NMDC Shares: చాలా కాలంగా కన్సాలిడేషన్‌లో ఉన్న కంపెనీల షేర్లు సైతం ఇటీవల మార్కెట్ల ర్యాలీలో పాల్గొన్నాయి. దీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న తమ పెట్టుబడిదారులకు ఊహించని స్థాయిలో లాభాలను తెచ్చిపెడుతున్నాయి. అయితే ఇప్పుడు ఒక స్టాక్ ఇందుకోసం ఏకంగా 14 ఏళ్లు సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎన్ఎండీసీ కంపెనీ షేర్ల గురించే. వాస్తవానికి ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ కంపెనీ దేశంలో అత్యధికంగా ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఈరోజు కంపెనీ షేర్లు స్వల్పంగా 1.48 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దీంతో కంపెనీ షేర్ల ధర బీఎస్ఈలో రూ.273.10 స్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇది కంపెనీ షేర్ల 52 వారాల కొత్త గరిష్ఠ ధర. చివరిగా కంపెనీ షేర్లు ఈ స్థాయిల వద్ద 2010లో ట్రేడింగ్ అయ్యాయి. ఈ మైనింగ్ కంపెనీలో భారత ప్రభుత్వానికి అత్యధికంగా 60 శాతానికి పైగా మెజారిటీ వాటాలు ఉన్నాయి.
వాస్తవానికి జూన్ 2023 నుంచి ఎన్ఎండీసీ స్టాక్ ర్యాలీ మెుదలుపెట్టింది. జూన్ 2023 నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్ ధర 143 శాతం పెరిగింది. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ 10 నెలల కిందట కంపెనీ షేర్లలో తమ డబ్బును పెట్టుబడి పెట్టి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే పొజిషనల్ ఇన్వెస్టర్ల డబ్బు రెండింతలు పెరిగి ఉండేది. 2020లో కంపెనీ షేర్ ధర ఒక్కొక్కటి కేవలం రూ.47.30 స్థాయి వద్దే ఉండేది. అప్పటి నుంచి ప్రస్తుత మార్కెట్ ధర పెరుగుదల వరకు గమనిస్తే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిపై 471 శాతం రాబడిని అందుకున్నారు.
కంపెనీ షేర్ ధర 2010లో తన ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.439ని తాకింది. ప్రస్తుతం కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ఠాన్ని చేరుకున్నప్పటికీ 2010 స్థాయిలో దాదాపు సగాన్ని అధిగమించాయి. చాలా కాలంగా కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసినప్పటికీ.. ప్రస్తుతం వారిలో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి.
మే 2న కంపెనీ విడుదల చేసిన డేటాలో ఇనుప ఖనిజం విక్రయాల్లో 2.60 శాతం పెరుగుదల నమోదైంది. ఏప్రిల్ నెలలో కంపెనీ మొత్తం 3.43 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని విక్రయించింది. అయితే ఈ కాలంలో ఉత్పత్తి తగ్గినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 2024లో మొత్తం 3.48 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి చేయబడింది. ఉత్పత్తితో పాటు కంపెనీ ధరలను సైతం పెంచటం మంచి రాబడులను అందించింది. ఈ రోజు మార్కెట్లు ముగిసే సమయంలో కంపెనీ షేర్ ధర ఎన్ఎస్ఈలో రూ.269.25 వద్ద ప్రయాణాన్ని ముగించింది. దీంతో వరుసగా మూడో రోజు సైతం షేర్లలో పెరుగుదల ఇంట్రాడేలో కనిపించింది. అయితే మార్కెట్లు ముగింపు నాటికి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగటంతో ఫ్లాట్ ముగింపును నమోదు చేసింది.
కంపెనీకి సానుకూల అంశాలను గమనిస్తే.. దేశంలో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై భారీగా వెచ్చిస్తున్న వేళ ఉక్కుకు పెరుగుతున్న డిమాండ్‌ను కంపెనీ అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక రెండవ ముఖ్యమైన అంశాన్ని గమనిస్తే 2003-2007 కాలం మాదిరిగానే మూలధన వ్యయం వల్ల సంభావ్య పునరుజ్జీవనం నుంచి కంపెనీ ప్రయోజనం పొందుతుందని అంచనా వేయబడింది. చివరిగా భవిష్యత్ డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీ తన ఉత్పత్తి సామర్థ్యాలను వేగంగా పెంచుకోవటం కంపెనీ లాభదాయకత, పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని ఇనుప ఖనిజాన్ని తక్కువ ధరకు ఉత్పత్తి చేసే కంపెనీలలో ఒకటిగా ప్రపంచంలోని ఇనుప ఖనిజాన్ని తక్కువ ధరకు ఉత్పత్తి చేసే కంపెనీలలో ఒకటిగా NMDC ప్రసిద్ధి చెందింది.