Multibagger Stocks: ఆగస్టు నెలలో ఇన్వెస్టర్లు డబ్బుల పంట పడించారు. ఈక్విటీ మార్కెట్లు సైతం గరిష్ఠ స్థాయిలకు చేరాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మళ్లీ భారత్‌లో పెట్టుబడులు పెడుతుండటంతో ఈక్విటీ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. బీఎస్‌ఈ 500లోని తొమ్మిది కంపెనీల షేర్ల ధరలు ఆగస్టులో ఏకంగా 30-45 శాతం వరకు పెరిగాయి.


పరిస్థితుల్లో మెరుగుదల


అంతర్జాతీయంగా పరిస్థితులు మెరుగు పడుతుండటం, కమోడిటీ ధరలు తగ్గుముఖం పట్టడం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం తగ్గడం, యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు వేగం మందగించడంతో ఆగస్టులో స్టాక్‌ మార్కెట్లు ఎగిశాయి. చివరి వారంలో అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు ఆపబోమని చెప్పడంతో రెండురోజులు మార్కెట్లు డీలా పడ్డాయి. అయినప్పటికీ కొన్ని స్టాక్స్‌ మాత్రం దూకుడు కొనసాగించాయి.


బీఈఎంఎల్‌ సూపర్


బీఈఎంఎల్‌ కంపెనీ షేరు ధర ఆగస్టులో ఏకంగా 44.87 శాతం పెరిగింది. జూన్‌ ఆఖర్లో రూ.1274గా ఉండగా ఆగస్టు చివరికి రూ.1846కు చేరుకుంది. డీమెర్జర్‌ ప్రక్రియ, స్ట్రాటజిక్‌ డిజిన్వెస్ట్‌మెంట్‌ వేగవంతం కావడంతో విశ్లేషకులు సానుకూలంగా ఉన్నారు. రూ.9100 కోట్ల విలువైన ఆర్డర్‌ బుక్‌ ఉండటంతో రాబోయే 2-3 ఏళ్లలో రాబడి మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జేఎస్‌ డబ్ల్యూ ఎనర్జీ షేరు 43.11 శాతం పెరిగింది. రూ.238 నుంచి రూ.341కి చేరుకుంది.


ఇవన్నీ కేక పెట్టించాయ్‌


మజాగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ షేరు ఆగస్టులో 40.52 శాతం ఎగిసింది. షేరు ధర రూ.391కి పెరిగింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో వార్షిక ప్రాతిపాదికన కంపెనీ లాభం 134 శాతం పెరిగి రూ.217 కోట్లుగా ఉంది. నిర్వాహక ఆదాయం వార్షిక ప్రాతిపదికన రూ.2,230 కోట్లుగా ఉంది. ఎంఏఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, హికాల్‌, ఎల్గి ఎక్విప్‌మెంట్స్‌ 35-40 శాతం వరకు పెరిగాయి. ఆర్బీఎల్‌ బ్యాంకు, అదానీ పవర్‌, ఐడీఎఫ్సీ ఫస్ట్‌ బ్యాంక్ 30-33 శాతం ఎగిశాయి.


దీపావళికి మరింత బూమ్‌


ప్రపంచంలోని అన్ని మార్కెట్లతో పోలిస్తే భారత ఈక్విటీ సూచీలు మెరుగైన ప్రదర్శన చేస్తున్నాయని అంబిత్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ మేనేజర్‌ ఐశ్వర్య దధీచ్‌ అంటున్నారు. ద్రవ్యోల్బణం ఆందోళన ఉన్నప్పటికీ కంపెనీల లాభదాయకత బాగుందని అంచనా వేశారు. దీపావళి సమయంలో మార్కెట్లు మరింత పుంజుకుంటాయని వెల్లడించారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.