ.4.02 కోట్లు జమ కావాలంటే ఎన్‌పీఎస్‌లో ఎంత పెట్టుబడి పెట్టాలి?
మీరు 40 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే, NPS వెబ్‌సైట్‌లోని (npstrust.org.in/nps-calculator) కాలిక్యులేటర్ ప్రకారం, వచ్చే 20 సంవత్సరాల వరకు ప్రతి నెలా NPSలో రూ.52,500 పెట్టాలి. మీ పెట్టుబడిలో సగటున 50% లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఈక్విటీల్లోకి మళ్లిస్తే, 20 సంవత్సరాల సుదీర్ఘ కాల వ్యవధిలో ఆకర్షణీయమైన రాబడి వస్తుంది. సంవత్సరానికి 10% రిటర్న్‌ను ఊహిస్తే, మెచ్యూరిటీ సమయంలో మొత్తం NPS కార్పస్ 4.02 కోట్లకు పెరుగుతుంది.


మరో ఆసక్తికర కథనం: తండ్రి బాటలోనే తనయులు, ముకేష్‌ అంబానీ వారసుల జీతం ఎంతో తెలుసా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial