ITR Filings For FY 2024-25: ఇప్పటి వరకు, మన దేశంలో 9 కోట్లకు పైగా ప్రజలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి (FY25) ఆదాయ పన్ను రిటర్న్‌లు (Income Tax Return Filing) సమర్పించారు. CBDT విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, నమోదిత ఆదాయపన్ను చెల్లింపుదార్లలో (Registered income tax payers) కేవలం 65 శాతం మంది మాత్రమే రిటర్న్‌లు దాఖలు చేశారు.
CBDT (Central Board Of Direct Taxes) రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) మార్చి 16, 2025 వరకు దాఖలైన ఐటీఆర్‌లలో, దాదాపు ఐదు లక్షలకు మంది పన్ను చెల్లింపుదారులు రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్నట్లు ప్రకటించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, 4.69 లక్షల మంది వార్షిక ఆదాయం రూ. 1 కోటి దాటింది. అంటే, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న కోటీశ్వరుల సంఖ్య 4.69 లక్షలు. ప్రస్తుతం, భారతదేశ జనాభా దాదాపు 144 కోట్లు. వీరిలో.. దాదాపు 14 కోట్ల మంది రిజిస్టర్డ్ టాక్స్‌పేయర్స్ ఉన్నారు. అంటే, మొత్తం జనాభాలో రిజిస్టర్డ్ టాక్స్‌పేయర్స్ సంఖ్య 10 శాతం కన్నా తక్కువే. ఈ లెక్క ఇక్కడితోనే అయిపోలేదు. ఈ 14 కోట్ల రిజిస్టర్డ్ టాక్స్ పేయర్స్‌లో కూడా, రూ. 1 కోటి ఆదాయం దాటిన వాళ్లు (కోటీశ్వరులు) 5 లక్షల మంది కూడా లేరు. ఇది ఆశ్చర్యపరిచే విషయమే.
కోటీశ్వరుల లెక్కలు
'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్' సమాచారం ప్రకారం.. 3.89 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు రూ. 1 కోటి నుంచి రూ. 5 కోట్ల మధ్య వార్షిక ఆదాయాన్ని ప్రకటించారు. 36,274 మంది టాక్స్ పేయర్లు రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల మధ్య వార్షిక ఆదాయం ఉన్నట్లు నివేదించారు. 43,004 మంది రూ. 10 కోట్లకు పైగా వార్షిక ఆదాయం ఉన్నట్లు వెల్లడించారు. దీంతో, ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక ఆదాయంగల పన్ను చెల్లింపుదారుల సంఖ్య (రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్లు) 4,68,658కి చేరుకుంది. ఆలస్య రుసుముతో కలిపి ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి చివరి తేదీ (Last date for filing income tax returns) మార్చి 31, 2025. ఈ గడువుకు ఇంకా కొన్ని రోజుల సమయం ఉంది కాబట్టి, ఈ గణాంకాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
65 శాతం మంది మాత్రమే..
CBDT లెక్కల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు 9.11 కోట్లకు పైగా ప్రజలు ITRలు దాఖలు చేశారు. భారతదేశంలో మొత్తం నమోదిత పన్ను చెల్లింపుదారుల సంఖ్య 13.96 కోట్లు. అంటే దాదాపు 65 శాతం మంది మాత్రమే రిటర్న్‌లను దాఖలు చేశారని అర్థం. ITR ఫైల్ చేసిన వాళ్లలో దాదాపు 8.56 కోట్ల మంది ఆ రిటర్న్‌లను ఈ-వెరిఫై చేశారు. ఆదాయ పన్ను విభాగం ఇప్పటి వరకు రూ. 3.92 లక్షల కోట్లను రిఫండ్ (Income tax refund) చేసింది.
రాష్ట్రాల వారీగా...
మహారాష్ట్రలో అత్యధికంగా 1.38 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో 90.68 లక్షల రిటర్న్‌లు దాఖలు కాగా, గుజరాత్‌లో 87.90 లక్షల రిటర్న్‌లు దాఖలయ్యాయి. దిల్లీలో 44.45 లక్షల మంది ఐటీఆర్‌లు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో 30.76 లక్షల మంది, పంజాబ్‌లో 43.79 లక్షల రిటర్న్‌లు దాఖలు చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 16, 2025 మధ్యకాలంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు గత ఆర్థిక సంవత్సరం (FY24) ఇదే కాలంతో పోలిస్తే 16.2 శాతం పెరిగి రూ. 25.86 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆదాయ పన్ను విభాగం గతంలో ప్రకటించింది.