National Girl Child Day 2024 Gift: ఈ రోజు, 'జాతీయ బాలికల దినోత్సవం'. మీ కుమార్తెకు ఈ రోజు మీరు ఏదైనా గిఫ్ట్‌ ఇవ్వానుకుంటే, అది ఆమె భవిష్యత్తును ఉజ్వలంగా మార్చేలా ప్లాన్‌  చేయండి. మీ దగ్గర ఏ ఐడియా లేకపోతే, మేం మీకు ఆలోచన సాయం చేస్తాం. 


మీరు ప్రేమించే కుమార్తెకు, జాతీయ బాలికల దినోత్సవం 2024 రోజున, మీరు ఇవ్వగల గొప్ప బహుమతి 'సుకన్య సమృద్ధి యోజన' ఖాతా (SSY Account). ఈ స్కీమ్‌ మీ కుమార్తె భవిష్యత్తుకు మెరుగులు దిద్దుతుంది. ఆమె ఉన్నత చదువుల కోసం డబ్బు కూడబెడుతుంది, మీపై ఆర్థిక భారాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.


National Girl Child Day 2024: సుకన్య సమృద్ధి యోజన ఖాతా వివరాలు ‍‌(Sukanya Samriddhi Yojana Account Details) 
మీకు దగ్గరలోని బ్యాంక్‌ లేదా పోస్టాఫీస్‌లో, సుకన్య సమృద్ధి యోజన కింద మీ కుమార్తె పేరిట ఒక ఖాతా ప్రారంభించొచ్చు. ఇది ప్రభుత్వ పథకం కాబట్టి, మీ పెట్టుబడి + రాబడికి గ్యారెంటీ ఉంటుంది. ఇందులో, నెలకు కొంత సొమ్ము చొప్పున లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే విడతలో డబ్బు డిపాజిట్‌ చేయొచ్చు.


ఈ పథకాన్ని కేవలం ఆడపిల్లల కోసమే ప్రత్యేకంగా ప్రారంభించారు. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల కోసం.. ఆమె పేరుతో తల్లిదండ్రులు లేదా గార్డియన్‌ SSY ఖాతాను ప్రారంభించొచ్చు. ఆడపిల్ల పుట్టిన వెంటనే SSY అకౌంట్‌ స్టార్ట్‌ చేస్తే, బాలికకు 14 ఏళ్లు నిండే వరకు (15 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు) ఆ ఖాతాలో డబ్బు జమ చేస్తే సరిపోతుంది. పాపకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత, అప్పటి వరకు పెట్టిన పెట్టుబడిలో సగం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది, మీ కుమార్తె ఉన్నత చదువుల కోసం (for girl's higher studies) పనికొస్తుంది. పాపకు 21 ఏళ్లు నిండిన తర్వాత, ఆ ఖాతాలో ఉన్న మొత్తం పెట్టుబడిని వెనక్కు తీసేసుకోవచ్చు. ఇది, ఉన్నత చదువులు లేదా వివాహ ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది. అంటే, మీ కూతురి ఉన్నత చదువుల నుంచి పెళ్లి ఖర్చుల వరకు ఈ పథకమే భరిస్తుంది.


National Girl Child Day 2024:సుకన్య సమృద్ధి ఖాతా వడ్డీ రేటు ‍‌(Sukanya Samriddhi Account Interest Rate 2024)
సుకన్య సమృద్ధి యోజన ఖాతా మీద, ప్రస్తుతం, ఏడాదికి 8.20% వడ్డీ రేటును ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ వడ్డీ రేటు త్రైమాసిక ప్రాతిపదికన మారవచ్చు.


సుకన్య సమృద్ధి ఖాతాలో, ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం ఒక లావాదేవీ చేయాలి, కనిష్టంగా 250 రూపాయలైనా జమ చేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షలకు మించకుండా ఎంతైనా, ఎన్నిసార్లయినా జమ చేయవచ్చు.


మీ పాప ఒక సంవత్సరం వయస్సు ఉందనుకుందాం. ఈ ఏడాది మీరు SSY ఖాతాలో సంవత్సరానికి 1.50 లక్షల రూపాయలు (నెలకు రూ.12,500‌) పెట్టుబడి పెడితే. ప్రస్తుతమున్న 8.20% వడ్డీ రేటు ప్రకారం, అమ్మాయికి 21 ఏళ్లు వచ్చినప్పుడు, SSY మెచ్యూరిటీ మొత్తం దాదాపు రూ. 69,27,578 అవుతుంది. ఇందులో మీ పెట్టుబడి రూ. 22,50,000 అయితే, మీకు వచ్చిన వడ్డీ రూ. 46,77,578 అవుతుంది. 


https://groww.in/calculators/sukanya-samriddhi-yojana-calculator లింక్‌లోని 'గ్రో' సుకన్య సమృద్ధి యోజన కాలిక్యులేటర్‌ను ఉపయోగించి... మీ పాప వయస్సు, మీ పెట్టుబడి ఆధారంగా, ఖాతా మెచ్యూరిటీ సమయంలో ఎంత డబ్బు మీ చేతికి వస్తుందో లెక్కించొచ్చు.


National Girl Child Day 2024:ఆదాయ పన్ను ఆదా (Income tax savings)
సుకన్య సమృద్ధి ఖాతాలో జమ చేసే డబ్బుపై ఆదాయ పన్ను తగ్గుతుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు పొందొచ్చు. అంతేకాదు, ఈ ఖాతా ద్వారా వచ్చే వడ్డీ డబ్బు + మెచ్యూరిటీ మొత్తంపై కూడా పన్ను ఉండదు (tax-free).


మరో ఆసక్తికర కథనం: టాక్స్‌ స్లాబ్స్‌లో మార్పులు ఉంటాయా, ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు?