Best Investments for Girl Child in India: ఈ రోజు ‍‌(24 జనవరి 2024), జాతీయ బాలికల దినోత్సవాన్ని (National Girl Child Day 2024) దేశం జరుపుకుంటోంది. ఈ ప్రత్యేకమైన రోజున, మీ కుమార్తెకు ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకుంటే, ఈ 10 ఆప్షన్లను మీరు పరిశీలించవచ్చు. ఈ ఆప్షన్లు మీ కుమార్తె భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుతాయి.


ఆడపిల్లల కోసం 10 ఉత్తమ పెట్టుబడి ఎంపికలు (10 Best Investments for Girl Child)


1. సుకన్య సమృద్ధి యోజన (SSY)
మీ కుమార్తె ఉన్నత చదువు, వివాహం కోసం ఈ ఖాతా ద్వారా పొదుపు స్టార్ట్‌ చేయవచ్చు. మీ కుమార్తెకు 10 ఏళ్ల వయస్సు వచ్చేలోపు ఎప్పుడైనా SSY ఖాతా తెరవవచ్చు. ఈ ఖాతాలో జమ చేసే డబ్బుపై, ప్రస్తుతం, ఏడాది 8.20% శాతం వడ్డీ ఇస్తున్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250, గరిష్టంగా రూ. 1,50,000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. అమ్మాయికి 21 ఏళ్లు వచ్చేసరికి SSY అకౌంట్‌ మెచ్యూర్ అవుతుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద EEE (ఎగ్జెంప్ట్‌, ఎగ్జెంప్ట్‌, ఎగ్జెంప్ట్‌) ప్రయోజనం లభిస్తుంది. అంటే.. ఈ పథకంలో పెట్టే పెట్టుబడి, వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ డబ్బు.. ఈ మూడింటిపై పూర్తిగా పన్ను మినహాయింపు లభిస్తుంది. 


2. పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్ (POTD)
మీ కుమార్తె కోసం మరో మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌ ఇది. ఒక ఏడాది నుంచి 5 సంవత్సరాల వరకు వివిధ కాల పరిమితుల్లో ఈ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. దీనిని దేశంలో ఏ పోస్టాఫీస్‌కైనా బదిలీ చేయవచ్చు. ఎంచుకున్న మెచ్యూరిటీ పిరియడ్‌ను బట్టి 7.50% వరకు వడ్డీ లభిస్తుంది. 5-సంవత్సరాల కాలపరిమితి కలిగిన POTDపై, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.


3. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ (PORD)
ప్రతి నెలా చిన్న మొత్తాలను ఆదా చేసుకునేందుకు వీలు కల్పించే పోస్టాఫీసు పొదుపు పథకాల్లో ఇది ఒకటి. నెలకు కేవలం రూ.100తో ఖాతా ప్రారంభించొచ్చు. 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లపై 6.7 శాతం వడ్డీ ఆదాయం ఉంటుంది. కావాలనుకుంటే, 5 సంవత్సరాల తర్వాత పొడిగించవచ్చు.


4. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)
ఆడపిల్లల భవిష్యత్‌ కోసం ప్రజాదరణ పొందిన మరొక పోస్టాఫీసు పొదుపు పథకం ఇది. NSC మెచ్యూరిటీ పిరియడ్‌ 5 సంవత్సరాలు. ప్రస్తుతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై ‍‌వడ్డీ రేటు (NSC Interest rate) 7.7 శాతంగా ఉంది. కనీస డిపాజిట్ రూ.1,000, గరిష్ట పరిమితి లేదు. సెక్షన్ 80C కింద పన్ను భారం తగ్గుతుంది.


5. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
PPF కనీస మెచ్యూరిటీ పిరియడ్‌ 15 సంవత్సరాలు. ఆ తర్వాత మరో 5 సంవత్సరాల చొప్పున పెంచుకుంటూ వెళ్లే అవకాశం ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో, దీనిలో కనిష్ట పెట్టుబడి రూ. 500, గరిష్ట పెట్టుబడి రూ. 1.5 లక్షలు. దీనికి కూడా EEE టాక్స్‌ ఫీచర్ వర్తిస్తుంది. ప్రస్తుతం PPF అకౌంట్‌ మీద 7.10% వడ్డీ ఆదాయం లభిస్తోంది. 


6. చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ (Children Gift Mutual Fund)
మీ కుమార్తె ఉన్నత చదువులు లేదా వివాహం కోసం, దీర్ఘకాలం పెట్టుబడితో పెద్ద మొత్తంలో డబ్బు సృష్టించాలనుకుంటే ఈ ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. ఈ ఫండ్స్‌ ఈక్విటీ & డెట్ కలయికతో ఉంటాయి. మీ పాపకు 18 ఏళ్లు వచ్చే వరకు లాక్‌-ఇన్‌ పిరియడ్‌ ఉంటుంది. 


7. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)
మీ కుమార్తె కోసం క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికతో, దీర్ఘకాలంలో పెద్ద కార్పస్‌ సృష్టించొచ్చు. SIP స్టార్ట్‌ చేయగానే, ప్రతి నెలా మీరు సేవ్‌ చేయాలనుకున్న డబ్బు మీ ఖాతా నుంచి కట్‌ అవుతుంది. ఆ డబ్బు మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడిగా వెళ్తుంది. నెలకు కనీసం 100 రూపాయలతోనూ సిప్‌ చేయవచ్చు.


8. గోల్డ్ ఈటీఎఫ్‌లు (Gold ETFs)
ఆడపిల్లలకు బంగారం పెట్టడం మన సంప్రదాయం. దీనికోసం, ఫిజికల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసే బదులు గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టొచ్చు. దీనిని, మ్యూచువల్ ఫండ్ తరహాలో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఒక గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ ఒక గ్రాము బంగారంతో సమానం. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంటర్‌ కావచ్చు, ఎగ్జిట్‌ కావచ్చు. చాలా చిన్న మొత్తాలతోనూ దీనిలో పెట్టుబడి స్టార్ట్‌ చేయవచ్చు. తరుగు, మజూరీ వంటి అదనపు భారం దీనిలో ఉండదు.


9. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (ULIP)
చైల్డ్ యులిప్‌లు చాలా ప్రయోజనాలు అందిస్తాయి. కుటుంబ పెద్ద చనిపోతే, పిల్లల స్కూల్‌ ఫీజుల రూపంలో నెలనెలా కొంత డబ్బు వస్తుంది. భవిష్యత్ ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేదు. మెచ్యూరిటీ టైమ్‌ పూర్తి కాగానే ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు తిరిగి వస్తుంది.


10. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Fixed Deposit)
అందరికీ తెలిసిన పెట్టుబడి సాధనం ఇది. కేవలం రూ.1,000తో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. కొన్ని నెలల నుంచి సంవత్సరాల వరకు, నిరిష్ట టైమ్‌ పిరియడ్‌తో డబ్బును డిపాజిట్‌ చేయవచ్చు. లాంగ్‌టర్మ్‌ ఎఫ్‌డీ వల్ల పెద్ద మొత్తంలో డబ్బు పోగవుతుంది, మీ పాప భవిష్యత్‌కు పనికొస్తుంది.


మరో ఆసక్తికర కథనం: ఈ రోజు చాలా స్పెషల్‌, తక్కువ ఖర్చుతో మీ కుమార్తెకు గొప్ప చదువును గిఫ్ట్‌గా ఇవ్వండి