EPFO Women Subscribers:


వ్యవస్థీకృత రంగాల్లో ఉద్యోగాలు దక్కించుకోవడంలో మహిళలు ముందుంటున్నారు. పురుషులకు దీటుగా పోటీనిస్తున్నారు. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారుల్లో వీరి సంఖ్య పెరగడమే ఇందుకు  నిదర్శనం. ఈపీఎఫ్‌వోలో 2018-19లో 21 శాతంగా ఉన్న మహిళా చందాదారులు ఈ ఏడాది ఏప్రిల్‌-అక్టోబర్‌ త్రైమాసికానికి 26.5 శాతానికి చేరుకున్నారు.


ఈపీఎఫ్‌వోలో 2018-19లో తొలిసారి నమోదైన చందాదారులు 13.9 మిలియన్ల మంది ఉండగా వీరిలో 2.92 శాతానికి పైగా మహిళలే కావడం గమనార్హం. రెండేళ్లుగా వీరి సంఖ్య తగ్గినా 2020-21 నుంచి గణనీయంగా పెరిగింది. తాజా త్రైమాసికంలో అనూహ్యంగా గరిష్ఠానికి చేరుకుంది. 2022లో ఏప్రిల్‌, అక్టోబర్‌ మధ్య కాలంలో 7.13 మిలియన్ల మంది కొత్త చందారులు రిజిస్టర్‌ అవ్వగా వీరిలో 1.89 శాతం మంది మహిళలే ఉన్నారు. జూన్‌, జులైలో వీరి సంఖ్య 0.3, 031 మిలియన్లే.


Also Read: ఫుట్‌బాల్‌ మాంత్రికుడు పీలే ఆస్తుల విలువెంతో తెలుసా?, పాత తరం ఆటగాడైనా ఇప్పటి వాళ్లకు ధీటుగా సంపాదన


మొత్తంగా నూతన చందాదారుల్లో మహిళల సంఖ్య తక్కువగానే కనిపిస్తున్నా దేశంలోని మొత్తం ఆడవాళ్లలో పనిచేస్తున్న వారి సంఖ్యతో పోలిస్తే మెరుగేనని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో మహిళా కార్మికుల శాతం 21.7 శాతంగా ఉందని పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే పేర్కొంది. అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 19.9 శాతమని వెల్లడించింది.


ప్రవేశ స్థాయి ఉద్యోగాల్లో 18-21, 22-25 ఏళ్ల వయసున్న మహిళలు ఎక్కువగా చేరుతున్నారని ఈపీఎఫ్‌వో సమాచారం ప్రతిబింబిస్తోంది. ఉదాహరణకు 2022, అక్టోబర్లో తొలిసారి ఈపీఎఫ్‌లో 2 లక్షల మంది అమ్మాయిలు చేరగా అందులో సగం మంది వయసు 18-25 మధ్యే ఉండటం గమనార్హం. సాధారణంగా ఈపీఎఫ్‌వో పరిశ్రమల వారీగా మహిళా, పురుష చందాదారుల వివరాలు ఇవ్వదు. నిపుణుల ప్రకారం టెలికాం, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, రిటైల్‌ రంగాల్లో యువతుల సంఖ్య అధికంగా ఉంది.


'అన్ని రంగాల్లోనూ యువతులకు ప్రవేశ స్థాయి ఉద్యోగాలు లభిస్తున్నాయి. కొన్ని తయారీ రంగాల్లో మహిళలే 60 శాతం ఉన్నారు. వారు మరింత నమ్మకం, బాధ్యతాయుతంగా పనిచేస్తారని కంపెనీలు భావిస్తున్నాయి' అని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ చీఫ్ బిజినెస్‌ ఆఫీసర్‌ మహేశ్‌ భట్‌ అన్నారు.