Titan Shares: దేశంలోని ప్రముఖ పెట్టుబడిదారుల్లో రాకేష్ జున్‌జున్‌వాలా ఒకరు. పైగా ఈయన డీమార్ట్ రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేసిన రాధాకిష్ దమానీకి శిష్యుడు కూడా. భారత స్టాక్ మార్కెట్లపై పట్టు, ప్రేమ ఉన్న ఈయన మరణించారు. అయితే ఇప్పటికీ ఆయన భార్య రేఖా జున్‌జున్‌వాలా పెట్టుబడులను ఇప్పటికీ దేశంలోని రిటైల్ పెట్టుబడిదారులు గమనిస్తూనే ఉంటారు.


టాటాలతో జున్‌జున్‌వాలా కుటుంబానికి ఉన్న సంబంధం విడదీయరానిది. రాకేష్ జున్‌జున్‌వాలాకు అత్యంత ఇష్టమైన షేర్లలో టైటాన్ కంపెనీ షేర్లు కూడా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నేడు మార్కెట్ ట్రేడింగ్ సమయంలో టైటాన్ కంపెనీ షేర్లలో పతనం నమోదైంది. గడచివ వారం చివరిలో టైటాన్ తన మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కంపెనీ పనితీరు మార్కెట్ అంచనాలను అందుకోవటంలో పూర్తిగా విఫలమైంది. ఆభరణాల వ్యాపారంలో కొనసాగుతున్న ఒత్తిడి, పెరిగిన పోటీ, అధిక ధరలతో తగ్గిన డిమాండ్ వంటి సమస్యలు మార్చి త్రైమాసిక లాభాలను తగ్గించాయని నిపుణులు చెబుతున్నారు.


దీని ఫలితంగా మే 6, 2024 అంటే నేడు మార్కెట్లు ట్రేడింగ్ ప్రారంభం అయిన నిమిషాల్లో టైటాన్ కంపెనీ షేర్ ధర ఏకంగా 5 శాతానికి పైగా పడిపోయింది. దీంతో కంపెనీలో భారీగా పెట్టుబడులు కలిగి ఉన్న రేఖా జున్‌జున్‌వాలా నిమిషాల్లోనే రూ.800 కోట్లకు పైగా డబ్బును కోల్పోయారు. నిరాశాజనకమైన మార్చి త్రైమాసిక ఫలితాలు దీనికి ప్రధాన కారణంగా ఉన్నాయి. పెట్టుబడిదారులు కంపెనీ షేర్లను విక్రయించటానికి దిగారు. వాస్తవానికి మార్చి 31, 2024 నాటికి రేఖా కంపెనీలో 5.35 శాతం వాటాలున్నాయి. మార్కెట్లలో పతనం వల్ల ఆమె పెట్టుబడి విలువ రూ.805 కోట్లు తగ్గి రూ.15,986 కోట్లకు చేరుకున్నాయి.


ఇదే క్రమంలో టైటాన్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3 లక్షల కోట్ల కిందకు పడిపోయింది. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో టైటాన్ స్టాక్ బీఎస్ఈలో రూ.3,257.05కి పడిపోయింది. కాగా చివరికి 7.18 శాతం నష్టంతో రూ.3,284.65 వద్ద ఒక్కో షేరు ధర ఉంది. దీంతో 2020 తర్వాత తొలిసారిగా రాకేష్ జున్‌జున్‌వాలా స్టాక్ ధర భారీ పతనాన్ని నేడు చూసింది. ప్రస్తుతం నిపుణులు మాత్రం కంపెనీ షేర్లను డిప్స్ వద్ద కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ టైటాన్ షేర్లకు హోల్డ్ రేటింగ్ అందిస్తూ టార్గెట్ ధరను రూ.3,500గా ప్రకటించింది. అలాగే యూబీఎస్ బ్రోకరేజ్ న్యూట్రల్ రేటింగ్ ఇస్తూ షేర్లకు రూ.3,900 టార్గెట్ ధరగా ప్రకటించింది. ఎంకే గ్రోబల్ బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ధరను రూ.4,150గా నిర్ణయించింది. గోల్డ్ మాన్ సాచ్స్ కొనుగోలు రేటింగ్ ఇస్తూ టార్గెట్ ధరను రూ.3,950 వద్ద ఉంచింది. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పనితీరు మెరుగుపడుతుందని వారు ఆశావాదం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మార్జిన్ల తగ్గుదల మరికొంత కాలం కంపెనీని వేధిస్తుందని వారు అంచనా వేస్తున్నారు.