New TDS Rules Will Be Implemented From April 2025: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో, 01 ఏప్రిల్ 2025 నుంచి చాలా ఆర్థిక నియమ, నిబంధనలు మారబోతున్నాయి. వాటిలో టీడీఎస్ (Tax Deducted at Source) ఒకటి. TDS నిబంధనలలో మార్పుల గురించి, ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్‌ (Union Budget 2025) సమర్పిస్తున్నప్పుడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) ప్రకటించారు. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు పన్ను సమ్మతి (tax compliance)ని సరళంగా మార్చడం దీని లక్ష్యం. ఈ సంస్కరణలు పన్ను భారాన్ని తగ్గించడంతో పాటు ఖర్చు చేయగల ఆదాయాన్ని కూడా పెంచుతాయి. 


ఏప్రిల్ 01 నుంచి మారబోయే TDS నియమాలు


సీనియర్ సిటిజన్లకు ఉపశమనం
2025 బడ్జెట్‌లో, కేంద్ర ప్రభుత్వం, వడ్డీ ఆదాయంపై TDS పరిమితిలో సడలింపు ఇచ్చింది. ఇది, దేశంలోని సీనియర్ సిటిజన్‌లతో పాటు మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.  TDS పరిమితిలో సడలింపు ప్రకారం.. ఏప్రిల్ 01, 2025 నుంచి, ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం వడ్డీ ఆదాయం రూ. 1 లక్ష దాటినప్పుడు మాత్రమే FD, RD, ఇతర డిపాజిట్ పథకాలపై TDS కట్‌ చేస్తారు. వడ్డీ ఆదాయం రూ. లక్ష దాటితే, అదనపు మొత్తంపై టీడీఎస్ మినహాయింపు ఉంటుంది. ఇది సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కలిగించే విషయం. ఎందుకంటే, పదవీ విరమణ తర్వాత వారి ప్రధాన ఆదాయ వనరు బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ. 


సాధారణ పన్ను చెల్లింపుదారులకు TDS పరిమితి పెంపు
దేశంలోని సాధారణ పౌరులకు కూడా TDS మినహాయింపు పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న రూ. 40,000 నుంచి రూ. 50,000కు పెంచింది. సాధారణ ప్రజలకు, ఒక ఆర్థిక సంవత్సరంలో, FD సహా డిపాజిట్‌ పథకాలపై రూ. 50,000 వరకు వడ్డీ ఆదాయంపై ఎటువంటి TDS కట్‌ కాదు. ఈ రూల్‌ కూడా ఏప్రిల్ 01, 2025 నుంచి అమల్లోకి వస్తుంది.


గేమింగ్ కోసం కొత్త నియమాలు
లాటరీ, క్రాస్‌వర్డ్ పజిల్స్, గుర్రపు పందాలు వంటి గేమింగ్స్‌ నుంచి వచ్చే ఆదాయంపై TDS రూల్స్‌ను కూడా ప్రభుత్వం మార్చింది. ఈ తరహా గేమింగ్‌లో గెలిచిన మొత్తం రూ. 10,000 కంటే ఎక్కువగా ఉంటేనే TDS కట్‌ అవుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి మూడుసార్లు రూ. 8,000 చొప్పున గెలుచుకున్నాడుకుందాం. ప్రతిసారి గెలిచిన మొత్తం రూ. 10,000 కంటే తక్కువగా ఉన్నందున, కొత్త TDS నియమం ప్రకారం, గెలిచిన మొత్తం రూ. 24,000పై TDS తగ్గదు.


మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు ఉపశమనం
మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి డివిడెండ్ & ఆదాయ మినహాయింపు పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ. 5,000 నుంచి రూ. 10,000 కు పెంచింది. ఇది, పెట్టుబడిదారులకు లభించిన ఉపశమనం.


బీమా, బ్రోకరేజ్ కమిషన్ పై ప్రయోజనం
కొత్త నిబంధనల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం కమీషన్ ఏజెంట్లకు కూడా ఊరట కల్పించింది. బీమా ఏజెంట్లకు టీడీఎస్ మినహాయింపు పరిమితిని రూ. 15,000 నుంచి రూ. 20,000కు పెంచింది. దీనివల్ల, చిన్న బీమా ఏజెంట్లు & కమీషన్ సంపాదించేవారి పన్ను బాధ్యత తగ్గుతుంది.