Rs 1 Lakh Pension From NPS: పదవీ విరమణ సౌకర్యవంతంగా ఉండాలంటే, రిటైర్మెంట్ తర్వాత కూడా నెలవారీ ఆదాయం ఉండాలి. నెలకు కనీసం 1 లక్ష రూపాయలను పెన్షన్‌గా పొందాలని చాలామంది అనుకుంటారు. నెలకు రూ.లక్ష పింఛను పొందేందుకు NPS ఒక ఉత్తమ మార్గం.
ఉద్యోగం లేదా వ్యాపార బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కూడా ఒక వ్యక్తికి క్రమంతప్పని ఆదాయాన్ని అందించే ఆర్థిక సాధనం 'జాతీయ పెన్షన్ సిస్టమ్' (NPS). దీనిని 2004లో స్టార్ట్ చేశారు. ప్రారంభంలో, ప్రభుత్వ ఉద్యోగుల కోసమే దీనిని ప్రారంభించారు. అయితే, కాలక్రమేణా పథకం పరిధిని విస్తరించారు.
2029 మే నెల నుంచి, దేశంలోని పౌరులందరికి కోసం ఎన్‌పీఎస్ తలుపులు తెరిచారు. ఇప్పుడు, అసంఘటిత రంగంలో పని చేస్తున్న వ్యక్తులు కూడా NPS ప్రయోజనాలు పొందొచ్చు. NPSను 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ' (PFRDA) నియంత్రిస్తుంది.
పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు రాకుండా, దూరదృష్టితో, ముందు నుంచే NPSలో పొదుపు చేయొచ్చు. తద్వారా, రిటర్మెంట్ సమయానికి పెద్ద మొత్తంలో సంపదను సృష్టించొచ్చు. ఒక వ్యక్తి, NPS కోసం కాంట్రిబ్యూట్ చేసిన డబ్బును చక్రవడ్డీతో కలిపి తిరిగి పొందుతాడు. ప్రజల్లో పొదుపు అలవాటును పెంచేలా భారత ప్రభుత్వం ఈ స్కీమ్‌ను డిజైన్ చేసింది. ఇది, స్టాక్ మార్కెట్ అనుసంధానిత పథకం. అంటే, స్టాక్ మార్కెట్ పనితీరును బట్టి పెన్షన్ డబ్బు మారుతుంది.
ప్రతి నెలా రూ. 1 లక్ష పెన్షన్ పొందడానికి NPSలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
NPS అనేది రిటైర్‌మెంట్ ఫండ్‌ను నిర్మించడానికి తీసుకొచ్చిన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. NPSలో ఎంత త్వరగా, ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే అంత ఎక్కువ కార్పస్/ఫండ్ సృష్టించొచ్చు. 60 సంవత్సరాల వయస్సులో రిటైర్ అయిన తర్వాత నెలకు రూ. 1 లక్ష ఆదాయాన్ని పొందడానికి, ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి:
- 35 సంవత్సరాల వయస్సు నుంచి NPS కాంట్రిబ్యూషన్ ప్రారంభించాలి
- 6% యాన్యుటీ ఈల్డ్ వచ్చేలా కార్పస్‌లో 80% డబ్బును యూన్యుటీ స్కీమ్‌ల కోసం కేటాయించాలంటే, NPSలో నెలకు రూ. 17,000 జమ చేయాలి.
- యాన్యుటీ కోసం కార్పస్‌లో 40% ఉపయోగించాలంటే, NPS కోసం నెలకు రూ. 34,000 కేటాయించాలి.
- NPS పెట్టుబడిని ఏటా 10% పెంచాలి.
- రెండు సందర్భాల్లోనూ, పదవీ విరమణ తర్వాత నెలకు రూ. 1 లక్ష ఆదాయం పొందొచ్చు.
NPSలో ఎవరు పెట్టుబడి పెట్టొచ్చు?
18 సంవత్సరాల వయస్సు నుంచి 70 సంవత్సరాల వయస్సు మధ్య వయస్సు గల భారత పౌరులందరూ NPS ప్లాన్ (వాలంటరీ మోడల్) తీసుకోవచ్చు. పదవీ విరమణ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ఆదాయ పన్ను ప్రయోజనాలను కూడా పొందగల తెలివైన మార్గం ఇది.
NPS వల్ల ఒనగూరే ప్రయోజనాలు
1. వివిధ పెట్టుబడి ఆప్షన్లు ఉంటాయి. చందాదారుకు సౌకర్యవంతంగా ఉండే ఆప్షన్ ఎంచుకోవచ్చు.
2. ఆదాయ పన్ను భారం తగ్గుతుంది.
3. జమ చేసిన డబ్బుపై చక్రవడ్డీ ప్రయోజనం
4. ఉద్యోగం లేదా పని చేసే ప్రాంతాన్ని మారినప్పటికీ, దీనిలోని పోర్టబిలిటీ లక్షణం వల్ల డబ్బును ఇబ్బంది లేకుండా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
5. PFRDA పర్యవేక్షణ వల్ల అక్రమాలకు తావులేని నిర్వహణ.
6. నామమాత్రపు ఛార్జీలు
7. పెద్దగా చదువుకోని వ్యక్తి కూడా ఈ అకౌంట్‌ను సులభంగా నిర్వహించొచ్చు.
ఆదాయ పన్ను ప్రయోజనాలు
నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టిన పెట్టుబడిపై, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80CCD కింద అదనంగా రూ. 50,000 పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: బయోమెట్రిక్ పనిని పూర్తి చేయకపోతే గ్యాస్ సిలిండర్ ఇవ్వరా?, గవర్నమెంట్ ఏం చెప్పింది?