Insurance for Diabetes: 


మధుమేహం.. పేరులోనే తియ్యదనం ఉంటుంది కానీ వచ్చినోళ్లకే తెలుస్తుంది బాధేంటో!! ఇష్టమైన పిండి పదార్థాలు తినలేరు. మిఠాయిలు అస్సలు రుచిచూడలేరు. వీటికి తోడుగా కంపెనీలు బీమా ఇవ్వడానికి జంకుతాయి. ఒకవేళ ఇచ్చినా సవాలక్ష కండీషన్లు పెడతాయి. మనదేశంలో డయాబెటిక్‌తో బాధపడుతున్న వారిలో 30 శాతం మందికీ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ లేదంటే నమ్మగలారా! ఇలాంటి వారి కోసమే బజాజ్ అలియాంజ్‌ ప్రత్యేకంగా బీమా పథకం తీసుకొచ్చింది.


ఏంటీ డయాబెటిక్‌ టర్మ్‌ ప్లాన్‌?


మధుమేహ వ్యాధిగ్రస్తుల (Diabetes) కోసం బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ డయాబెటిక్ టర్మ్‌ ప్లాన్‌ సబ్‌8 హెచ్‌ఏవన్‌సీ (Bajaj Allianz Life Diabetic Term Plan Sub 8 HbA1c) అనే పేరుతో బజాజ్‌ అలియాంజ్‌ సరికొత్త బీమా పథకం తీసుకొచ్చింది. ఇది పూర్తిగా టర్మ్‌ ప్లాన్‌ (Dibatic Term Plan). బీమా తీసుకున్న వ్యక్తి మరణిస్తేనే మొత్తం సొమ్ము నామినీకి అందుతుంది. సాధారణంగా టర్మ్‌ ముగిస్తే ఎలాంటి పరిహారం అందించరు. 'ప్రస్తుతం దేశంలోని చక్కెర వ్యాధిగ్రస్తుల్లో చాలా మందికి బీమా ప్రయోజనాలు అందడం లేదు. ఇది దీర్ఘకాలిక వ్యాధి కావడం వల్ల బీమా పథకాలు పొందడం కష్టం. వారి కుటుంబాలకు రక్షణ దొరకడం లేదు. అందుకే వారి కుటుంబాలకు రక్షణ, మనశ్శాంతి కల్పించేందుకు మేమీ స్కీమ్‌ తీసుకొచ్చాం' అని బజాజ్‌ అలియాంజ్‌ ఎండీ, సీఈవో తరుణ్ చుగ్‌ తెలిపారు.


తీసుకోవడానికి అర్హతలు ఏంటి?


HbA1C స్థాయి 8 వరకు ఉండే టైప్‌-2 డయాబెటిస్‌ వ్యక్తులు మాత్రమే ఈ బీమా పథకం కొనుగోలు చేసేందుకు అర్హులు. చివరి 8-12 వారాల ప్లాస్మా గ్లూకోజ్‌ సగటును HbA1C ప్రతిబింబించే సంగతి తెలిసిందే. సాధారణంగా ప్రీ డయాబెటిక్ వ్యక్తులకు ఈ స్థాయి 5.7 నుంచి 6.4 శాతం వరకు ఉంటుంది. 6.5 శాతం దాటితే మధుమేహులుగా పరిగణిస్తారు. ఈ స్కీమ్‌లో చేరేందుకు కనీస వయసు 30 ఏళ్లు కాగా గరిష్ఠ వయసు 60 ఏళ్లు. పాలసీ టర్మ్‌ను ఐదేళ్ల నుంచి 25 ఏళ్ల వరకు పెట్టుకోవచ్చు. కనీస బీమా మొత్తం రూ.25 లక్షలు. కంపెనీ షరుతులను బట్టి గరిష్ఠంగా ఎంత వరకైనా తీసుకోవచ్చు.


ప్రీమియం, బీమా వివరాలు


సాధారణంగా 35 ఏళ్ల డయాబెటిక్‌, నాన్‌ స్మోకర్‌ వ్యక్తి 20 ఏళ్లకు రూ.50 లక్షలకు బీమా తీసుకున్నాడని అనుకుందాం. అతడు ఏటా రూ.13,533 ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. వీలును బట్టి నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది ఎంచుకోవచ్చు. ఒకవేళ బీమాదారుడు మరణిస్తే పరిహారం ఈ మూడింట్లో ఏదో ఒక రకంగా అందిస్తారు. వార్షిక ప్రీమియానికి 10 రెట్లు, మరణించే సమయానికి చెల్లించిన ప్రీమియాలపై 105 శాతం, చేయించుకున్న బీమా మొత్తంలో ఒకటి ఇస్తారు. బీమా తీసుకున్న ఏడాది తర్వాత HbA1C స్థాయిని తగ్గిస్తే కనీస ప్రీమియంలో 10 శాతం డిస్కౌంట్‌ ఇస్తారు.


Also Read: నెలలో ఏ రోజున సిప్‌ చేస్తే ఎక్కువ రిటర్న్‌ వస్తుందో తెలుసా!


రెండు రెట్లు అధిక ప్రీమియం


రెగ్యులర్‌ టర్మ్‌ ప్లాన్‌తో పోలిస్తే డయాబెటిక్‌లో ప్రీమియం 1.75 నుంచి రెండు రెట్లు ఎక్కువగా ఉందని బీమా నిపుణులు పేర్కొంటున్నారు.  HbA1C స్థాయి ఏడుగా ఉన్న 40 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల కాల పరిమితితో కోటి రూపాయాలకు డయాబెటిక్‌ బీమా తీసుకుంటే ఏటా రూ.23-24000 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అదే సాధారణ బీమాలో 11-12000 వరకు ఉంటుంది. సాధారణ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ను డయాబెటిక్‌, ఇతర రోగాల బారిన పడిన వారికి కంపెనీలు ఇవ్వడం లేదు. ఇలాంటి సందర్భాల్లో బజాజ్‌ అలియాంజ్‌ డయాబెటిక్‌ టర్మ్‌ ప్లాన్‌ ఉపయుక్తంగా ఉంటుందని పాలసీ బజార్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్ హెడ్‌ రిషభ్‌ గార్గ్‌ అంటున్నారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial