PAN-Aadhar Number Linking In Telugu : కేంద్ర ప్రభుత్వం 11.5 కోట్ల పాన్ కార్డులను డీయాక్టివేట్‌ చేసింది. పాన్ కార్డును ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేయకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. సమాచార హక్కు చట్టం (RTI) కింద ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సమాధానం ఇచ్చింది. పాన్ కార్డ్‌ను ఆధార్ నంబర్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ 2023 జూన్ 30 అని తన సమాధానంలో తెలిపింది. ఈ గడువులోగా రెండు కార్డులను అనుసంధానించని వారిపై చర్యలు తీసుకున్నారు.


భారతదేశంలో 70 కోట్ల పాన్ కార్డులు
మన దేశంలో పాన్ కార్డుల సంఖ్య (PAN Cards in India) 70.24 కోట్లుగా ఉంది. కార్డ్‌ హోల్డర్లలో, 57.25 కోట్ల మంది తమ పాన్ కార్డును తమ ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసుకున్నారు. దాదాపు 12 కోట్ల మంది ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయలేదు. వారిలో, 11.5 కోట్ల మందికి చెందిన కార్డులు డీయాక్టివేట్‌ (PAN card deactivation) అయ్యాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త చంద్రశేఖర్ గౌర్, RTI యాక్ట్‌ కింద, పాన్‌-ఆధార్‌ నంబర్‌ లింకింగ్‌ సమాచారం కోసం CBDTకి అర్జీ పెడితే ఈ సమాచారం బయటకు వచ్చింది. 


తయారీ సమయంలోనే కొత్త పాన్ కార్డ్ - ఆధార్‌ లింకింగ్‌
ఆదాయ పన్ను చట్టంలోని (Income Tax act) సెక్షన్ 139AA ప్రకారం, పాన్ కార్డుతో ఆధార్ సంఖ్యను అనుసంధానించడం తప్పనిసరి. కొత్త పాన్‌ కార్డులను, వాటి తయారీ సమయంలోనే సంబంధిత వ్యక్తి ఆధార్‌ నంబర్‌తో అనుసంధానిస్తున్నారు. 2017 జులై 1వ తేదీ కంటే ముందు జారీ అయిన పాన్ కార్డులు, ఆయా వ్యక్తుల ఆధార్‌ నంబర్లతో అనుసంధానం కాలేదు. వారి కోసం కొత్త ఆర్డర్ జారీ అయింది, పాన్‌-ఆధార్‌ నంబర్‌ లింక్‌ చేయమని గవర్నమెంట్‌ నిర్దేశించింది.


పాన్ కార్డ్‌ డీయాక్టివేట్‌ అయితే చాలా తిప్పలు
గవర్నమెంట్‌ ఆర్డర్ ప్రకారం, నిర్దిష్ట గడువు లోగా పాన్-ఆధార్ నంబర్‌ అనుసంధానంలో విఫలమైన వ్యక్తుల పాన్‌ కార్డ్‌ డీయాక్టివేట్‌ అవుతుంది. అలాంటి వాళ్లు 1000 రూపాయలు జరిమానా చెల్లించి తమ కార్డును మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. కొత్త పాన్ కార్డ్‌ జారీ చేయడానికి ప్రస్తుతం ప్రభుత్వం వసూలు చేస్తున్న ఫీజ్‌ 91 రూపాయలు. అలాంటప్పుడు, ఇప్పటికే ఉన్న కార్డును మళ్లీ యాక్టివేట్ చేసినందుకు ప్రభుత్వం 10 రెట్లకు పైగా ఎక్కువ జరిమానా ఎందుకు వసూలు చేస్తోందని RTI యాక్టివిస్ట్‌ గౌర్‌ ప్రశ్నిస్తున్నారు. పాన్‌ కార్డ్‌ డీయాక్టివేట్‌ అయితే, ఆ కార్డ్‌ హోల్డర్‌ ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలు సహా కొన్ని పనులు చేయలేడు. కాబట్టి, పాన్ కార్డ్‌ డీయాక్టివేషన్‌ నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించుకోవాలన్నది గౌర్ సూచన.


పాన్ కార్డ్‌ డీయాక్టివేట్‌ అయితే ప్రజలు చాలా తిప్పలు పడాల్సి ఉంటుంది. CBDT ప్రకారం, అటువంటి వ్యక్తులు ఆదాయ పన్ను వాపసును క్లెయిమ్ చేయలేరు. డీమ్యాట్ ఖాతా తెరవలేడు. రూ.50,000 మించి మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయలేడు. రూ.1 లక్ష కంటే ఎక్కువ విలువైన షేర్లను కొనడానికి, అమ్మడానికి వీలుండదు. వాహనాల కొనుగోలుపై ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Bank FD), సేవింగ్స్ అకౌంట్‌ తప్ప బ్యాంకులో ఏ ఖాతా ఓపెన్‌ చేయలేడు. క్రెడిట్ కార్డ్‌, డెబిట్ కార్డులు జారీ కావు. బీమా పాలసీ ప్రీమియం కోసం రూ.50,000 కంటే ఎక్కువ చెల్లించలేడు. ఆస్తి కొనుగోలు, అమ్మకాలపై అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


మరో ఆసక్తికర కథనం: స్టాక్‌ మార్కెట్‌లో ముహూరత్‌ ట్రేడింగ్‌ టైమింగ్స్‌ ఏంటి, దీపావళి సెలవు ఎప్పుడు?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial