Special Fixed Deposit Schemes Deadline: కస్టమర్లను ఆకర్షించడానికి చాలా బ్యాంకులు ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లను రన్‌ చేస్తున్నాయి. ఈ ప్రత్యేక పథకాల్లో పెట్టుబడి పెట్టే వారికి సాధారణ FDల కంటే ఎక్కువ వడ్డీ రేట్లను (Interest Rates on Special FD Schemes) ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ పథకాల వల్ల అటు బ్యాంక్‌లకు, ఇటు పెట్టుబడిదార్లకు ప్రయోజనం ఉంటుంది. 


స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలు ప్రారంభించి, అమలు చేస్తున్న బ్యాంకుల్లో స్టేట్‌ బ్యాంక్‌ (SBI), ఐడీబీఐ బ్యాంక్‌ (IDBI Bank), ఇండియన్ బ్యాంక్ (Indian Bank) ఉన్నాయి. మీకు ఈ పథకాల ప్రయోజనాలు కావాలనుకుంటే త్వరపడాల్సిందే. ఈ నెలాఖరు వరకే (డిసెంబర్ 31, 2023) సమయం ఉంది. ఈ గడువు తర్వాత, ప్రత్యేక పథకాలను ఆయా బ్యాంకులు కంటిన్యూ చేయవవచ్చు, చేయకపోవచ్చు.


అధిక వడ్డీ ఇచ్చే ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలు (Special Fixed Deposit Schemes)


1. ఎస్‌బీఐ అమృత్ కలశ్‌ పథకం ‍‌(SBI Amrit Kalash FD Scheme)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన కస్టమర్ల కోసం ఎస్‌బీఐ అమృత్ కలశ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఇది 400 రోజుల ప్రత్యేక FD స్కీమ్‌. దీని కింద, సాధారణ కస్టమర్లు 7.10 శాతం వడ్డీ ఆదాయాన్ని అందుకుంటారు. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లు (60 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్లు) 7.60 శాతం వడ్డీ రేటు పొందుతారు. ఈ పథకం గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. మీరు ఈ స్కీమ్‌లో జాయిన్‌ కావాలని అనుకుంటే, నేరుగా SBI బ్రాంచ్‌కు వెళ్లిగానీ, SBI YONO యాప్‌ ద్వారా గానీ, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా గానీ FD అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు.


2. ఐడీబీఐ బ్యాంక్ ప్రత్యేక ఎఫ్‌డీ పథకం (IDBI Bank Special FD Schemes)
IDBI బ్యాంక్ అమలు చేస్తున్న 'ఉత్సవ్ FD' కింద... 375 రోజులు & 444 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్స్‌ ఉన్నాయి. వీటిపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు కస్టమర్లకు అందుతున్నాయి. 375 రోజుల ప్రత్యేక FDలో చేరితే, సాధారణ పౌరులకు 7.10 శాతం వడ్డీ రేటు & సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటు చొప్పున ఆదాయం వస్తుంది. 444 రోజుల FDలో చేరితే, సాధారణ పౌరులు 7.25 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లు 7.75 శాతం వడ్డీ రేటును పొందుతారు. మీరు ఈ FDలో పెట్టుబడి పెట్టాలంటే కాస్త త్వరపడాలి, ఈ స్కీమ్‌ గడువు డిసెంబర్ 31, 2023తో ముగుస్తుంది.


3. ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక FD పథకం (Indian Bank Special FD Schemes)
ఇండియన్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు 400 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ను అందిస్తోంది. ఈ పథకం కింద సాధారణ కస్టమర్లకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్లు) 8.00 శాతం వడ్డీ రేటును బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది. ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక FD ప్రయోజనాలను పొందాలనుకుంటే, మీకు డిసెంబర్ 31, 2023 వరకే సమయం ఉంది.