Biometric Authentication For LPG Consumers: దేశీయ వంట గ్యాస్‌ వినియోగదార్ల కనెక్షన్లకు ఆధార్ ధృవీకరణకు సంబంధించి, కేంద్ర సహజ వాయువు & పెట్రోలియం మంత్రిత్వ శాఖ (Ministry of Petroleum & Natural Gas) ఒక వివరణ విడుదల చేసింది. బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ ధృవీకరణ (Biometric Based Aadhaar Authentication) జరగని ఎల్‌పీజీ కస్టమర్లకు సేవలు, ప్రయోజనాలను నిలిపేస్తారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పింది. అలాంటి ప్రతిపాదన మంత్రిత్వ శాఖ దగ్గర లేదని స్పష్టం చేసింది. అంటే, ఆధార్‌ అథెంటికేషన్‌ లేకపోయినప్పటికీ గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా ఆగదు. LPG వినియోగదార్ల వేలిముద్రల (బయోమెట్రిక్) ఆధారంగా ఆధార్ ప్రామాణీకరణ పనిని పూర్తి చేయడంలో ప్రభుత్వ చమురు కంపెనీలు - ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) బిజీగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


ఆధార్ ప్రామాణీకరణ ఎందుకు?
ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (Direct Benefit Transfer) పథకాల కోసం ఆధార్ ప్రామాణీకరణ వల్ల నిజమైన లబ్ధిదార్లను ఖచ్చితంగా, రియల్‌ టైమ్‌లో, తక్కువ ఖర్చుతో గుర్తించడానికి వీలవుతుందని మంత్రిత్వ శాఖ వివరించింది. అక్రమాలను, నకిలీ వ్యక్తులను గుర్తించి, నిరోధించడంలోనూ ఇది సాయపడుతుందని ఆ వివరణలో మినిస్ట్రీ వెల్లడించింది. 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన' (Pradhan Mantri Ujjwala Yojana) కింద కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేయడానికి బయోమెట్రిక్ ఆధారిత ఆధార్‌ గుర్తింపు కచ్చితంగా అవసరమని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన 'వికాసిత్‌ భారత్ సంకల్ప్' క్యాంపుల్లో, 35 లక్షల మంది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదార్ల ఆధార్ ధృవీకరణ జరిగిందని ప్రకటించింది.


ఆధార్‌ ప్రామాణీకరణ పూర్తి చేసే గడువు
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, పహల్ పథకం లబ్ధిదార్ల బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ గుర్తింపును పూర్తి చేయాలని గత ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వ చమురు కంపెనీలకు (Oil Marketing Companies) ఆదేశాలు జారీ చేసినట్లు సహజ వాయువు & పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చమురు కంపెనీలు గానీ, ప్రభుత్వం గానీ ఎలాంటి గడువు విధించలేదని చెప్పారు. దేశీయ LPG వినియోగదార్లు, గ్యాస్‌ సిలిండర్‌ను ఇంటి వద్ద డెలివెరీ చేసినప్పుడు లేదా LPG డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఆధార్ ప్రామాణీకరణ (eKYC based aadhar authentication for LPG customers) పూర్తి చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. లేదా, లబ్ధిదారు ఏ కంపెనీ నుంచి గ్యాస్‌ సిలిండర్‌ పొందుతుంటే, ఆ కంపెనీ యాప్‌లోకి వెళ్లి ఆధార్ ప్రామాణీకరణ పనిని పూర్తి చేయవచ్చని కూడా మినిస్ట్రీ వెల్లడించింది.


LPG వినియోగదార్ల బయోమెట్రిక్‌ ఆధారిత ఆధార్ ప్రామాణీకరణ గురించి కేంద్ర సహజ వాయువు & పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి (Hardeep Singh Puri) సోషల్ మీడియా వేదికగా కూడా విజ్ఞప్తి చేశారు. కొందరు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు బోగస్ కస్టమర్ల పేరుతో వాణిజ్య సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారని తెలిపారు.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి