Income Tax Action: ఈ మధ్యకాలంలో, ఇల్లు/ స్థలం/ పొలం వంటివి కొన్నాక, కొనుగోలుదార్లకు ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసులు (Income tax notice) వస్తున్నాయి. ఐటీ అధికార్లు ఆ నోటీసుల్లో ప్రస్తావించిన అంశాలను పరిష్కరించుకోవడాని ప్రజలు కొంత డబ్బు ఖర్చు చేయాలి, సమయం కూడా కేటాయించాల్సి వస్తోంది.
ఆస్తి కొనుగోలుదార్లకు ఏ కారణంతో ఐటీ నోటీసులు వెళ్తున్నాయో తెలుసుకుంటే, అలాంటి తప్పు మీరు చేయకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చు, ఎలాంటి టెన్షన్ లేకుండా ఇష్టం వచ్చిన ఆస్తిని కొనొచ్చు.
పాన్-ఆధార్ లింక్ చేయడం చాలా ముఖ్యం (PAN - Aadhaar Link)
ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేసిన తర్వాత మీకు ఆదాయపు పన్ను నోటీసు రావచ్చు. ఒకవేళ వస్తే, మీ పాన్ కార్డ్ - ఆధార్ లింక్ అయిందో, లేదో ముందు చెక్ చేయండి. అలాగే... మీరు ఎవరి నుంచి ఆస్తిని కొంటున్నారో, ఆ వ్యక్తి పాన్ కార్డ్ - ఆధార్ కూడా అనుసంధానమై ఉండాలి. ఆస్తిని కొనే వ్యక్తి, అమ్మే వ్యక్తి విషయంలో.. ఏ ఒక్కరి పాన్-ఆధార్ అనుసంధానం కాకపోయినా ఇద్దరూ ఇబ్బందుల్లో పడవచ్చు.
ఆస్తి కొంటే ఎంత టాక్స్ కట్టాలి? (Tax on buying or selling a property)
ఆదాయపు పన్ను నిబంధనల (Income Tax Rules) ప్రకారం, ఆస్తి కొనుగోలు లేదా విక్రయం మీద, ఆస్తి మార్కెట్ విలువ ప్రకారం పన్ను చెల్లించాలి. రూ.50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తి కొంటే 1 శాతం TDS (Tax Deducted at Source) చెల్లించాలి. దీనిని తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు, ఆధార్-పాన్ లింక్ చేయడానికి గడువు ముగిసింది. కొనుగోలుదారు ఆధార్-పాన్ ఇప్పటికీ లింక్ కాకపోయినట్లయితే, అతను 20 శాతం TDS చెల్లించాలి.
వేల సంఖ్యలో ఐటీ నోటీసులు
ఆధార్-పాన్ లింక్ చేయడానికి ఇచ్చిన తుది గడువు కూడా దాటి 6 నెలలు అవుతోంది. ఇప్పుడు, ఆస్తులు కొన్న వ్యక్తులకు ఆదాయపు పన్ను విభాగం నోటీసులు పంపుతోంది. అలాంటి వ్యక్తులు 20 శాతం టీడీఎస్ కట్టమని ఐటీ డిపార్ట్‌మెంట్ డిమాండ్ చేసింది. ఇలా.. వేల సంఖ్యలో ఐటీ నోటీసులు సంబంధిత వ్యక్తులకు జారీ అయ్యాయి.
కోటికి పైగా పాన్ కార్డుల డీయాక్టివేషన్ (Pan card deactivated)
మన దేశంలో, ఇటీవల కోటికి పైగా పాన్ కార్డులు డీయాక్టివేట్ (Pan card deactivated) అయ్యాయి. కీలక గుర్తింపు పత్రాలైన పాన్, ఆధార్‌ను ఆయా వ్యక్తులు అనుసంధానం చేయకపోవడమే దీనికి కారణం. డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పాన్-ఆధార్ లింక్ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు కార్డులను లింక్ చేయడం వల్ల ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచడం సులభం అవుతుంది. మీరు కూడా భవిష్యత్తులో ఇల్లు, స్థలం లేదా పొలం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అమ్మకందారు పాన్-ఆధార్ కార్డ్ అనుసంధానం గురించి కూడా తెలుసుకోండి.
మరో ఆసక్తికర కథనం: ఎక్కువ వడ్డీని ఇచ్చే మూడు స్పెషల్ FDలు, ఈ నెలాఖరు వరకే మీకు అవకాశం